MAA Elections 2021 : టాలీవుడ్ మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ (MAA ELECTIONS) కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం నుంచి ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీపడుతున్న అటు ప్రకాష్ రాజ్, ఇటు మంచు విష్ణు పోలింగ్ కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో తమ అస్త్రశస్త్రాలన్నీ వినియోగిస్తున్నాయి. ఓట్ల కోసం శక్తి యుక్తులన్నీ వాడుతున్నాయి. సినీ కళాకారులకు ఓటుకు నోటు కూడా పంచుతున్నట్టు సమాచారం.

ఇప్పటికే విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచార పర్వం వాడీవేడిగా సాగింది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ‘మా’ సభ్యులను ఆకట్టుకునేందుకు ఇరు ప్యానెల్స్ చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణ ఎన్నికలను మించి ఈ ‘మా’ ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలోనే ‘మా’ అధ్యక్షుడు, కార్యవర్గాన్ని ఎలా ఎన్నుకుంటారు? గెలిచాక ఈ కార్యవర్గం ఏం చేస్తుందనే దానిపై స్పెషల్ ఫోకస్.
-మా పోలింగ్ ఎప్పుడు? ఎంత మంది సభ్యులు?
మా ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంట నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ‘మా’లో 925మంది సభ్యులున్నారు. 883 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రేపు రాత్రికి ‘మా’ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. అధ్యక్షుడు ఎవరన్నది రేపు తెలిసే అవకాశం ఉంది.
– మా ఎన్నికల చరిత్ర
1993 అక్టోబర్ 4న ‘మా’ ఏర్పాటైంది. దీన్ని మెగాస్టార్ చిరంజీవి, మురళీ మోహన్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు లాంటి పెద్దలు ఆలోచించి టాలీవుడ్ కు ఒక సినిమా అసోసియేషన్ ఉండాలని భావించి ఈ అసోసియేషన్ కు జీవం పోశారు. అలా ‘మా’ అసోసియేషన్ కార్యాలయాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
-మా తొలి అధ్యక్షుడు చిరంజీవి
‘మా’ అసోసియేషన్ తొలి అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి. జనరల్ సెక్రటరీగా మురళీమోహన్ సేవలందించారు. ఇప్పటివరకూ 9మంది అధ్యక్షులు మారారు. మా ప్రారంభంలో 150 మంది సభ్యులుండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 956కు చేరింది.
-గత మూడు ఎన్నికల్లో ఎవరెవరు గెలిచారు?
2015లో సాధారణ ఎన్నికలను తలపించేలా రాజేంద్రప్రసాద్, నటి జయసుధ తలపడ్డారు. ఈ మా ఎన్నికల్లో ‘రాజేంద్రప్రసాద్’ గెలిచి అధ్యక్షుడయ్యారు. జయసుధపై రాజేంద్రప్రసాద్ 85 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
-2017-19 మధ్య కాలంలో జరిగిన మా ఎన్నికల్లో శివాజీ రాజాను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా నరేశ్ ఎంపికయ్యారు.
-2019లో మళ్లీ ‘మా’ ఎన్నికల్లో పోటీ జరిగింది. నాడు శివాజీరాజా, నరేశ్ లు అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు. ఇద్దరూ ‘మా’ ఎన్నికల్లో లొసుగులు, అవకతవకలపై రోడ్డున పడి రచ్చ చేశారు. అమెరికాలో ఈవెంట్ నిర్వహించి కోట్లు మింగేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై తీవ్రంగా విమర్శించుకున్నారు. ఈ ఎన్నికల్లో శివాజీరాజాపై నరేశ్ 69 ఓట్ల మెజార్టీతో గెలిచి ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
-ప్రస్తుతం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ హోరాహోరీ
గత అన్ని ఎన్నికంటే కూడా ఈసారి ‘మా’ ఎన్నికలు కాకరేపుతున్నాయి. అధ్యక్ష స్థానం కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వాడి వేడిగా ఆరోపణలు చేసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో మీడియాకు ఎక్కి రచ్చ చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలు, ఇండస్ట్రీలోని లూప్ హోల్స్ అన్నీ బయటపెట్టుకుంటూ రెండు వర్గాలు రోడ్డునపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.