Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కదలిక: అరెస్ట్‌ తప్పదా?

బుచ్చిబాబును ఏఏ అంశాల మీద ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారో స్పష్టత లేదు. అయితే ఢిల్లీ వర్గాల అంచనా మేరకు కవితను ఎప్పుడైనా అరెస్ట్‌ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.

Written By: Bhaskar, Updated On : September 7, 2023 8:36 pm

delhi-liquor-scam

Follow us on

Delhi Liquor Scam: : తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు అస్సాం, ఉత్తరప్రదేశ్‌, ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకునేందుకు పర్యటించారు. ప్రజల నాడి తెలుసుకునేందుకు వారిని వివిధ రకాల ప్రశ్నలు అడిగారు. ఈసందర్భంగా ప్రజల నుంచి ‘ ఆమె అరెస్ట్‌ ఎప్పుడు?, ఇంతకీ చేస్తారా? లేదా?, మీరూ, మీరూ ఒక్కటే అంటగా? గల్లీలో వైరం, ఢిల్లీలో స్నేహం కొనసాగిస్తున్నారట కదా’ అనే ప్రశ్నలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఎదురయ్యాయి. ఇదే నివేదికను వారు బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కొంతకాలానికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఖమ్మంలో భారీ సభ నిర్వహించారు. ఆ తర్వాత పరిణామాలు మారిపోవడం ప్రారంభమమ్యాయి.

అమిత్‌ షా ఢిల్లీ వెళ్లిన తర్వాత

ఖమ్మం సభ అనంతరం విజయవాడ మీదుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి ఫోన్‌ వచ్చింది. కొద్ది రోజుల అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లారు. పేరుకు అభ్యర్థుల కూర్పు అని చెబుతున్నప్పటికీ తెర వెనుక జరిగింది వేరే అనే తెలుస్తోంది. మీడియాకు మాత్రం అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని లీకులు ఇచ్చారు. ఢిల్లీ మీడియా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. కానీ అక్కడి మీడియా కూడా అసలు విషయాన్ని పసిగట్టలేకపోయింది. కిషన్‌రెడ్డితో చర్చలు జరగగానే ఆయన హైదరాబాద్‌ వచ్చారు. ఆయన హైదరాబాద్‌ వచ్చిన వెంటనే ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కదలిక వచ్చింది.

మళ్లీ ప్రశ్నిస్తున్నారు

తెలంగాణలో క్షేత్రస్థాయిలో తిరిగిన ఇతర ప్రాంతాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు నివేదిక ఇవ్వడంతో అధిష్ఠానం ఒక్కసారి అలర్ట్‌ అయింది. ఫలితంగా ఇన్ని రోజులు కోల్డ్‌ స్టోరేజీలో ఉన్న లిక్కర్‌ స్కాంలో కదలిక వచ్చింది. తాజాగా కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబును ఢిల్లీకి ఈడీ పిలిపించింది. రెండు రోజుల నుంచి ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సౌత్‌ లాబీలో నగదు బదిలీ విషయంలో బుచ్చిబాబు కీలకపాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. తమకు అందిన ఆధారాలతో ఈడీ అధికారులు బుచ్చిబాబును గతంలో చాలా సార్లు ప్రశ్నించారు. ఆయనను అరెస్ట్‌ కూడా చేశారు. కోర్టు అనుమతిలో కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.

ఏఏ అంశాలపైనో?

తాజాగా బుచ్చిబాబును ఏఏ అంశాల మీద ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారో స్పష్టత లేదు. అయితే ఢిల్లీ వర్గాల అంచనా మేరకు కవితను ఎప్పుడైనా అరెస్ట్‌ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే గతంలోనూ ఇదే తరహా సీన్‌ క్రియేట్‌ అయింది. అరెస్ట్‌ రేపో, మాపో అని ప్రచారం జరగడం, తర్వాత చప్పున చల్లారిపోవడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ కేసులో పలువురు అప్రూవర్లుగా మారిపోవడం, దానికి సీఐబీ, ఈడీ అంగీకరించడం.. వారు బెయిల్‌ పొందడం జరిగాయి. అయితే సౌత్‌ లాబీకి చెందిన వారికి మాత్రమే ఆ అవకాశం లభించింది. ఉత్తరాదికి చెందిన వారు ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్‌ సొసోడియాకు ఇంకా బెయిల్‌ లభించలేదు. తెలంగాణలో ఎన్నికల వేళ మళ్లీ ఒక్కసారిగి పరిణామాలు మారిపోతున్నాయి. అయితే దీని వెనుక బీజేపీ ఇంకా పెద్ద స్కెచ్‌ ఏమైనా వేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు బీజేపీ విషయంలో బీఆర్‌ఎస్‌ కూడా అంత దూకుడుగా ఏమీ లేదు. బీఆర్‌ఎస్‌ విస్తరణ కూడా ఆశించినంత వేగంగా లేదు. దీనికి తోడు ఇటీవలి కాలంలో మహారాష్ట్రలో కేసీఆర్‌ పర్యటనల తగ్గించుకున్నారు. ఇటీవల సోలాపూర్‌లో జరిగిన పర్యటనకు కేసీఆర్‌ కాకుండా హరీష్‌రావును పంపారు.