Krishnashtami 2022: కౌరవులు 100 మంది ఉండొచ్చు. వారికి దుర్యోధనుడు నాయకత్వం వహించి ఉండొచ్చు. కర్ణుడు వారికి అదనపు బలం కావచ్చు. శకుని అండతో వారు రెచ్చిపోవచ్చు. పాండవులను ముప్పు తిప్పలు పెట్టవచ్చు. నిండు సభలో ద్రౌపదికి వస్త్రాభరణం చేయవచ్చు. కానీ వీటన్నింటినీ అడ్డుకునేందుకు కృష్ణుడు ఏదో ఒక రూపంలో రావచ్చు. “బలమే జననం.. బలహీనతే మరణం. నువ్వు అంతఃకరణ శుద్ధితో ఏ పని చేసినా విజయమే వరిస్తుందని” గీతలో రాసి.. సమస్త మానవాళికి ఆచరించి చూపిన వాడు శ్రీకృష్ణుడు. నేడు అతడి జయంతి. ఎప్పుడో ద్వాపర యుగంలో పుట్టిన శ్రీకృష్ణుడు ఇప్పటికీ ఎందుకు గుర్తు ఉన్నాడు? ద్వారక నుంచి డల్లాస్ వరకు ప్రజలు ఎందుకు పూజిస్తున్నారు? నేటితరం కృష్ణుడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? వాటిని ఆచరణలో పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ అంశాలన్నిటిపై నేడు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక కథనం.

అంతర్గత బలహీనతలే అభివృద్ధికి ఆటంకం
నేటి తరానికి అరచేతిలో అన్నీ ఉన్నాయి. ఐదు అంకెల జీతం, ఉండేందుకు డూప్లెక్స్ ఇల్లు, తిరిగేందుకు కారు, విలాసవంతమైన జీవితం.. కానీ ఇవేవీ వారికి సంతృప్తిని ఇవ్వడం లేదు. ఫలితంగా చిన్నచిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటి ప్రభావం వల్ల జీవితాలు తలకిందులవుతున్నాయి. అంతర్గత బలహీనతలను అర్జునుడు భగవద్గీత ద్వారా ఏ విధంగా చేదించుకోగలిగాడో, అదేవిధంగా నేటితరం కూడా వాటిని వదులుచుకోవడానికి ఈ భగవద్గీత ఉపయోగపడుతుంది.
Also Read: Janasena Chief Pawan Kalyan: ఆ తొమ్మిది మందిపైనే.. పవన్ టార్గెట్ ఫిక్స్
ఐదువేల సంవత్సరాల క్రితం అర్జునుడికి కూడా
ఐదువేల సంవత్సరాల క్రితం పరాక్రమశీలి, సమస్త అస్త్ర శస్త్ర విద్యాసంపన్నుడు, రణరంగ ధీరుడయిన అంతటి అర్జునుడు సైతం కురుక్షేత్ర సంగ్రామ ఆరంభంలో తన ముందున్న పరిస్థితిని గ్రహించి మరుక్షణమే భావోద్వేగాలకు గురయ్యాడు. ఒళ్ళు మొత్తం కంపించిపోయింది. చేతిలోని గాండీవాన్ని జారవిడిచి రథంలో కుప్పకూలిపోయాడు. యుద్ధాన్ని విరమించాలనుకున్నాడు. తన సానుకూలతలను గుర్తించలేక, ఒత్తిడిని భరించలేక, ఆచరించాల్సిన ధర్మాలను పక్కనపెట్టి తన నిర్ణయాన్ని సమర్థించుకునే వాదనలు వినిపించసాగాడు. అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు “ప్రియమైన అర్జునా! ఇలాంటి క్లిష్ట సమయంలో నీకు ఈ చిత్తభ్రాంతి ఎలా దాపురించింది? ఇలాంటి పరిస్థితి గురించి నీలాంటి మహావీరుడైన వ్యక్తి చెప్పకూడదు. నిన్ను అది అపకీర్తి పాలు చేస్తుంది”. ఆ హితవు బోధిస్తూ కొనసాగించిన సంభాషణే భగవద్గీతగా విశ్వవిఖ్యాతమే నిలిచింది.
అర్జునుని తన కర్తవ్యం వైపు నడిపించేలా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా విషయాలు చెప్పాడు. అస్త్రశస్త్రాల గురించి గానీ, యుద్ధ నైపుణ్యాల గురించి గానీ, ప్రస్తావించలేదు. నైపుణ్యాలు, నేర్పరితనం లాంటివి మన జీవితంలో ఎదురయ్యే ఆత్రుత, ఆవేదనల నుంచి మనల్ని కచ్చితంగా రక్షించగలవని చెప్పలేమనడానికి ఇదే నిదర్శనం. అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించింది జీవిత సత్యాల గురించి.. తద్వారా ఉన్నత జీవన విధానాల పట్ల అర్జునుడికి ఉన్న అపోహలను కృష్ణుడు మార్చేశాడు. “ఈ దేహం మనం కాదు. మనమంతా ఆత్మ స్వరూపకం అంటూ మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడు భగవద్గీతలోని జీవుడి నిజమైన స్వరూపాన్ని గురించి వివరించాడు. సమస్త జీవులు ఆధ్యాత్మిక స్వరూపాలని, అయితే ప్రస్తుతం ఈ భౌతిక దేహంలో బంధితులై జీవిస్తున్నారన్న సత్యాన్ని బోధించాడు. ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యం, యవ్వనం, వార్ధాక్యాల ద్వారా సాగిపోతుందో, అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ భారత దేశంలోనికి ప్రవేశిస్తుంది. ధీరుడైనవాడు ఈ విషయంలో ఎటువంటి మోహాలకు లొంగిపోడు. కనుక కేవలం ఈ భౌతిక దేహం భౌతిక జీవనానికి సంబంధించిన నైపుణ్య, ప్రావీణ్యతల మీద మాత్రమే మనం దృష్టి సారిస్తే సరిపోదు. ఆత్మ స్వరూపమైన మనం ఉన్నతమైన ఆనందం, జ్ఞానం శాశ్వత జీవన కోసం పరితపించడం సహజం. కానీ ఈ భౌతిక ప్రపంచం వాటిని అందివ్వలేదు”. ఇలా శ్రీకృష్ణుడి సూక్తులు విన్న అర్జునుడు “శ్రీకృష్ణుడే సర్వకారణ కారణుడని, పరమ సత్యమని, దేవాది దేవుడని” గ్రహించి సంపూర్ణ శరణాగతి చేశాడు. “నీవే పరబ్రహ్మవని, పరంధాముడివని, సర్వోన్నతమైన వాడివని, పవిత్రత కలిగించే వాడివని, నిత్య సనాతనుడైన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మ రహితుడివి, అత్యున్నతుడవు, మహర్షి అయిన నారదుడు, అసితుడు, దేవరుడు, వ్యాసుడు లాంటివారు ఇది చాటి చెప్పారు. ఇప్పుడు స్వయంగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు” అంటూ అర్జునుడు కన్నీటి పర్యంతమయ్యాడు.

అర్జునుడిగా నిర్ధారణ అయినప్పుడే గీతా పఠనం పూర్తయినట్టు
భౌతిక జగత్తులోని జీవాత్మలు సనాతనమైన అంశాలు. కానీ భౌతిక శక్తి ద్వారా బంధీలై మనసుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియాలతో వారు ప్రయాస పడుతున్నారని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఆ భగవంతుడిని పూజించడమే ప్రతి జీవాత్మ తాలూకు కర్తవ్యం కనుక భగవద్గీత జీవన పోరాటం నుంచి పలాయనం చిత్తగించమని బోధించదు. శ్రీకృష్ణుని శరణు వేడి జీవన పోరాటాన్ని కొనసాగించాలని ప్రోత్సహిస్తుంది. అలాంటి వాటితో పోల్చితే కచ్చితంగా నేటి పరిస్థితులు ఎంతో మార్పు చెందాయన్నది స్పష్టమవుతుంది. అయితే పార్థుడు పొందిన భావోద్వేగ స్థితిని ప్రస్తుత పరిస్థితులతో పోల్చినప్పుడు వ్యక్తులు మానసికంగా ఎటువంటి మార్పు చెందలేదని అర్థం అవుతుంది. కేవలం బాహ్యంగా మాత్రమే మానవుడు మార్పు చెందాడు.ఆత్రుత, ఆవేదనలు నేటి సమాజంలో అప్పటికన్నా మరిన్ని రెట్లు అధికంగా అపాయకర స్థితికి చేరాయి. ఇటువంటి పరిస్థితుల్లో భగవద్గీత అనేది కచ్చితంగా ఆవశ్యకమైనది. అంతర్గత బలహీనతలను అర్జునుడు భగవద్గీత ద్వారా ఏ విధంగా చేదించుకోగలిగాడో, అదే విధంగా నేటి తరం కూడా వాటిని వదిలించుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. ఐదేళ్ల బాల్యం నుంచే పిల్లలకు భగవద్గీతలోని బోధనలను నేర్పిస్తే అది వారు విలువలతో కూడిన సంస్కారవంతమైన పౌరులుగా ఎదిగేందుకు దోహదపడుతుంది. భగవద్గీత అంటే ఒక మతానికి చెందిన గ్రంథం కాదు. అది విలువల సారం. ఎలా బతకాలో చెప్పే ఒక మార్గదర్శి. అన్నింటికన్నా ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఈ సమస్త జనావళికి అందించిన నీతిచంద్రిక. శ్రీకృష్ణుడు విలువల సారం తెలిసిన వెజ్జ( ఉపాధ్యాయుడు) కాబట్టి నాటి ద్వాపర యుగంలో జరిగిన పరిస్థితులు నేటి సైన్స్ యుగానికి ముడిపెట్టి దర్శకులు సినిమాలు తీస్తున్నారు. దేవి పుత్రుడు, కార్తికేయ 2, సాక్ష్యం, అంజి.. ఈ సినిమాలన్నీ ఆ కోవలోకి వస్తాయి. ఒక లక్ష్యం దిశగా ఒక మనిషిని పంచభూతాలు ప్రేరేపించినప్పుడు అది కచ్చితంగా లోకకల్యాణం కోసమే అయి ఉంటుంది. ఆ లోక కళ్యాణం భగవద్గీత అనే గ్రంథం తో ముడిపడి ఉంటుంది. ఆ భగవద్గీత బోధించిన వాడే శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణ నామం అనుసరణీయం కృష్ణ నామం సార్ధక దేయం. కృష్ణుడి మార్గం సదా అనుసరణీయం.
Also Read:Vyjayanthi Movies: వైజయంతీ మూవీస్ వరుస హిట్స్ వెనుక ఉన్న మేథ ఎవరిది?