Trivikram Srinivas: అన్నిసార్లు మ్యాజిక్కులు పనిచేయవు గురూజీ..

సాధారణంగా ఒక తెలిసిన కథను చెప్పాలి అంటే దానికి బలమైన కథనాన్ని రూపొందించాలి. అదే స్థాయిలో భావోద్వేగాలను రాసుకోవాలి. వాటిని పండించే సీన్లను రూపొందించాలి. నటీనటుల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ పండే విధంగా దర్శకుడు నడుచుకోవాలి.

Written By: Anabothula Bhaskar, Updated On : January 13, 2024 9:35 am

Trivikram Srinivas

Follow us on

Trivikram Srinivas: మనదేశంలో లాజిక్కుల కంటే, మ్యాజిక్కులకే ఎక్కువ విలువ ఉంటుంది. అందుకే సైంటిస్టుల కంటే బాబాలే ఎక్కువ ఫేమస్ అని జులాయి సినిమాలో త్రివిక్రమ్ రాసిన ఓ డైలాగు ఉంటుంది. కానీ అదే త్రివిక్రమ్ అవే మ్యాజిక్కులను తన సినిమాల్లో అనేకసార్లు పునరావృతం చేశాడు. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి, అల వైకుంఠపురంలో, తాజాగా, గుంటూరు కారం.. ఈ సినిమాల్లో కామన్ గా కనిపించే పాయింట్ ఏంటంటే హీరో సమస్య పరిష్కారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదా తన కుటుంబ సభ్యులను కలపడం.. ఇవే ఇతివృతంగా ఆ సినిమాలను త్రివిక్రమ్ తీశాడు. తెలిసిన కథలైనప్పటికీ.. స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ చేయడం వల్ల అజ్ఞాతవాసి, గుంటూరు కారం తప్ప మిగతావన్నీ ప్రేక్షకుల మెప్పు పొందాయి. ప్రేక్షకులు ఎలాగూ ఆదరిస్తున్నారు కాబట్టి.. పైగా తనకు గురూజీ అనే బిరుదు ఉంది కాబట్టి.. ఏం తీసినా చూస్తారు అనుకున్నాడెమో.. గుంటూరు కారం విషయంలో ఏమాత్రం శ్రద్ధ వహించకుండా ఒక పాత కిచిడిని జనం మీదకి వదిలాడు. కానీ ఆ సినిమా దారుణమైన రివ్యూలను పొందింది. అజ్ఞాతవాసి తర్వాత మరో దారుణమైన ఫలితం త్రివిక్రమ్ ఖాతాలో చేరిందని సినీ ట్రేడ్ పండితులు అంటున్నారు.

సాధారణంగా ఒక తెలిసిన కథను చెప్పాలి అంటే దానికి బలమైన కథనాన్ని రూపొందించాలి. అదే స్థాయిలో భావోద్వేగాలను రాసుకోవాలి. వాటిని పండించే సీన్లను రూపొందించాలి. నటీనటుల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ పండే విధంగా దర్శకుడు నడుచుకోవాలి. ఇవేమీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కొత్త కాదు. కానీ ఈ విషయాన్ని గుంటూరు కారం సినిమాలో మర్చిపోయినట్టున్నాడు. లేకుంటే ఒక మామూలు కథతో అఆ(ఇది మీనా సినిమాను కాపీ కొట్టి తీశారని ఆరోపణలు ఉన్నాయి) సినిమా తీసి నితిన్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు.. ఆ సినిమాలో అద్భుతమైన స్క్రీన్ ప్లే రూపొందించి ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టాడు. అక్కడిదాకా ఎందుకు సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోనూ ఇలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేశాడు. అయితే అన్నిసార్లు మ్యాజిక్కులు వర్కౌట్ కావని త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తొలిసారిగా అజ్ఞాతవాసి గుణపాఠం నేర్పింది. సేమ్ అత్తారింటికి దారేది తరహా కథతో ఈ సినిమాను రూపొందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక దారుణమైన పరాజయాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ సినిమాతో గాడిలో పడ్డ త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల వైకుంఠపురం సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకున్న త్రివిక్రమ్.. గుంటూరు కారం సినిమాతో బాక్సాఫీసును షేక్ చేస్తాడు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను వమ్ము చేస్తూ పేలవమైన కథ, కథనంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు.

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ ధర పెంపు వల్ల అటు ఆ సినిమా నిర్మాత సూర్యదేవర చినబాబు, ఇటు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు లాభపడి ఉండవచ్చు గాక. తమకున్న శక్తి యుక్తులతో హనుమాన్ సినిమాకు థియేటర్లు దక్కకుండా చేయవచ్చుగాక.. కానీ అంతిమంగా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంలో మాత్రం విఫలమైనట్టే లెక్క. గుంటూరు కారం సినిమాలో కథ విషయంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్పు చేశారు అనిపిస్తోంది. అసలు ఇలాంటి కథను మహేష్ బాబు ఎలా ఒప్పుకున్నారు అనేది ఇప్పటికీ అనుమానమే. ఒక బలమైన సన్నివేశం గాని.. బలమైన భావోద్వేగాన్ని పండించే దృశ్యాలు గానీ ఇందులో లేవంటే అతిశయోక్తి కాదు. చిన్నప్పుడు ఎప్పుడో తనను వదిలి వెళ్ళిపోయిన తల్లి గురించి తపనపడే పాత్రలో మహేష్ బాబును తీర్చిదిద్దాల్సిన త్రివిక్రమ్.. కేవలం గుంటూరుకు, హైదరాబాద్ కు చక్కర్లు కొట్టించే పాత్రధారిగా మాత్రమే మిగిల్చాడు. చివరికి తన ప్రాణ స్నేహితుడు సునీల్ ను ఒక్క సన్నివేశంలోనే చంపేశాడు. రమ్యకృష్ణను రెండు మూడు సన్నివేశాలు మినహా పెద్దగా వాడుకోలేకపోయాడు. జగపతిబాబును ఒక ఆకు రౌడీ కింద జమ కట్టాడు. ప్రకాష్ రాజ్ కు బలవంతంగా ఆస్తమా అంటగట్టాడు. ఇక మీనాక్షి చౌదరి అయితే మహేష్ బాబుకు మందు కలపడానికి, మసాజ్ చేయడానికి మాత్రమే పరిమితం అయిపోయింది. శ్రీలీలతో అభినయం పండించే సన్నివేశాలు తీయకుండా.. కుర్చీ మడత పెట్టే పాటలకు మాత్రమే పరిమితం చేశాడు. చివరికి హావభావాలను అత్యంత సున్నితంగా పలికించే రావు రమేష్ ను ఒక తాగుబోతుగా మలిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గుంటూరు కారంలో ఎన్నో లోపాలు. చివరికి ఫోటోగ్రఫీ కూడా అత్యంత నాసిరకంగా ఉంది. కలర్ సింక్ కాలేదు. పైగా మహేష్ లాంటి యాక్టర్ కు గ్రే షేడ్స్ వాడారు. అసలు ఇలాంటి కథను మహేష్ ఎలా ఒప్పుకున్నారు? ఆయన అభిమానులు ఎలా స్వీకరిస్తారు అనుకున్నారు? పైగా ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులకు ఎలాంటి సందేశం ఇవ్వాలి అనుకున్నారు? చివరగా చెప్పవచ్చేది ఏంటంటే.. ఓ ప్రశాంత్ వర్మ లాంటి కుర్రాడు హనుమాన్ లాంటి సినిమాలు తీస్తున్నాడు. వేదిక ఎక్కితే చాలు హిందూ మైథాలజీ గురించి లెక్చర్లు ఇచ్చే త్రివిక్రమ్ శ్రీనివాస్ కుర్చీ మడత పెట్టే దగ్గరే ఆగిపోయారు. స్థూలంగా చెప్పాలంటే మ్యాజిక్కులు అన్ని సార్లు వర్క్ అవుట్ అవ్వవు. ఇలానే తీసుకుంటూ పోతే గురూజీ అనే బిరుదు కూడా మిగలదు. చివరికి ఆ సూర్యదేవర చిన బాబు కూడా నమ్మి డబ్బులు పెట్టి సినిమా తీయలేడు.