Manakondur గ్రౌండ్ రిపోర్ట్ : మానకొండూర్‌ యాక్టర్‌దా.. డాక్టర్‌దా.. రసమయి.. కవ్వంపల్లి మధ్య టఫ్‌ ఫైట్‌!

రసమయి మానకొండూర్‌కు స్థానికుతరుడు. రిజర్వేషన్‌ దృష్టా మానకొండూర్‌ నుంచి కేసీఆర్‌ బరిలో నిలిపారు. సిద్దిపేటకు చెందిన రసమయిపై వచ్చే ఎన్నికల్లో స్థానికేతర ప్రచారం చేయాలని సొంతపార్టీ నేతలే పావులు కదుపుతున్నారు.

Written By: NARESH, Updated On : July 19, 2023 9:10 pm
Follow us on

Manakondur : మానకొండూర్‌.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నియోజకవర్గంగా ఏర్పడింది. ఎస్సీ రిజర్వు అయినా ఈ నియోజవర్గం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గంలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, బెజ్జంకి చిగురుమామిడి, ఇల్లంతకుంట మండలాలు ఉన్నాయి. మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం చిగురుమామిడి కరీంనగర్‌ జిల్లాలో ఉండగా బెజ్జంకి సిద్ధిపేట జిల్లాలో, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న మానకొండూర్‌ నియోజకవర్గానికి ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి, తెలంగాణలో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆరెపల్లి మోహన్‌ విజయం సాధించాడు. తొలి ఎమ్మెల్యేగా నిలిచారు. తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రజాగాయకుడు, కళాకారుడు, నటుడు, నిర్మాత అయిన రసమయి బాలకిషన్‌ విజయం సాధించాడు. ఆరెపల్లి మోహన్‌ టీడీపీ, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి అభ్యర్థి ఓరుగంటి ఆనంద్‌పై విజయం సాధించాడు. రసమయి బాలకిషన్‌ రెండుసార్లు ఆరెపల్లి మోహన్‌ను ఓడించాడు. అయితే మారిన రాజకీయ పరిణామాలతో ఆరెపల్లి మోహన్‌ బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు.

రసమయికి ఎదురుగాలి..
మానకొండూర్‌ నియోజకవర్గంలో రసమయికి ప్రస్తుతం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వరుసగా రెండుసార్లు గెలిచిన బాలకిషన్‌.. ముఖ్యమంత్రి సహాయ నిధులు అత్యధికంగా తన నియోజకవర్గానికి తెచ్చుకున్న ఎమ్మెల్యేగా నిలిచారు. రాష్ట్ర సాంస్కృతిక సారథిగా కూడా కొనసాగుతున్నారు. అయితే రసమయి దురుసుతనం.. గోరంత పనిచేసి కొండంత ప్రచారం చేసుకోవడం, గ్రూపు రాజకీయాలు వచ్చే ఎన్నికల్లో రసమయి గెలుపుపై ప్రభావం చూపుతాయని తెలుస్తోంది.

ప్రజల్లో వ్యతిరేకత..
2014, 2018 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చలేదనే ఆరోపణలు ఉన్నాయి. తొలిపొద్దు పేరుతో గ్రామాల్లో తిరుగుతున్న రసమయి వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, సొంత పార్టీలోనే ఆయన వ్యతిరేకులు రసమయిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

స్థానికేతరుడిగా ముద్ర..
రసమయి మానకొండూర్‌కు స్థానికుతరుడు. రిజర్వేషన్‌ దృష్టా మానకొండూర్‌ నుంచి కేసీఆర్‌ బరిలో నిలిపారు. సిద్దిపేటకు చెందిన రసమయిపై వచ్చే ఎన్నికల్లో స్థానికేతర ప్రచారం చేయాలని సొంతపార్టీ నేతలే పావులు కదుపుతున్నారు. స్థానికుడైన ఆరెపల్లి మోహన్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌లోనే ఉన్న నేపథ్యంలో ఆయన వర్గం నేతలు ఈసారి టికెట్‌ ఆరెపల్లికి ఇల్వాలని లాబీయింగ్‌ చేస్తోంది.

సొంతపార్టీలోనే రెబల్స్‌..
ఇకవైపు ఆరెపల్లి మోహన్, మరోవైపు ఓరుగంటి ఆనంద్‌ రసమయిపై కారాలు మిర్యాలు నూరుతున్నారు. ఓరుగంటి ఆనంద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరు. కానీ రాజకీయంగా పెద్దగా వెలుగులోకి రాలేదు. దీంతో ఈసారి మనకొండూర్‌ బరిలో నిలవాలని భావిస్తున్నారు. మరోవైపు ఆరెపల్లి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు. టికెట్‌ ఇవ్వకుంటో ఇతర పార్టీలో చేరైనా బరిలో నిలవాలని చూస్తున్నారు. ఇద్దరూ బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

రంగంలోకి దిగిన డాక్టర్‌..
ఇక మానకొండూర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కూడా మానకొండూర్‌ను ఈసారి తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. గతంలో టీడీపీలో పనిచేసి, టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన కవ్వంపల్లి రసమయికి గట్టి పోటీ ఇచ్చారు. రేవంత్‌ వర్గానికి చెందిన రసమయి ఆయనతోపాటు కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి మానకొండూర్‌లో గెలిచి తీరాలని దాదాపు ఏడాదిగా ప్రచారం చేసుకుంటున్నారు. స్థానికంగా ఉంటున్నారు. స్థానికుడే అయినా.. స్థానికంగా ఉండరు అనే ఆరోపణ కవ్వంపల్లిపై ఉంది. డాక్టర్‌ అయిన కవ్వంపల్లి దంపతులు హైదరాబాద్‌లో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. నియోజవర్గానికి చుట్టపుచూపుగా వచ్చిపోతారని క్యాడర్‌లో అభిప్రాయం ఉంది. దీనిని తొలగించుకునేందుక ఏడాదిగా జిల్లాలోనే ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో డాక్టర్, యాక్టర్‌ మధ్యనే పోటీ ఉటుందని చాలా మంది భావిస్తున్నారు. రసమయికి వ్యతిరేకంగా ఆరెపల్లి, ఓరుగంటి పోటీ చేస్తే కవ్వంపల్లి విజయం నల్లేరుపై నడకే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నామమాత్రంగా బీజేపీ..
ఇక మానకొండూర్‌ నియోజకవర్గంలో బీజేపీ నామమాత్రంగానే ఉంది. ఆ పార్టీ నుంచి గడ్డం నాగరాజు మూడుసార్లు పోటీ చేశాడు. మూడుసార్లు డిపాజిట్‌ కోల్పోయాడు. ఈసారి కూడా పెద్దగా ప్రభావం ఉండదని అంచనా.. ఆర్థికంగా ఉన్న గడ్డం నాగరాజు మూడుసార్లు పోటీచేసి నష్టపోయారు. దీంతో ఈసారి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఈసారి సొల్లు అజయ్‌వర్మ బీజేపీ టికెట్‌ ఆశిస్తున్నారు. పోటీ మాత్రం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే ఉంటుందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.