YS Sharmila KCR Bandi : సహజంగానే బీజేపీ అంటేనే సోషల్ మీడియా.. ఢిల్లీలో మోడీ.. గల్లీలో బీజేపీ నేతలు ఈ ఆయుధాన్ని వాడి.. మీడియాలో నాని పాపులర్ అవుతుంటారు. బీజేపీ వాడినట్టు ఎవ్వరూ ఈ సోషల్ మీడియాను వాడరు. అయితే ఈరోజు మాత్రం ఖచ్చితంగా బీజేపీకి మైలేజ్ రాకుండా గులాబీ బ్యాచ్ కాస్త గట్టిగానే స్కెచ్ గీశారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్మల్ జిల్లాలో మొదలుపెట్టిన 5వ విడత పాదయాత్రకు ఈరోజు హైప్ రాకుండా తెలంగాణ సర్కార్ వ్యూహాత్మకంగా ‘వైఎస్ షర్మిల’ను వాడేసినట్టు కనిపిస్తోంది. దాదాపు 3వేల కి.మీలు పాదయాత్ర చేసినా షర్మిలను తెలంగాణలో పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అటు ప్రజలు, ఇటు ప్రత్యర్తి పార్టీలు కూడా లైట్ తీసుకుంటున్నాయి.
అందుకే నిన్న తనను అడ్డుకున్నారని ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి ఆ దెబ్బతిన్న కారుతోనే బయలు దేరింది వైఎస్ షర్మిల. ఈఎపిసోడ్ ఏదో కలిసి వస్తుందని భావించిన కేసీఆర్ అండ్ టీం.. షర్మిలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో తనేదో గొప్పగా పోరాడుతున్నట్టు షర్మిల ఈరోజు పొద్దంతా ఆందోళనలతో.. పోలీస్ స్టేషన్ నుంచి , లోటస్ పాండ్ నుంచి తప్పించుకొని పోలీసులకు మీడియాకు బాగానే పనిచెప్పింది.
ఈరోజు మీడియా అంతా షర్మిల కుప్పిగంతులతోనే పాపులర్ అయ్యింది. ఇక షర్మిలను చివరకు అరెస్ట్ చేద్దామంటే కారునుంచి కిందకు దిగకపోవడంతో ఆమె కారుతోనే ట్రాఫిక్ పోలీసులు క్రేన్ తో వ్యాన్ పై పెట్టి మరీ లాక్కెళ్లిపోయారు. ఇది మీడియాలో హైలెట్ అయ్యింది.

ఇక తన కూతురును అరెస్ట్ చేస్తారా? అంటూ వైఎస్ విజయమ్మ బయలు దేరింది. కూతురును చూడనివ్వరా? అంటూ ఆమె నడిరోడ్డుపై గోల చేసింది. పోలీసులు విజయమ్మను హౌస్ అరెస్ట్ చేశారు. ఇది కూడా సాయంత్రం కాస్తా మీడియాకు వ్యూయర్ షిప్ పెంచింది.
ఇంతేనా తన భార్య వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారని తెలియగానే బ్రదర్ అనిల్ బయలు దేరాడు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ చేరుకొని భార్య షర్మిలకు బాసటగా నిలిచాడు. నిరసన తెలిపే హక్కు లేదా అంటూ ప్రశ్నించాడు.
ఇలా బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు ఏమాత్రం మైలేజ్ రాకుండా వైఎస్ షర్మిలను ఉపయోగించుకొని ఈరోజు టీఆర్ఎస్ సర్కార్ మీడియాకు పని కల్పించింది. దీంతో షర్మిల హైలెట్ కాగా.. బండి సంజయ్ పాదయాత్ర మరుగునపడింది. ఇదంతా కేసీఆర్ అండ్ కో చేసిన మ్యాజిక్ అని.. షర్మిల ఇవేవీ తెలియక నానా యాగీ చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.