Miss World 2021 1st runner-up Shree Saini story: అందం అంటే…. ముగ్ధమనోహర రూపం కాదు.. భౌతికంగా కనిపించేదే కాదు.. చూసే చూపును బట్టి ఆ అందం ఉంటుంది. మంచి మనసు ఉంటే కొందరు అందగత్తెలు అవుతారు.. మంచి రూపం ఉంటే కొందరినీ అపురూపరాశిగా చూస్తారు. ప్రపంచ అందాల పోటీల్లో కేవలం అందమే కాదు.. అన్నీ చూసే మిస్ వరల్డ్ గా ఎంపిక చేస్తారు. అయితే తాజాగా భారత మిస్ వరల్డ్ పోటీదారు ప్రపంచ అందాల పోటీల్లో విఫలమైనా.. అమెరికా నుంచి పాల్గొన్న ఇండో అమెరికన్ శ్రీశైని మాత్రం సత్తా చాటింది. మొదటి రన్నరప్ గా నిలిచింది. కానీ ఒకప్పుడు ఆమె ముఖం గుర్తుపట్టకుండా అందవిహీనంగా ఉందన్న విషయం మీకు తెలుసా? ముఖాన్ని సైతం కోల్పోయిన ఈమె ఇప్పుడు ప్రపంచ అందగత్తెగా ఎలా ఎదిగిందన్నది ఎవరికీ తెలియని విషయం.

మిస్ వరల్డ్ 2021 గ్రాండ్ ఫినాలే గురువారం ముగిసింది. పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా కిరీటాన్ని గెలుచుకుని తన దేశం గర్వించేలా చేసింది. మిస్ వరల్డ్ విజేత కరోలినా బిలావ్స్కాకు 2019 విజేత జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ కిరీటాన్ని అందజేసింది. భారతదేశానికి చెందిన మానస వారణాసి టాప్ 3లోకి రాలేకపోయింది. అయితే అమెరికాకు చెందిన భారతీయ-అమెరికన్ శ్రీసైనీ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2021లో మొదటి రన్నరప్‌గా నిలవడం విశేషం. మానస వారణాసిపై భారతదేశం ఆశలు ఎక్కువగా పెట్టుకుంది. కానీ ఆమె సెమీఫైనల్ లోనే ఇంటిదారి పట్టింది.
మిస్ వరల్డ్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ప్రతిష్టాత్మక ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా అందాల భామలు పాల్గొంటారు. మిస్ వరల్డ్ పోటీ అనేది మోడలింగ్ నైపుణ్యాలను చూపించడమే కాకుండా ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. మిస్ వరల్డ్ 2021 మొదటి రన్నరప్ గా ఇండియన్ అమెరికన్ శ్రీ సైనీ నిలిచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ భారతీయ-అమెరికన్ యువతి యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒకసారి కారు ప్రమాదంలో తన ముఖాన్ని మొత్తం చిద్రంచేసుకుంది. గుర్తుపట్టకుండా అందవిహీనంగా మారింది. అయితే ఇప్పుడు ప్రపంచ అందాల పోటీల్లో మొదటి రన్నరప్ గా నిలిచింది. అసలు ఈ శ్రీ సైనీ ఎవరు..? ఆమె కథ ఏమిటి అనే దానిపై స్పెషల్ ఫోకస్..
-శ్రీ సైనీ ఎవరు?
మిస్ వరల్డ్ 2021 ఫస్ట్ రన్నరప్‌గా శ్రీసైనీని గురువారం ప్రకటించారు. మిస్ వరల్డ్ 2021 పోటీలో ఆమె యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రాతినిధ్యం వహించింది. శ్రీసైనీ రన్నరప్‌గా నిలవడమే కాకుండా ఈవెంట్ సందర్భంగా ఆమెకు ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ అనే బిరుదు కూడా లభించింది. మిస్ వరల్డ్ అమెరికా 2021 కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ-అమెరికన్ కూడా ఈమె కావడం విశేషం.
శ్రీ సైనీ వ్యక్తిగత జీవితం గురించి చూస్తే.., పంజాబ్ లో జన్మించిన శ్రీశైని అమెరికాలో సెటిల్ అయ్యింది. అమెరికాలోని పోర్టోరికోలో నివసిస్తోంది. కేవలం 12 సంవత్సరాల వయస్సు నుండి శ్రీసైనీకి మోడలింగ్ పై ఆసక్తి కలిగింది. 26 ఏళ్ల శ్రీ సైనీ జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసుకొని ప్రస్తుతం ఆమె తండ్రి కంపెనీలో బిజినెస్ మేనేజర్‌గా పని చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కావాలనేది శ్రీ సైనీ కల.
అందాల పోటీలకు ముందు డిగ్రీ చదివే రోజుల్లో శ్రీసైనీ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె ముఖాన్ని కూడా కోల్పోయింది. ఆమె ముఖం గుర్తుపట్టకుండా రక్తం, గాజు ముక్కలు గుచ్చుకొని అందవిహీనంగా మారింది. తాజాగా ఆ వీడియోను ఆమె షేర్ చేసింది. తను ఇప్పుడు ఇంత అందంగా ఉన్నానని.. కానీ ఒకప్పుడు అసలు ప్రమాదంతో తన ముఖమే లేకుండా పోయిందని ఆమె వివరించింది. ప్రమాదానికి గురై తన మొత్తం ముఖాన్ని కోల్పోయినప్పుడు ఆ యాక్సిడెంట్ వీడియోతో పాటు రక్తపు గాయంతో ఉన్న తన ముఖాన్ని తాజాగా షేర్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది. కారు ప్రమాదంలో తన మొత్తం ముఖాన్ని కోల్పోయిన తర్వాత తాను ఇంతటి ఘనత సాధిస్తానని.. మిస్ వరల్డ్ రన్ రప్ గా నిలుస్తానని ఊహించలేదని వివరించింది.
‘కారు ప్రమాదంలో నా ముఖం దెబ్బతిన్నప్పుడు నన్ను నేను గుర్తించలేకపోయాను. నా కన్నీళ్లు నా గాయాలను పారద్రోలేలా కాలిపోతాయని నేను ఏడవలేకపోయాను. ఇది నేను భరించిన అత్యంత బాధాకరమైన నొప్పి, నా కారు ప్రమాదం నుండి బయటపడినందుకు నేను అదృష్టవంతుడిని. ఆ కష్టకాలం నుండి పైకి రావడానికి ఈ గెలుపు స్ఫూర్తినిచ్చింది’ అని శ్రీసైనీ నాటి పాత ఫొటోలు వీడియోలు షేర్ చేసింది.
మనమందరం మన జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు. కానీ లక్ష్యసాధనలో నిరుత్సాహ పడవద్దని శ్రీసైనీ నిరూపించింది. అందరినీ ప్రోత్సహించడానికి నా వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నానని శ్రీసైనీ గర్వంగా చెప్పుకొచ్చింది. ఆశను ఎప్పటికీ కోల్పోవద్దని.. ఒక అవకాశం మనకు ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని భరోసానిచ్చింది. శ్రీసైనీ తన వ్యక్తిగత జీవితాన్ని చెప్పి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది.