Homeజాతీయ వార్తలుKCR National Party Announcement: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. కషాయ పాలనపై కేసీఆర్‌ ఫైట్‌!

KCR National Party Announcement: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. కషాయ పాలనపై కేసీఆర్‌ ఫైట్‌!

KCR National Party Announcement: పరాయి పాలన.. ఆంగ్లేయుల ఆధిపత్యంపై కాలుదువ్విన భారతీయులు వారితరిమి కొట్టే వరకూ మహా సంగ్రామమే చేశారు. ఇదే స్ఫూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివక్షకు గురవుతున్న తెలంగాణ ప్రజలు రగిలిపోయి కోసం అస్తిత్వం, ఆత్మగౌరవ నినాదంతో సాగించిన మలివిడత ఉద్యమం ద్వారా స్వరాష్ట్రం సాధించుకున్నారు. ఉద్యమ సారథిగా గులాబీ జెండా ఎత్తిన కేసీఆర్‌.. స్వరాష్ట్ర సాధకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో దేశంలో గుజరాతీల ఆధిపత్యంపై మరో పారాటానికి సిద్ధమయ్యారు కేసీఆర్‌. జాతీయ పార్టీ స్థాపించి శక్తివంతమైన ప్రధాని నరేంద్రమోదీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు.

KCR National Party Announcement
KCR

రాజకీయమే ఊపిరిగా..
రాజకీయాల్లో ఏదో విధంగా గడిపేద్దామనుకునేవారికి భవిష్యత్తు ఉండదు.. రాజకీయమే శ్వాసగా బతికే వారు మాత్రం ఎక్కువ కాలం ఉంటారు. అలాంటి రాజకీయ నేతలు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పటికి ఉన్న సీనియర్‌ నేతల్లో మోదీ, చంద్రబాబు, కేసీఆర్‌ , స్టాలిన్‌ , మమతా బెనర్జీ లాంటి అతి కొద్ది మంది నేతలే ఈ కోవలోకి వస్తారు. వీరిలో ఎవరు ఎక్కువ రాజకీయాన్ని శ్వాసిస్తారో వారిదే అంతిమ విజయం. ఇప్పటి వరకూ మోదీ ఈ రేసులో చాలా ముందున్నారు. ఆయనను చాలెంజ్‌ చేసేందుకు సమకాలీకులు శక్తిని కూడదీసుకుంటున్నారు. చాలా మంది మిడిల్‌ డ్రాప్‌ అయిపోతున్నారు. కొంత మంది ఫెయిలైనా ఫార్ములాల్లో ప్రయత్నిస్తున్నారు. కానీ అన్నింటినీ కాదని కేసీఆర్‌ సరికొత్త మార్గంలో మోదీని సవాల్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. నేరుగా జాతీయ పార్టీ పెట్టి మోదీని ఢీ కొట్టాలనుకుంటున్నారు. ఆయన కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ ఏ రేంజ్‌లో ఉన్నాయంటే.. మీలో చాలా మంది కేంద్రమంత్రులు కాబోతున్నారని సొంత పార్టీ నేతలకు భరోసా ఇచ్చేంత. ఇలా చాలా మందికి కామెడీ అనపించవచ్చు.. నవ్వుకోవచ్చు. కానీ కేసీఆర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి కాస్త తీరిగ్గా ఆలోచిస్తే నవ్విన నాపచేనే పండుతుందన్న సామెతను కేసీఆర్‌ నిజం చేసి చూపించారు. ఆయన భాషలో చెప్పాలంటే .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అసాధ్యమని నూటికి 99 శాతం తేలిగ్గా తీసుకున్నా.. ఎన్నో సార్లు అధ:పాతాళానికి పడిపోయినా ఫీనిక్స్‌లా లేచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ మోడీని అదే పద్దతిలో ఢీకొట్టాలనుకోవడం కూడా మొదట్లో కేసీఆర్‌ ఉద్యమం ప్రారంభించినప్పటి పరిస్థితే ఉండవచ్చు. కానీ ఎవరు చూశారు .. మోదీని నిజంగానే కేసీఆర్‌ దింపేస్తారేమో?. రాజకీయాలు ఇవాళ ఉన్నట్లుగా రేపు ఉండవు. డైనమిక్‌గా మారపోతూ ఉంటాయి. అంతే డైనమిక్‌గా ఎవరు అయితే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారో వారికే విజయం వరిస్తుంది. ఇప్పుడు కేసీఆర్‌ ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.

Also Read: Balapur Ganesh Laddu: బాలాపూర్ గణపతి లడ్డూకు ఎందుకంత క్రేజ్?: దీని చరిత్ర ఏంటో తెలుసా?

తెలంగాణ మోడల్‌ బ్రాండ్‌గా..
తెలంగాణలో తిరుగులేని నేతగా ఉన్న కేసీఆర్‌ రాజకీయాల్లో అపర చాణక్యుడు. ఆయన ప్రతీ అడుగులోనూ రాజకీయం ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రాన్నిసాధించారు. ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. అయితే కేసీఆర్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆయన ఓ ప్రాంతీయ పార్టీ నేత. అదీ కూడా ప్రాంతీయ ఉద్యమాన్ని నిర్వహించి అధికారంలోకి వచ్చిన నేత. తాను జాతీయ రాజకీయాలు.. అని అంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ కేసీఆర్‌ అలా అనుకోవడం లేదు. తాను తెలంగాణ సాధించానని.. అంతే వేగంగా ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రజల బతుకులు మార్చేశానని.. దేశ ప్రజల బతుకులు కూడా మార్చేస్తానని ధీమాగా చెబుతున్నారు. ఆయన ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిన విజయాల్ని దేశం ముందు పెడుతున్నారు. నిజానికి తెలంగాణ సాధించిన అభివృద్ధి అద్భుతం. ఈ విషయం తెలంగాణలో ఉండేవారికి తెలియదు. ఎనిమిదేళ్ల కిందటి హైదరాబాద్‌ నగరంతో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్‌ ఎంతో అభివృద్ది చెందింది. సంక్షేమ పథకాలతో ప్రజల కనీస అవసరాలు తీరాయి. ఎలా చూసినా ఎనిమిదేళ్ల కిందటితో పోలిస్తే తెలంగాణ అద్భుతమైన ప్రగతిని నమోదు చేసింది. ఈ ప్రగతి రోజూ చూస్తున్న వారికి మామూలేగా అనిపిస్తుంది. కానీ దేశ ప్రజలకు అలా అనిపించదు. ఎందుకంటే.. వాళ్ల జీవితాలు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. ఎనిమిదేళ్లు కాదు ఎనభై ఏళ్లుగా వారి బతుకుల్లో మార్పులు చాలా తక్కువగానే ఉంటున్నాయి. అందుకే కేసీఆర్‌ తాను చేసి చూపిస్తానని వారికి తెలంగాణ అభివృద్ధి నమూనాను వారి ముందు ఆవిష్కరిస్తున్నారు.

కూటమి కన్నా.. సొంత పార్టీకే మొగ్గు..
ప్రాంతీయ పార్టీల కూటమితో కుస్తీ పట్టడం కన్నా సొంత పార్టీనే బెటరన్న నిర్ణయానికి వచ్చారు కేసీఆర్‌. ప్రాంతీయ పార్టీ నేతగా తాను ఇతర పార్టీలతో కూటమి కట్టి మాత్రమే రాజకీయాలు చేయగలనని మొదట భావించారు. కూటమి కట్టడానికి చాలా రాష్ట్రాలు తిరిగారు. కానీ ఎవరికి వారు కేంద్రంలోని బీజేపీపై పోరాడేందుకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు పెట్టుకున్నారు. ఈ కారణంగా కూటమి ప్రయత్నాలు ఫలవంతం కాలేదు. చివరి ప్రయత్నంగా ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చి.. ఆ పార్టీపై పోరాడాలని నిర్ణయించుకున్న నితీశ్‌కుమార్‌తోనూ ప్రయత్నించారు. అయితే మొదటి నుంచి ఇలాంటి కూటమి రాజకీయాలు సక్సెస్‌ కాకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వ సమస్య. ఎవరో ఒకరు బలమైన నేతను ఎంచుకుని ఆయనను మోదీకి పోటీగా పెట్టి ..ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపించి.. తమ ప్రణాళికలు వెల్లడిస్తే ప్రజలు తమ నిర్ణయాన్ని వెలిబుచ్చేవారు. అయితే ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ మందిలాటరీ వేసేవారే. తమ పార్టీకి నిర్ణయాత్మకమైన సీట్లు వస్తే.. ప్రధాని పదవి తమకే దక్కుతుందని ఆశపడేవాళ్లే. ఈ కారణంగానే «థర్డ్‌ ఫ్రంట్‌ కానీ.. కాంగ్రెస్‌ ఫ్రంట్‌ కానీ సక్సెస్‌ కావడం లేదు. ఈ పరిణామాలన్నీ గ్రహించిన తర్వాత కేసీఆర్‌ తన ఆలోచనలను చివరికి తానే మార్చుకున్నారు. రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలంటే.. ఈ కూటమి రాజకీయాలతో కుస్తీ పడటం కంటే.. ప్రత్యేక పార్టీతో ముందుకెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. మెల్లగా తన ఆలోచనలను .. ప్రజల్లోకి పంపుతున్నారు. ఇటీవల నిజామాబాద్‌ సభలో .. తాము వస్తాం.. దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్‌ ఇస్తామని చేసిన ప్రకటనపై ఉత్తరాదిలోనూ విస్త్తృత చర్చ జరిగింది. కొన్ని బీజేపీ అనుకూల మీడియాలో కేసీఆర్‌ రైతుల్ని మభ్య పెడుతున్నారని పెద్దపెద్ద కథనాలు ప్రసారమయ్యాయి. అంటే కేసీఆర్‌ మాటలకు ఉత్తరాదిలోనూ మంచి పలుకుబడి వచ్చినట్లే.

KCR National Party Announcement
KCR

ఇది శుభారంభం అనుకోవచ్చు..
తెలంగాణ ప్రజల్ని ఏకం చేసినట్లుగా దేశంలోని రైతులందర్నీ ఏకం చేసే వ్యూహం కేసీఆర్‌ రాజకీయ అపర చాణక్యుడని ముందు చెప్పుకున్నాం. ఏదో రాజకీయ పార్టీ పెట్టి మంచి చేస్తా.. ఉచిత విద్యుత్‌ ఇస్తానంటే ఎవరూ ఓట్లేయరని ఆయనకూ తెలుసు. రాజకీయాలంటే ఈక్వేషన్స్‌.. ఎమోషన్స్‌ మిశ్రమం. ఇప్పటి రాజకీయాలు మొత్తం వాటి మీదే ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి ఈక్వేషన్స్‌.. ఎమోషన్స్‌తోనే కేసీఆర్‌ రాజకీయంగా యుద్ధం చేసి తెలంగాణ సాధించారు. ఇంత అనుభవం ఉన్న కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ఈక్వెషన్స్‌.. ఎమోషన్స్‌ చూసుకోకుండా వెళ్తారని అనుకోలేం. కులాన్ని వాడలేరు. ఎందుకంటే దేశం మొత్తం ఒకే కులం వర్కవుట్‌ కాదు. మతం అనేది బీజేపీ సొంతం. ఆ పేరుతో ఏం చేసినా బీజేపీకే లాభిస్తుంది. ఇక కేసీఆర్‌కు అచ్చి వచ్చిన ప్రాంతీయ సెంటిమెంట్‌ కూడా బీజేపీదే. భారత్‌ .. దేశభక్తిని బీజేపీ పేటెంట్‌గా చేసుకుంది. మరి భారతీయులందర్నీ ఒకే తాటిపైకి తెచ్చే ఎమోషన్‌ ఏదో గుర్తించిన కేసీఆర్‌ దానినే పట్టుకున్నారు. అదే రైతు ఎమోషన్‌. మోదీ సర్కార్‌ చేసిన తప్పులతో రైతులందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు గట్టి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అమలు చేస్తున్నారు కూడా. ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం ఇచ్చారు. తెలంగాణలో రైతులకు తాము చేస్తున్న మేలు గురించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారు. అదే సమయంలో అన్ని రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులను ప్రగతి భవన్‌కు పిలిపించి.. తెలంగాణలో రైతులకు చేస్తున్న మేలును వివరించారు. అందరం కలిసి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ పిలుపు రైతు సంఘాల నేతల్ని ఆకర్షించింది. రైతు నేతలంతా చట్టసభల్లో ఉండాలని కేసీఆర్‌ అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో రైతు నేతలను ముందు పెట్టి.. రైతు సెంటిమెంట్‌తో.. రైతు పార్టీని కేసీఆర్‌ లాంఛ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తెలివైన ఎత్తుగడ..
రైతు ఎమోషన్‌ను ఎత్తుకోవడం కేసీఆర్‌ చేసిన తెలివైన ఎత్తుగడ. ఎందుకంటే దేశంలో ఎక్కువ మంది రైతులు.. రైతు బిడ్డలే ఉంటారు. ఇతరులు ఉండరు. వారిలో రైతు ప్రభుత్వం.. మన ప్రభుత్వం అనే ఎమోషన్‌ తీసుకు వస్తే కేసీఆర్‌ రాజకీయం చాలా సులువు అవుతుంది. కేసీఆర్‌ పోరాడుతోంది మోదీతో.. అలాగని ఓడిపోతారనేం లేదుగా!? కేసీఆర్‌ ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేశారు. రైతు ఎజెండాతో మోడీని ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన జాతీయ పార్టీని పెట్టవచ్చు. ఆ పార్టీని మరికొన్ని బలమైన పార్టీలతో కలుపుకుని పోరాడవచ్చు. ముందుగా చెప్పుకున్నట్లుగా రాజకీయాల్లో సమీకరణాలు కూడా ముఖ్యం. అన్నింటీనీ బ్యాలెన్స్‌ చేయగల సత్తా కేసీఆర్‌కు ఉంది.

మోదీనే అసలు సవాల్‌..
అయితే కేసీఆర్‌ సవాల్‌ చేస్తున్నది దేశంలో బలమైన నేత నరేంద్రమోదీని. మోదీ రాజకీయం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అందుకే ఆయన ఒకప్పుడు అంటరాని నేతగా ఉన్న ఆయన ఇప్పుడు పవర్‌ ఫుల్‌గా ఎదిగారు. ఇతరులెవరూ టచ్‌ చేయలేనంతగా ఇమేజ్‌ తెచ్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ పోరాడుతోంది అలాంటి నేతతోనే. కచ్చితంగా ఈ పోరాటంలో అడ్వాంటేజ్‌ మోదీ వైపే ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ కేసీఆర్‌ రాజకీయాలను మాత్రం తక్కువగా అంచనా వేయలేం. తెలంగాణలో ఆయన రాజకీయాలను ఎలా అయినా నిర్వహించి ఉండవచ్చు.. జాతీయ స్థాయిలో మోదీ ఏం చేశారో.. తెలంగాణలో అదే చేశారని ఇద్దరికీ పెద్ద తేడా లేదని చాలా మంది విమర్శిస్తూ ఉండవచ్చు. కానీ అత్యంత బలవంతుడైన ప్రజాస్వామ్య రాజుకి అంతే బలవంతుడైన ప్రత్యర్థి ఉండటం కూడా ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యం. అలాంటి ప్రత్యర్థి తెలుగు రాష్ట్రాల నుంచి వస్తే అంత కంటే మేలైన విషయం ఉండదు.

తెలుగువారిలో పుష్కలంగా నాయకత్వ లక్షణాలు..
నాయకత్వ లక్షణాల్లో తెలుగు వాళ్లు తీసేసిన వాళ్లు కాదని.. జాతీయ రాజకీయాల్లో గతంలో కేంద్ర ప్రభుత్వాల్ని మార్చగలిగేలా.. ఏర్పాటు చేయగలిగేలా చక్రం తిప్పిన నేతలు ఉన్నారు. కానీ నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్నే లక్ష్యంగా చేసుకున్న తెలుగు నేతలెవరూ లేరు. ఆ విషయంలో కేసీఆర్‌ ముందున్నారు. గుజరాతీల రాజకీయ వ్యూహాలను తిప్పికొట్టగలిగిన వారని నిరూపించగలిగే సామర్త్యం కేసీఆర్‌కు ఉంది. ఆ దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా ప్రయత్నించి పరాజయం పాలవడం ఓ రకంగా విజయమే. ప్రయత్నించని వాడికన్నా ప్రయత్నించిన వాడే అసలైన విజేత. కేసీఆర్‌ ఇదే స్ఫూర్తితో రంగంలోకి దిగి మోదీతో పోటీ పడి దేశ ప్రజల మన్ననలు పొందాలని భావిస్తున్నారు. ఎందుకంటేంప్రజాస్వామ్యంలో గెలిచేది.. గెలిపించేది ప్రజలే. వారు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. అందులో కేసీఆర్‌ కూడా ఉండొచ్చు.

Also Read:YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో హైకోర్టు సంచలన నిర్ణయం..

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular