KCR Agriculture : ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం.. తుంటి ఎముక విరగడం.. వంటి పరిణామాలతో భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ బయటకు రావడం లేదు. సర్జరీ తర్వాత యశోద ఆసుపత్రి నుంచి నేరుగా నంది హిల్స్ లోని తన ఇంటికి నేరుగా వెళ్లిపోయారు. అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం కెసిఆర్ వైద్యుల పర్యవేక్షణలో మెల్లిమెల్లిగా నడుస్తున్నారు. కెసిఆర్ ను ఎంపీ సంతోష్ కుమార్ పర్యవేక్షిస్తుండగా.. పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఇటీవల మాజీ గవర్నర్ నరసింహన్ సతి సమేతంగా కేసీఆర్ వద్దకు వెళ్లారు. ఆయనను పరామర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హరీష్ రావు కూడా తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. అయితే ఈ క్రమంలో కేసీఆర్ మాట్లాడిన ఒక ఫోన్ కాల్ చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి కాకముందే కేసీఆర్ కు ఎర్రవల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది. అక్కడ వివిధ రకాల పంటలను పండిస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ లోనే ఉండేవారు. కొన్నిసార్లు మంత్రులతో అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించేవారు. కీలకమైన అధికారులు కూడా కేసీఆర్ ను అక్కడే కలిసి మాట్లాడేవారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఓడిపోవడంతో ప్రగతి భవన్ నుంచి ఆయన నేరుగా ఫామ్ హౌస్ కే వెళ్ళిపోయారు. అక్కడే కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులతో ఎన్నికల్లో ఎదురైన ఓటమికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత కాలు జారి పడ్డారు. తుంటి ఎముక విరగడంతో యశోద ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కొద్ది రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి నంది హిల్స్ లోని తన ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న ఆయన గజ్వేల్ లోని ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని బాపురెడ్డికి ఫోన్ చేశారు.. పది రోజుల్లో నేను ఫామ్ హౌస్ కి వస్తాను. ఎరువులు, విత్తనాలు అన్ని సిద్ధం చేయండి. ఈసారి బొప్పాయి పంట సాగు చేద్దాం. ప్రస్తుతానికైతే నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. కొద్దిరోజులైతే అంత నయం అవుతుంది. పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అంటూ బాపురెడ్డికి కెసిఆర్ వివరించారు.
అయితే ఈ ఫోన్ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఓటమి అనంతరం కొద్ది రోజులపాటు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారు. ఎక్కడ జరుగుతున్న వ్యవసాయ పనులను పరిశీలించారు. అయితే ఈసారి బొప్పాయి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని కెసిఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. అందువల్లే బాపు రెడ్డి అనే ఫర్టిలైజర్ షాప్ యజమానికి ఫోన్ చేసి ఎరువులు, విత్తనాలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో కేసీఆర్ బయటికి వస్తారని.. అందరి లెక్కలు తేలుస్తారని ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో ఎరువులు విత్తనాలు సిద్ధం చేస్తే బొప్పాయి పంట సాగు చేద్దామని బాపురెడ్డికి కేసీఆర్ చెప్పడం విశేషం.