Kokapet Land Auction: ఎకరాకు 100 కోట్లు.. హైదరాబాద్ భూములకు అంత డిమాండ్ ఎందుకు?

వాస్తవానికి భూముల ధరను హెచ్ఎండీఏ ఎకరానికి 35 కోట్లు ఖరారు చేసింది. అంచనాలకు మించి సగటున ఎకరం ధర 73.23 కోట్లను స్థిరాస్తి సంస్థలు చెల్లించడం విశేషం.

Written By: K.R, Updated On : August 4, 2023 11:59 am

Kokapet Land Auction

Follow us on

Kokapet Land Auction: ఎకరం 35 కోట్లు.. ఇది కోకాపేట నియో పోలిస్ ఫేజ్ _2 లో హెచ్ఎండిఏ నిర్ణయించిన భూముల ధర. కానీ రియాల్టీ సంస్థలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి. దీంతో 40 కోట్లు, 50, 60, 70 కోట్లు.. ఇలా పోటీ పెరిగి ఎకరం భూమి 100 కోట్ల ధర పలికింది. ఈ వేలాన్ని చూసిన చాలామంది నోట నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట.. అది భూమా? లేక బంగారు గనా?.. హెచ్ఎండీఏ భూముల వేలంతో కోకా పేట కాస్త కోట్ల పేట గా మారి పోయింది. ఇవాళ 111 జీవో ఎత్తివేసి గండిపేట పరిధిలో వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.. తాజాగా కోకాపేట పరిధిలో భూములకు వేలం వేసి రికార్డు స్థాయిలో కోట్లు దక్కించుకుంది. రాజ పుష్ప అనే రియల్టీ సంస్థ ఒక ఎకరాన్ని 100.75 కోట్లకు కొనుగోలు చేసింది అంటే హైదరాబాద్ రియాల్టీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది జరిగిన భూముల వేలంలో అత్యధికంగా ఎకరం 60.20 కోట్లకు ఎంచుకున్న రాజపుష్ప సంస్థ ఈసారి కూడా భారీ స్థాయిలో ధరకు భూములు కొనుగోలు చేయడం విశేషం.

వాస్తవానికి భూముల ధరను హెచ్ఎండీఏ ఎకరానికి 35 కోట్లు ఖరారు చేసింది. అంచనాలకు మించి సగటున ఎకరం ధర 73.23 కోట్లను స్థిరాస్తి సంస్థలు చెల్లించడం విశేషం. అయితే వీటిలో అత్యల్పంగా ఎకరం 67.25 కోట్లు పలికింది. హెచ్ఎండిఏ విక్రయించిన 45.33 ఎకరాలకు గాను ప్రభుత్వానికి 3319.60 కోట్ల ఆదాయం వచ్చింది. కోకాపేట భూముల వేలంపై ఎక్కడ కూడా 111 జీవో తొలగింపు ప్రభావం కనిపించలేదు. కోకాపేటలోని హెచ్ ఎం డి ఏ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్న నియో పోలిస్ లే_ అవుట్ లో ఫేజ్_2 లో 3.60 ఎకరాల నుంచి 9.71 ఎకరాల విస్తీర్ణంతో ఉండే ఏడు ప్లాట్లను ఎంఎస్ టీసీ అనే కేంద్ర ప్రభుత్వ ఈ కామర్స్ సంస్థ ద్వారా ఈ వేలం ప్రక్రియ సాగింది. ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు 6,7,8,9 ప్లాట్లను వేలం వేయగా, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10,11,14 ప్లాట్లను వేలం వేశారు. ఈ వేలంలో పాల్గొన్న పలు రియల్ ఎస్టేట్ ఇతర సంస్థలు పోటాపోటీగా రేటు పెంచాయి. అత్యధికంగా 10వ నెంబర్ ప్లాట్ విస్తీర్ణం 3.6 ఎకరాలు. ఇక్కడ ఎకరం ఎకరం 100.75 కోట్లు పలికింది. అంటే ఈ ప్లాట్ లో ఉన్న విస్తీర్ణం ప్రకారం రాజపుష్ప సంస్థ 362.70 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చింది.

నియో పొలీస్ లే అవుట్ లో స్థలాలను కొనుగోలు చేస్తే తమ ఇమేజ్ పెరుగుతుందని స్థిరాస్తి సంస్థలు భావించడమే ఇందుకు కారణం. పలు సంస్థలు చివరిదాకా వేలంలో పాల్గొనడంతో ధర అమాంతం పెరిగింది. పలు సంస్థలు చివరిలో వెనుకంజ వేశాయి. అయితే ఈసారి కొత్తగా మూడు రియల్ ఎస్టేట్ సంస్థలు ఇక్కడ స్థలాలు దక్కించుకున్నాయి. మొత్తం 45.33 ఎకరాలకు గాను రెండువేల కోట్ల దాకా వేళలో వస్తుందని భావించిన అధికారులు.. అంతకుమించి ఆదాయం రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కోకాపేటలో జూలై 15న హెచ్ఎండిఏ 49.94 ఎకరాలు విక్రయిస్తే 2000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి కేవలం 45 ఎకరాలకే 3319 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పట్లో అత్యధికంగా ఎకరం ధర 60.2 0 కోట్లు ఆదాయం వచ్చింది. అత్యల్పంగా 31. 20 కోట్లు పలికింది. అప్పటి వేలంలో భూములను పూర్తిగా రాష్ట్రానికి చెందిన పలు డెవలప్మెంట్ సంస్థలు పోటీపడి దక్కించుకున్నాయి. ఈసారి ఇతర రాష్ట్రాల కంపెనీలు కూడా భూములను దక్కించుకున్నాయి. బెంగళూరు ప్రాంతానికి చెందిన “బ్రిగేడ్” అనే సంస్థ 9.71 ఎకరాల విస్తీర్ణం ఉన్న 8వ నెంబర్ ప్లాట్లను దక్కించుకుంది. పదవ నెంబర్ ప్లాట్ ను అత్యధిక ధరకు దక్కించుకున్న రాజపుష్ప సంస్థ..6.55 ఎకరాల విస్తీర్ణంలోని ఏడవ నంబర్ ప్లాట్ కూడా కొనుగోలు చేసింది. ఈ రెండు ప్లాట్ల కొనుగోలు లో జాయింట్ వెంచర్ తో రాజ పుష్ప వచ్చింది. గతంలో మన్నే సత్యనారాయణ రెడ్డి ఈ_ వేలం లో మొదటి ప్లాట్ కు బోణీ కొట్టారు. ఈసారి ఆయనకు చెందిన ఎమ్మెస్ ఎన్ ఫార్మకేం సంస్థ బోణి కొట్టింది. ఈడు ఎకరాల విస్తీర్ణంలోని ఆరవ నెంబర్ ప్లాట్ దక్కించుకుంది. ఈ ప్లాట్లను కొనుగోలు చేసిన సంస్థలు కానీ, వ్యక్తులు కానీ డిపాజిట్ సొమ్ము ఐదు కోట్లు మినహాయించి స్థల ఖరీదు లో మొత్తంలో కనీసం 33% ఏడు రోజుల్లో చెల్లించాలి. రెండవ విడతగా మరో 30 రోజుల్లో స్థల ఖరీదు మొత్తంలో 33% చెల్లించాలి. చివరి విడతగా 90 రోజుల్లో డిపాజిట్ సొమ్ము అయిదు కోట్లు కలుపుకొని మిగతా మొత్తాన్ని చెల్లించాలి. వారం రోజుల్లో మొదటి విడత చెల్లింపులు చేయకుంటే నోటీసులు ఇచ్చి కొనుగోలు రద్దు చేస్తారు. డిపాజిట్ సొమ్ము అసలు వెనక్కి ఇవ్వరు.