Mahesh Babu New Business: ‘డబ్బులు ఊరికే రావు’ అని లలిత జ్యువెల్లర్స్ యాడ్ లో పాపులర్ డైలాగ్ జనాల్లోకి వెళ్లింది. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే.. స్టార్ డం ఉన్నప్పుడే డబ్బులు వస్తాయి. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే ఓ శోభన్ బాబు, మురళీ మోహన్ లలాగా బడా రియల్ ఎస్టేట్ టైకూన్ లు అవుతారు. ఇక ఆ డబ్బును వృథా చేస్తే ఒక మహానటి సావిత్రిలా.. మరో జయసుధలా అప్పుల పాలై అష్టకష్టాలు పడుతారు.

అందుకే మన తారలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. సినిమాల్లో వచ్చిన సంపాదనను ఇతర రంగాలకు మళ్లించి పెట్టుబడిగా మలుస్తున్నారు. ఆదాయం వచ్చే రంగాల్లో పెట్టుబడి పెట్టి ఆ సొమ్మును రెట్టింపు చేసుకుంటున్నారు. ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు.
డబ్బును సరిగ్గా ఖర్చుపెట్టే తారల్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఆయన సినిమాల్లో వచ్చిన డబ్బును చాలా పద్ధతిగా పెట్టుబడిగా మలుస్తున్నారు. సినీ నిర్మాతగా, రియల్ ఎస్టేట్, థియేటర్స్, వస్త్ర పరిశ్రమ , ఇల్లు, ఆస్తులు కొంటూ వాటిని రెట్టింపు చేస్తున్నారు.

మహేష్ బాబు తన సినిమాలే కాదు.. కంటెంట్ ఉన్న ఇతరుల సినిమాలు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవలే సైలెట్ గా ‘మేజర్’ సినిమా నిర్మించి ప్యాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ కొట్టాడు.
ఇక అంతకుముందే మహేష్ బాబు హైదరాబాద్ లో ‘ఏఎంబీ’ మాల్ ను ప్రారంభించారు. ఇది ఇప్పుడు హైదరాబాద్ కు ఐకానిక్ హబ్ గా మారింది. హైదరాబాద్లోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ గా పేరుగాంచింది. ఇలా థియేటర్ బిజినెస్ లో అడుగుపెట్టిన మహేష్ బాబు తాజాగా రెస్టారెంట్ వ్యాపారంలోకి దిగారు. ఇందులో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ప్రస్తుతం సమాజంలో.. వ్యాపారరంగంలో ఎవర్ గ్రీన్ బిజినెస్ ఏదైనా ఉందంటే అది ‘రెస్టారెంట్ ఫుడ్ బిజినెస్’. అందుకే ఈ అత్యధిక ఆదాయం గల రంగంలోకి మహేష్ బాబు దిగుతున్నాడు. దీనికోసం మహేష్ బాబు ప్రముఖ బ్రాండ్ ‘మినర్వా’తో జతకట్టాడు. ఈ క్రమంలోనే రోడ్ నంబర్ 12 బంజారాహిల్స్ లో లగ్జరీ రెస్టారెంట్ ను తెరవడానికి మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు.
చాలా మంది సినీ ప్రముఖులు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతుంటారు. మరికొందరు హీరోలు మాత్రమే వివిధ రకాల వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నారు. మహేష్ బాబు మాత్రం ఆదాయం వచ్చే ఏ రంగాన్ని కూడా వదలకుండా అందులో పెట్టుబడులు పెట్టి లాభదాయక వ్యాపారంలో ముందుకెళుతున్నాడు.