Nara Lokesh: అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు లోకేష్.. అచ్చిరాని ఉత్తరాంధ్ర

వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు మాత్రం ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. ఉత్తరాంధ్రలో సక్సెస్ ఫుల్ గా నడిచారు. 2003లో రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేశారు.

Written By: Dharma, Updated On : November 23, 2023 10:41 am

Nara Lokesh

Follow us on

Nara Lokesh: ఉత్తరాంధ్ర టిడిపి శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. అప్పట్లో చంద్రబాబు పాదయాత్ర విశాఖ తో ముగిసింది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర సైతం అక్కడితో ముగియనుందని తెలియడంతో ఉత్తరాంధ్రలోని టిడిపి శ్రేణులు డీలా పడ్డాయి. లోకేష్ పాదయాత్రతో ఒక ఊపు వస్తుందని భావించిన నేతలకు నిరాశ మిగిలింది. ఈ నెల 27 నుంచి లోకేష్ పాదయాత్ర పున ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తొలుత నిర్ణయించుకున్న షెడ్యూల్ ను కుదించి విశాఖ వరకే ఆయన పాదయాత్ర చేపడతారని తెలుస్తోంది.

అప్పట్లో చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. 2012 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి చంద్రబాబు పాదయాత్ర చేశారు. ” వస్తున్నా మీకోసం ” పేరిట 13 జిల్లాల్లో 2817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 2013 ఏప్రిల్ 28న విశాఖలోని అగనంపూడి వద్ద చంద్రబాబు యాత్ర ముగిసింది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర సైతం విశాఖలో ముగిస్తారని టాక్ నడుస్తుంది. చంద్రబాబు అరెస్టుతో రాజోలు నియోజకవర్గం లో నిలిచిపోయిన పాదయాత్రను లోకేష్ ప్రారంభించనున్నారు. అయితే ఇచ్ఛాపురం వరకు యాత్ర చేయాలంటే మరికొన్ని రోజులు పాటు నడవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అది చాలా కష్టతరమని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే విశాఖ పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర టిడిపి శ్రేణులు నిరాశకు గురయ్యాయి. అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు లోకేష్ పాదయాత్రలు విశాఖతో ముగిస్తుండడం సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు సమాచారం.

వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు మాత్రం ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. ఉత్తరాంధ్రలో సక్సెస్ ఫుల్ గా నడిచారు. 2003లో రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు నడిచారు. అదే పరంపరను జగన్ కొనసాగించారు. అవశేష ఏపీలో 2018లో పాదయాత్ర చేశారు. కడప జిల్లా పులివెందుల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సుదీర్ఘకాలం నడిచారు. అయితే ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి.. ఉత్తరాంధ్రలో తమ పార్టీలను విజయతీరాలకు చేర్చారు. అయితే వైయస్ షర్మిల సైతం పాదయాత్ర చేశారు. కానీ ఆమె విశాఖకే పరిమితం అయ్యారు.

ఉత్తరాంధ్రలో టిడిపికి పట్టు ఉంది. కానీ గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతింది. 32 నియోజకవర్గాలకు గాను.. ఆరు స్థానాలకి పరిమితం అయింది. అయితే గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ పూర్వవైభవానికి నాయకులు కృషి చేస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టిడిపి బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ పాదయాత్ర ఉంటే పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని నేతలు ఆశించారు. కానీ వారికి షాక్ ఇస్తూ పాదయాత్ర షెడ్యూల్ ను కుదించినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపించడంతోనే షెడ్యూల్ మారిందని.. వీలైనంతవరకు చంద్రబాబుతో పాటు లోకేష్ పర్యటనలు ఉత్తరాంధ్రలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.