KCR – Kamareddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఈమేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. విపక్షాలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి, మేనిఫెస్టో విడుదల చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఈసారి గజ్వేల్‌తోపాటు, కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగాలని కేసీఆర్ నిర్ణయించారు. గజ్వేల్ నుంచి ఈసారి కేసీఆర్‌పై పోటీ చేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ప్రకటించారు. ఈటల భయమా.. లేక మరేదైనా కారణమా తెలియదు కానీ, ఈసారి గజ్వేల్‌తోపాటు, కామారెడ్డి నుంచి బరిలో దిగాలని కేసీఆర్ నిర్ణయించారు.
అక్కడ పోటీకీ వేరే లెక్కుందట..
ఇదిలా ఉండగా, ఇటీవల గజ్వేల్ నియోజకవర్గ నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. తాను గజ్వేల్‌ను విడిచి కామారెడ్డి పోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిచారు. తాను ఎక్కడికీ వెళ్లనని క్లారిటీ ఇచ్చారు. మరి కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తున్నారంటే.. మొదట గంపా గోవర్ధన్ కోరారని చెప్పారు. కానీ, ఇప్పుడు కామారెడ్డిలో పోటీకి వేరే లెక్క ఉందని ప్రకటించారు. దీంతో కూతురును నిజామాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపించేందుకే కేసీఆర్ ఈ ఎత్తు వేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై ఇప్పటికే గుర్రుగా ఉన్న రైతులు కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారు.
100 నామినేషన్లు వేయాలని,
మాస్టర్‌ప్లాన్‌తో తమకు నష్టం చేసిన ప్రభుత్వం, తమ గోడు పట్టించుకోకపోగా ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ నియోజకవర్గం నుంచి పోటీకి దిగడంపై రైతుల్లో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాస్టర్‌ప్లాన్‌ను పక్కాగా అమలు చేయడానికే కేసీఆర్ ఇక్కడి నుంచి బరిలో తిగుతున్నారని రైతులు భావించారు. దీంతో కేసీఆర్‌ను ఇక్కడ ఓడించాలని కామారెడ్డిమాస్టర్‌ప్లాన్ బాధిత రైతులు నిర్ణయించారు. ఈమేరకు ఇటీవల సమావేశమైన మూడు గ్రామాల రైతులు ఈమేరకు తీర్మానించారు. ప్రతీ గ్రామం నుంచి 15 చొప్పున నామినేషన్లు వేస్తామని ప్రకటించారు.
కేసీఆర్‌కే ఝలక్..
ఇదిలా ఉండగా, గతంలో పసుపు బోర్డు విషయంలో కవితకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన నిజామాబాద్ రైతులు ఆమె ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. ఈ పరిస్థితి మళ్లీ కామారెడ్డిలో పునరావృతం అవుతుందని బీఆర్‌ఎస్ వర్గాలు ఆందోళన చెందాయి. స్థానిక ఎమ్మెల్యే గంపా గోవర్ధన్‌తోపాటు, మున్సిపల్ చైర్మన్, ఇతర నేతలు ఇదే విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులను శాంతింపజేయకుంటే ఎన్నికల్లో ఇబ్బంది పడతామని చెప్పారు. మరోవైపు ఇక్కడి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా పోటీకి సై అంటున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు.
రైతులతో కాంప్రమైజ్..
కామారెడ్డిలో రాజకీయం క్లిష్టంగా మారుతుండడంతో కేటీఆర్ ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి మాస్టర్ ప్లాన్ అని గుర్తించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను గతంలో ఆమోదించారు. ఇది రైతుల్ని తీవ్రంగా నష్టపరిచేలా ఉండటంతో పెద్ద ఉద్యమం జరిగింది. ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ చాలా మంచిదని.. మార్చే ప్రసక్తే లేదని అప్పట్లో కేటీఆర్ కూడా ప్రకటించారు. కానీ ఉద్యమం తీవ్రం కావడంతో చివరికి రద్దు చేస్తామన్నారు. మున్సిపాలిటీలో తీర్మానం చేశారు కానీ.. మున్సిపల్ శాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు. దీంతో ఇటీవల రైతులు సమావేశమై నామినేషన్లు వేయాలని నిర్ణయించడంతో కేటీఆర్ ఉద్యమ జేఏసీ నేతలను సడెన్‌గాప్రగతి భవన్‌కు పిలిపించారు. కామారెడ్డితో కేసీఆర్ ఓడిపోతే పరువు పోతుందని భావించిన కేటీఆర్ వారి ముందే అధికారులకు ఫోన్ చేసి.. మాస్టర్ ప్లాన్ రద్దు ఉత్తర్వులు విడుదల చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యమం సందర్భంగా పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులపై కేసులు నమోదయ్యాయని వాటిని కూడా తీయించేస్తానని హామీ ఇచ్చారు. వారి ముందే పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇవన్నీ రైతులకు సంతృప్తినిచ్చాయి. నాన్నకు ప్రేమతో కామారెడ్డిని కానుకగా ఇచ్చేందుకే కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.