Forest village : ‘మనది ధనిక రాష్ట్రం బై..’ గల్లా ఎగరవేసి టీఆర్ఎస్ నాయకులందరికీ ఈ స్టోరీ అంకితం.. మన ధనిక రాష్ట్రంలోనే కరెంట్ లేని ఒక గ్రామం ఉందని మీరు తెలుసుకోండి.. దేశంలోనే కరెంట్ వెలుగులు పూర్తి స్థాయిలో పంచామని తొడగొట్టే కేసీఆర్ కు తెలంగాణలోనే కారు చీకట్లు కమ్మే ఈ గ్రామం ఒకటుందన్న విషయాన్ని గుర్తించాలి. కనీస వసతులు లేక పసిప్రాణాలు పైపైనే పోతున్న వాస్తవాన్ని గ్రహించాలి. ధనిక రాష్ట్రంలో ఇంతటి ధరిద్రంలో అడవి బిడ్డలు చస్తున్నా ఒంటపట్టని అధికారుల చేతగానితనాన్ని గమనించాలి. రోడ్డు లేదు.. డ్రైనేజీలు లేవు. వర్షాకాలంలో ప్రపంచంతో సంబంధాలు కట్.. రోగమొస్తే ఆస్పత్రికి తీసుకెళ్లడానికి లేదు.. చచ్చిన శవాన్ని ఊరికి తీసుకురావడానికి సౌకర్యం లేదు. తన కూతురు మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఈ గ్రామానికి తీసుకొచ్చేందుకు 60 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై ఓ తండ్రి నరకయాతన పడ్డాడు. ఆ తండ్రి కన్నీటిగాథ అందరినీ తట్టిలేపింది. పాలకులను కాస్త కదిలించింది.. అధికారుల కళ్లు తెరిపించింది.. ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకునేలా చేసింది.. అంతటి దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ధనిక తెలంగాణలోని ‘కొత్త మేడేపల్లి’ గ్రామస్థుల దీనగాథపై స్పెషల్ ఫోకస్..

ఒక గంట సేపు కరెంటు పోతే నానా ఇబ్బందులు పడతాం… వర్షాకాలంలో రోజంతా చినుకులు కురిస్తే భరించలేక వానదేవుడిని తిడతాం.. డ్రైనేజీలు పొంగి దోమలు కుడితే మున్సిపాలిటీ సిబ్బందిని కొట్టినంత పని చేస్తాం.. కానీ వారు ఉండే ఊరిలో కరెంటు లేదు. సరైన దారి లేదు.. వర్షాకాలం వస్తే అంతే సంగతులు.. అలాగని వారు ఏమైనా రోహింగ్యాలా అంటే కాదు.. ఈ దేశపు పౌరులే. ముఖ్యంగా దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పింఛన్ కార్డు ఉన్నవారే.. ఐదేళ్లకు ఒకసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారే. కానీ సౌకర్యాల విషయంలో వారు అందరికంటే దూరంలో ఉన్నారు.. దురదృష్టానికి దగ్గరగా బతుకుతున్నారు..

బంగారు తెలంగాణ అని పలుమార్లు ఊదరగొట్టే కేసీఆర్ సొంత రాష్ట్రంలో ఏం జరుగుతుందో పట్టించుకోడు.. అధికారుల తప్పిదాన్ని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఏవైనా కథనాలు మీడియాలో ప్రచురితమైతే బీటి బ్యాచ్ ఎలాగూ ఖండిస్తూ ఉంటుంది. పొరపాటున బిజెపి పాలిత రాష్ట్రంలో గనుక ఏవైనా జరిగితే నానా హంగామా చేస్తుంది. ఐదు రోజుల క్రితం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని కొత్త మేడేపల్లి గ్రామం పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే ఈ గ్రామానికి చెందిన ఇద్దరు దంపతుల కుమార్తె మూర్చ వ్యాధితో కన్ను మూసింది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు వారు పడ్డ ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. మరీ ముఖ్యంగా గార్లవొడ్డు గ్రామం నుంచి కొత్త మేడేపల్లి గ్రామానికి తమ కూతురు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు వారు 60 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేశారు.. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు.. బాధిత కుటుంబ సభ్యులకు నగదు సహాయం చేశారు. అంతటితో చేతులు దులుపుకున్నారు.. గ్రామానికి వచ్చిన అధికారులు అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ముక్కున వేలేసుకున్నారు. కానీ లోపం ఎక్కడ ఉందో గుర్తించలేకపోయారు. ఇన్ని విషయాల తర్వాత లోతుగా పరిశీలన చేస్తే కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసలు కొత్త మేడేపల్లి గ్రామాన్ని కాపాడుకునేందుకు ఇక్కడ గిరిజనులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్నీ కావు. ఏకంగా సుప్రీంకోర్టు గడపే తొక్కారు.

-చత్తీస్ గడ్ నుంచి వలస వచ్చారు
కొత్త మేడేపల్లి గ్రామంలో ఉంటున్న వారంతా గొత్తి కోయలు. మీరు ఎప్పుడో దశాబ్దాల క్రితమే ఛత్తీస్ గడ్ రాష్ట్రం నుంచి ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామానికి వలస వచ్చారు. అయితే ఈ గ్రామాన్ని తరలించేందుకు అటవీ శాఖ అధికారులు చేయని ప్రయత్నాలు అంటూ లేవు.. చాలాసార్లు వీరి ఇళ్లను అటవీశాఖ అధికారులు తగలబెట్టారు.. గొత్తి కోయలను కొట్టారు.. ఈ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఇక్కడ గిరిజనులు 2014లో హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్టే వచ్చింది. ఇదే సమయంలో 2017లో మానవ హక్కుల కమిషన్ ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అప్పుడే బాహ్య ప్రపంచానికి ఈ కుగ్రామం గురించి తెలిసింది. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నత అధికారులు ఈ గ్రామాన్ని పలుమార్లు సందర్శించారు.. సమస్యలు పరిష్కరిస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. కానీ అవి నీటి మూటలే అయ్యాయి.
ఇటీవల జిల్లా కలెక్టర్ ఈ గ్రామంలో పర్యటించారు. గిరిజనుల కష్టాలు చూసి చలించిపోయి బోరు బావి తవ్వించారు.. సోలార్ లైట్లు వితరణగా అందజేశారు. పోలీసుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.. ఇక కోవిడ్ ప్రబలినప్పుడు పలు స్వచ్ఛంద సంస్థలు వీరికి నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్నాయి. ఈ గ్రామానికి సరైన రహదారి లేదు. విద్యుత్ సౌకర్యం అసలు లేదు. వర్షాకాలం వస్తే ఆ గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతుంది. వైద్యం అందక ప్రతి ఏడాది నలుగురు చిన్నారులు చనిపోతూనే ఉంటారు.. ఉన్న చిన్నారులు కూడా పోషకాహార లోపంతో బాధపడుతూ ఉంటారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇక్కడ గిరిజనులు రాత్రివేళ భయం భయంగా బతుకుతూ ఉంటారు.. రాత్రివేళ పాములు, తేళ్లు, క్రూరమృగాలు ఎక్కడ దాడి చేస్తాయని వణికి పోతూ ఉంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బాల వెలుగు పాఠశాల 6 నెలల నుంచి మూతపడింది. ఇక ఈ గ్రామంలో అంగన్వాడి కేంద్రం ఏర్పాటు ఊసే లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రోహింగ్యాలకు సంబంధించి రేషన్, ఆధార్ కార్డులు ఇచ్చి, ఈ రాష్ట్ర పౌరులుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం… అడవి బిడ్డల విషయంలో ఇంత కక్ష సాధింపు ఎందుకు ప్రదర్శిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అన్నట్టు 2018 ఎన్నికల్లో ఇక్కడి గిరిజనులు మొత్తం అధికార టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం రావడం లేదు.