Mallikarjun Kharge: ఊహించినదే జరిగింది. మల్లికార్జున ఖర్గే కు జాతీయ కాంగ్రెస్ పీఠం దక్కింది. బుధవారం నిర్వహించిన లెక్కింపులో మల్లికార్జున కు 7,897 ఓట్లు వచ్చాయి. శశి ధరూర్ కు 1,072 ఓట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున గెలిచారు.. కాగా ఇందులో 416 ఓట్లు చెల్లలేదు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన కౌంటింగ్ లో శశి థరూర్ కంటే మల్లికార్జున కు ఎక్కువ ఓట్లు రావడంతో విజయం సాధించినట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. మల్లికార్జున విజయాన్ని కాంగ్రెస్ సీఈసీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ధ్రువీకరించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓటమిని అంగీకరిస్తున్నట్టు శశి థరూర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టనున్న మల్లికార్జున కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

రిగ్గింగ్ జరిగిందా
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో రిగ్గింగ్ జరిగిందని శశిధరూర్ ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ మిస్త్రీ కి లేఖ కూడా కూడా రాశారు. ఆ లేఖ రాసిన కొద్దిసేపటికి ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మల్లికార్జున విజయం సాధించినట్టు ప్రకటించడంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వెలుపుల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. 24 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన నేత ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ నెల 17న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి పోలింగ్ నిర్వహించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి తీసుకు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో లెక్కించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని పార్టీ సీనియర్లు సూచించినప్పటికీ ఆయన దానికి ఒప్పుకోలేదు. దీంతో సోనియా గాంధీ అప్పటినుంచి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు.
1998 నుంచి ఆమే
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా 1998 నుంచి సోనియా గాంధీ కొనసాగుతున్నారు. 2017 నుంచి 19 వరకు ఈ పదవికి ఆమె దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆరు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. అయితే ఈ దఫా మాత్రం గాంధీ కుటుంబం నుంచి ఏ ఒక్కరు పోటీ చేయలేదు. క్యాన్సర్ కారణంగా సోనియా గాంధీ పోటీకి దూరంగా ఉన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీకి సుముఖతను వ్యక్తం చేయలేదు. అయితే ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి మద్దతుగా పలు రాష్ట్రాల పిసిసిలు కూడా చేశాయి. పోటీకి రాహుల్ గాంధీ దూరంగానే ఉన్నారు. పైగా భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అలా పాదయాత్రలో ఉండగానే ఆయన అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోటీలో మల్లికార్జున కావడంతో ఆయన విజయం నలేరు మీద నడకే అయింది. శశి థరూర్ కేవలం వెయ్యి ఓట్లు మాత్రమే దక్కించుకోవడం కాంగ్రెస్ పై గాంధీ కుటుంబానికి ఉన్న పట్టు కనిపిస్తుంది.

త్వరలో కర్ణాటక ఎన్నికలు
దక్షిణాదిలో కర్ణాటక చాలా కీలక రాష్ట్రం. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ సీట్లు సాధించినప్పటికీ నాయకుల మధ్య అనైక్యత వల్ల అధికారాన్ని బిజెపికి అప్పగించింది. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కర్ణాటకలో ప్రవేశించేలా ప్రణాళికలు రూపొందించింది. అనుకున్నట్టుగానే ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలంటే ఇది ఒకటే సరిపోదని భావించిన ఆ పార్టీ నేతలు.. మల్లికార్జున ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షుడు కావాలని పావులు కలిపారు. అనుకున్నట్టుగానే ఆయనకు పార్టీ అధ్యక్ష పీఠం దక్కింది. ఇక గాంధీ కుటుంబానికి వీర విధేయుడుగా ఉన్న మల్లికార్జున తీసుకునే నిర్ణయాల ఆధారంగానే పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇతర వ్యక్తి అధ్యక్షుడిగా అనంతమాత్రాన గాంధీల ప్రమేయాన్ని తీసి పారేయలేం. అయితే 2019 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేసి ఉంటే అంత ఘోరంగా ఓడిపోయేది కాదు.