https://oktelugu.com/

KCR vs Etela : ఈటల రాజేందర్ కు ‘కాసాని’తో చెక్ పెట్టనున్న కేసీఆర్

ఈ క్రమంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు కాసాని జ్ఞానేశ్వర్‌ రూపంలో కేసీఆర్‌కు గోషామహల్‌ అభ్యర్థి దొరికాడని భావిస్తున్నట్లు తెలిసింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2023 11:10 am
    Follow us on

    KCR vs Etela : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుంది. ఈమేరకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కలలు కల్లలయ్యాయి. అధినేత నిర్ణయంతో తీవ్ర మనస్తాపం చెందిన కాసాని.. పోటీ చేయనప్పుడు పార్టీ ఎందుకు అని మీడియా ముఖంగానే ప్రశ్నించారు. తన దారి తాను చూసుకుంటానని కూడా స్పష్టం చేశారు. అలిగిన జ్ఞానేశ్వర్‌ మూడు రోజులుగా ఎవరికీ అందుబాటులో లేరు. తాజాగా శుక్రవారం ఉదయం ఓ లీక్‌ ఇచ్చారు. తాను సైకిల్‌ దిగి కారెక్కబోతున్నట్లు వెల్లడించారు. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్‌ ఫాం హౌస్‌లో గులాబీ బాస్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరబోతున్నారు.

    11:30కి ముహూర్తం..
    తెలంగాణ ఎలక్షన్స్‌లో పోటీ చేయవద్దని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో కాసాని టీడీపీ పార్టీకి, రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముదిరాజ్‌ సామాజిక వర్గంలో కీలక నేతగా ఎదిగిన కాసానిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా ఈసారి ఆ సామాజిక వర్గంపై వివక్ష చూపారు. దీంతో ఆ సామాజికవర్గం బీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో ముదిరాజ్‌లు ఓ సభ కూడా పెట్టుకున్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్‌ నేత నీలం మధు కూడా హాజరయ్యారు. ముదిరాజ్‌లపై అధికార బీఆర్‌ఎస్‌ చూపిన వివక్షను ఎండగట్టారు. ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతామని ప్రకటించారు. యాభై లక్షల ఓట్లున్న తమను అధికార పార్టీ లెక్క చేయడం లేదని ముదిరాజ్‌ సామాజికవర్గం రా రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తోంది. దీంతో గులాబీ బాస్‌ పునరాలోచనలో పడ్డారు. ముదిరాజ్‌ల దెబ్బ పార్టీపై తీవ్రంగా ఉంటుందని లెక్కలు వేశారు. ఈ క్రమంలో ఎందుకు ఛాన్స్‌ తీసుకోవాలనుకున్న కేసీఆర్‌.. తాజాగా కాసాని జ్ఞానేశ్వర్‌తో ముందిరాజ్‌లను చల్లబర్చే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.

    నిప్పులపై నీళ్లు చల్లినట్లుగా..
    ముదిరాజ్‌ సామాజిక వర్గానికి బీఆర్‌ఎస్‌ ఒక్క టికెట్‌ కేటాయించలేదని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ముదిరాజ్‌ల ఆగ్రహం చల్లార్చేలా కేసీఆర్‌ కొత్త పాచిక వేయబోతున్నారు. గతంలో ముదిరాజ్‌ సంఘానికి పెద్దదిక్కుగా వ్యవహరించిన కాసాని జ్ఞానేశ్వర్‌ను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కలిసి వస్తుందని కేసీఆర్‌ భావించారు. అంతేకాదు.. ఆయనకు గోషామహల్‌ టికెట్‌ ఇవ్వాలని కూడా డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. తద్వారా బీఆర్‌ఎస్‌పై ఉన్న మచ్చను తుడిచివేయవచ్చని గులాబీ బాస్‌ భావిస్తున్నారు.

    వివిధ కారణాలతో గోషామహల్‌ ఖాళీగా..
    బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో ఇంకా రెండు స్థానాలకు టికెట్లు ప్రకటించలేదు. అందులో గోషామహల్‌ ఒకటి. వివిధ కారణాలతో కేసీఆర్‌ ఇప్పటివరకు గోషామహల్‌ నియోజకవర్గానికి అభ్యర్ధిని ప్రకటించలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ వేటు వేయడంతో ఆయనను బీఆర్‌ఎస్‌లోకి లాగేందుకు కేసీఆర్‌ అనేక ప్రయత్నాలు చేశారు. కానీ రాజాసింగ్‌ పోటీ చేసే బీజేపీ టికెట్‌పైనే చేస్తానని లేదంటే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ప్రకటించారు. దీంతో కేసీఆర్‌ ఆశలు వదులుకున్నారు. ఈ క్రమంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు కాసాని జ్ఞానేశ్వర్‌ రూపంలో కేసీఆర్‌కు గోషామహల్‌ అభ్యర్థి దొరికాడని భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ గోషామహల్‌ టికెట్‌ ఇవ్వకపోయినా.. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవి హామీతోనే కాసాని గులాబీ గూటికి చేరుతున్నట్లు సమాచారం.