MAA Elections: ‘మా’ ఎన్నికలు హోరాహోరీగా ముగిసి విజేతలు ఎవరో తేలినా.. ఇంకా ఆ వేడి చల్లారడం లేదు. ఎన్నికలు ముగిసినా.. అందులో జరిగిన పరిణామాలను ప్రత్యర్థి వర్గం బయటపెడుతూ ఇబ్బందిపెడుతున్నాయి. అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు బాధ్యతలు చేపట్టి మరీ సైలెంట్ అయిపోయారు. ఈరోజు ఆయన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతోంది. ‘మా’ ఎన్నికల తర్వాత కలిసి పనిచేస్తామన్న అధ్యక్షుడు మంచు విష్ణు మాటలు ఆచరణలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ వర్గం నుంచి ఎన్నికైన 11 మంది కార్యవర్గ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసేశారు. దీంతో సగం మంది లేకుండానే ప్రకాష్ రాజ్ వర్గం ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతోంది.

కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రకాష్ రాజ్ ఇప్పటికే పోలింగ్ పై సోమవారం కోర్టుకు ఎక్కుతున్నట్టు తెలిపారు. ఆయన ఇప్పటికే పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఈ సమయంలోనే ‘మా’ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరు అవుతారేది ఆసక్తి రేపుతోంది. ఉదయం 11 గంటలకు ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ను, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఇండస్ట్రీలోని పెద్దలందరిని చిరంజీవి, మోహన్ బాబు, అగ్రహీరోలను ఆహ్వానించారు. ఇంత కుమ్ములాటల్లో ఎవరెవరు ఓటింగ్ కు వస్తారన్నది ఆసక్తిరేపుతోంది.
ఫిలింనగర్ లోని కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా తెలంగాణమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆహ్వానించారు. ‘మా’ సభ్యులందరికీ ఆహ్వానాలు పంపారు. మంచు విష్ణు, మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్దలను ఆహ్వానించినట్లుగా సమాచారం. నందమూరి బాలక్రిష్ణ, సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు, పరిచూరి బ్రదర్స్ లాంటి వారిని స్వయంగా ఆహ్వానించారు.
ఇక మా కార్యవర్గం ఏర్పాటైన తర్వాత ప్రకాష్ రాజ్ వర్గం రాజీనామాలను ఆమోదిస్తారా? రిజెక్ట్ చేస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.
ప్రకాష్ రాజ్ కు సపోర్టు చేసిన ఇండస్ట్రీ పెద్ద చిరంజీవిని కలుస్తానని మంచు విష్ణు తెలిపారు. మరి కలిశాడా? లేదా? ఈ ప్రమాణ స్వీకారానికి ఆయన వస్తాడా? రాడా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
మా ఎన్నికలతో మెగా, మంచు ఫ్యామిలీల మధ్య తలెత్తిన విభేదాలను తగ్గించేందుకు మంచు విష్ణు తమ్ముడు మనోజ్ రంగంలోకి దిగి ‘భీమ్లా నాయక్’ షూటింగ్ స్పాట్ కు వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ ను కలిశారు. గంటకు పైగా చర్చలు జరిపారు.
‘మా’ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మెగా క్యాంప్, ప్రకాష్ రాజ్ వర్గం నుంచి ఎవరైనా హాజరవుతారా? లేదా? మోహన్ బాబుకు సపోర్టు చేసిన వారు మాత్రమే పాల్గొంటారా? అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే ఇంతటి ఉద్రిక్తతలకు కారణమైన ఈ ఎన్నికలు.. ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో ఈ రెండు వర్గాల వారు కలుస్తారన్నది డౌటే అంటున్నారు.