Modi Punjab Tour Controversy : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పంజాబ్ వెళ్లి అక్కడ పంజాబ్ నిరసనకారుల వల్ల రోడ్డుపై 20 నిమిషాలు చిక్కుకుపోవడం పెనుదుమారం రేపింది. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా భద్రతా లోపం కారణంగా రోడ్డుపై ఆగిపోవడం తీవ్రమైన విషయమని మాజీ భద్రతా అధికారులు అంటున్నారు. ప్రధాని పర్యటనలో ఎస్పీజీ దళాలు కీలకంగా వ్యవహరిస్తాయి. ప్రధాని ఎక్కడ పర్యటిస్తారో అక్కడికి ముందుగానే వెళ్లి ఏర్పాట్లు పూర్తి చేస్తారు. అయితే భద్రతా కల్పించాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర హోంశాఖదే. దీంతో కేంద్ర హోంశాఖ ఈ విషయంపై సీరియస్ అయ్యింది. రాష్ట్ర హోంశాఖకు నోటీసులు అందించి నివేదిక ఇవ్వాలని కోరింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చన్నీ మాత్రం ‘భద్రతా లోపం లేదని’ అంటున్నారు. దీంతో అసలు ప్రధానికి భద్రతా ఎలా ఉంటుంది..? ఆయన పర్యటన వివరాలు ఎవరు చూసుకుంటారు..?

ప్రధానమంత్రి హోదాలో ఎవరున్నా.. ఆయన పర్యటనకు ముందే విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతాయి. ఏదైనా ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి వెళితే దాని కోసం భిన్నమైన ఏర్పాట్లు చేస్తారు. ర్యాలీలు కాకుండా మరేదైనా ఇతర కార్యక్రమాలకు వెళితే వాటికోసం మారో రకమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. ప్రతీ అడుగులో ఆయనకు భద్రత ఉంటుంది. ఏ పర్యటనకు ముందైనా అక్కడికి వెళ్లి ఎస్పీజీ (ప్రత్యేక భద్రతా బృందం) రెక్కీ నిర్వహిస్తుంది. ఆ తరువాత కొన్ని ఎస్పీజీ బృందాలు అక్కడ మోహరిస్తాయి. రాష్ట్రానికి చెందిన భద్రతా ఏజెన్సీతో ఇంటెలిజెన్స్ బ్యూరో నిరంతర సంప్రదింపులు జరుపుతూనే ఉంటుంది. 1984లో భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగిన తరువాత ఎస్పీజీ బృందం పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఎస్పీజీ కోసం వార్షిక బడ్జెట్లో రూ.375 కోట్ల కంటే ఎక్కువే కేటాయిస్తారు.
పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ ఫూర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రధాని బుధవారం బటిండా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్ లో ఫిరోజ్ ఫూర్ కు బయలు దేరారు. అయితే బటిండా నుంచి ఫిరోజ్ పూర్ కు 110 కిలోమీటర్లు. వాస్తవానికి అక్కడి నుంచి హెలీక్యాప్టర్లో వెళ్లాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో అప్పటికప్పుడు రోడ్ మ్యాప్ ను ప్రకటించారు. దీనికి రాష్ట్ర హోం శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చింది.
అయితే ఫిరోజ్ ఫూర్ చేరుకునే ముందు హుస్సైనీవాలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించాల్సి ఉంది. హుస్సైనీవా 20 కిలోమీటర్లు ఉందనగా ఫ్లైఓవర్ పై కొందరు నిరసన కారులు ప్రధాని కాన్వాయ్ కి అడ్డుగా నిలిచారు. దీంతో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సమయంలో రాష్ట్ర పోలీసులు వారిని చెదరగొట్టాల్సింది పోయి చర్చలు జరుపుతూ కాలయాపన చేయడంతో ప్రధాని భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. సాధారణ రోజుల్లో నిరసనకారులతో చర్చలు పెట్టాలి. అవసరమనుకుంటే వారిని బలవంతంగానైనా పక్కకు తప్పించాలి. అంతేకాకుండా రాష్ట్ర పోలీసులు ప్రధాని కాన్వాయ్ ని అలాగే ఫ్లై ఓవర్ పై ఉంచేయడంతో వెంటనే ఎస్పీజీ బృందం పర్యటనకు అడ్డు చెప్పింది. దీంతో ప్రధాని తన పర్యటనను విరమించుకొని తిరిగి వెళ్లారు.
అయితే ప్రధాని తిరిగొచ్చిన తరువాత ‘నేను ప్రాణాలతో తిరిగొచ్చినందుకు మీ సీఎంకు ధన్యవాదాలు తెలపండి’ అని మోదీ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. దీంతో కేంద్ర హోం శాఖ సీరియస్ అయి రాష్ట్ర హోంశాఖ నుంచి నివేదిక కోరింది. ఇది పూర్తిగా రాష్ట్ర పోలీసుల భద్రతా లోపమే కారణమని కేంద్ర హోంశాఖ ఆరోపిస్తోంది. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రధాని ర్యాలీ నిర్వహించే చోట జనం లేరని ప్రధాని వెనక్కి వెళ్లారని విమర్శలు చేస్తున్నారు. పూర్తిగా పంజాబ్ రాష్ట్ర పరిధిలోని భద్రతను గాలికి వదిలేయడంతోనే ప్రధాని మోడీకి ఈ పరిస్థితి ఎదురైందని చెప్పొచ్చు.