Ram Mandir: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. 500 ఏళ్ల భారతీయుల స్వప్నం జనవరి 22 నెరవేరబోతోంది. మధ్యాహ్నం 12:29:08 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు మోదీ కూడా మానసికంగా, శారీరకంగా సంసిద్ధులవుతున్నారు. ఇందుకోసం ఆయన అనుష్టానం చేస్తున్నారు. రాముడితో దేశవ్యాప్తంగా అనుబంధం ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర నాసిక్‌లోని మహాకుండ్ కాలారామ్ ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి వీరభద్ర ఆలయం, కేరళలోని గురువాయర్ ఆలయం, త్రిప్రయార్ రామస్వామి ఆలయాలను ఇప్పటికే దర్శించుకున్నారు. తాజాగా తమిళనాడులోని ఆలయాలను సందర్శిస్తున్నారు. శనివారం (జనవరి 20న) శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు.
శ్రీరంగనాథుని బహుమతి..
శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీకి అయోధ్యలోని రామమందిరానికి తీసుకెళ్లేందుకు పూజారులు బహుమతిని అందజేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని పురాతన ఆలయంలో ప్రధాన అర్చకుల తరపున, అయోధ్యలోని రామమందిరానికి తీసుకెళ్లడానికి ఒక బుట్టలో ప్రధానికి బహుమతిని అందించారు. ఈ సందర్భంగా మోదీ తమిళ కవి కంబార్ రచించిన 12వ శతాబ్దపు ఇతిహాసం ‘కంబరామాయణం’లోని శ్లోకాలను విన్నారు.
ధనుష్కోటిలో పూజలు..
ఇక తమిళనాడులోని ధనుష్కోటిని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించనున్నారు. అక్కడి శ్రీకోదండరామస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. తర్వాత రామసేతు నిర్మించిన ప్రదేశమైన అరిచల్మునైని కూడా సందర్శిస్తారు. ఉదయం 9:30 గంటలకు మునై పాయింట్‌కు చేరుకుంటారు. 10:45 గంటలకు కోదండరామస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. విభీషణుడు శ్రీరాముడిని మొదటిసారిగా కలుసుకుని శరణు కోరింది ఇక్కడే అని చెబుతారు. శ్రీరాముడు విభీషణుని పట్టాభిషేకం జరిపించిన ప్రదేశం ఇదేనని విశ్వసిస్తారు.