YS Sharmila KCR : ప్రజాపోరాటాల విలువ తెలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తన దాకా వచ్చేసరికి అలాంటి శాంతియుత నిరసనలు, పోరాటాలను చూసి భయపడుతున్నారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో జరుగుతున్న నేతల పాదయాత్రలు గులాబీబాస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిన్నాయన్నన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్.షర్మిల రాష్ట్రంలో వేర్వేరుగా చేస్తున్న పాదయాత్రలు కేసీఆర్‌కు తలనొప్పిగా మారాయి. బయటకు కనిపించకున్నా.. ఇంటెలిజెన్స్ రిపోర్టులు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇమేజ్ పాదయాత్రలతో డ్యామేజ్ అవుతోందని తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని చేస్తున్న ఆరోపణలు, ఆధారాలతో బయటపెతున్న అవినీతి, ఆ మూడు నియోజకవర్గాలతో పోలిస్తే అభివృద్ధి గురించి నిలదీస్తున్న తీరుతో గులాబీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో కేసీఆర్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భైంసా నుంచి చేపట్టే బండి సంజయ్ ఐదో విడత యాత్రను అడ్డుకోవాలని చూడగా, కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నారు. తాజాగా షర్మిల నర్సంపేట ఎమ్మెల్యేను దూషించిందని అరెస్ట్ చేయగా, ఆమె కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతి ఇవ్వాలని ఆదేశించిన పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు.

-దీక్షతో దిగి రావాల్సిన పరిస్థితి..
పాదయాత్ర అనుమతి కోసం మొదట మరోమారు కోర్టుకు వెళ్లాలని షర్మిల భావించారు. ఈ విషయమై పార్టీ నేతలతో చర్చించారు. వారి సూచన మేరకు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడం ద్వారా కేసీఆర్ నియంతృత్వ ధోరణిని అరికట్టడంతోపాటు వైఎస్సార్‌టీపీ ఇమేజ్ పెంచుకోవచ్చని నిర్ణయించారు. ఈమేరకు ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. పోలీసులతో నిరసనను అణచివేయాలని చూసిన కేసీఆర్‌కు షర్మిల షాక్ ఇచ్చారు. నిరసనను ఆమరణ దీక్షగా మార్చారు.
-దీక్ష భగ్నం..
రెండు రోజుగా షర్మిల చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు శనివారం అర్ధరాత్రి భగ్నం చేశారు. ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను విడతలు విడతలుగా పరీక్షిస్తున్న వైద్యులు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత పెద్దసంఖ్యలో లోటస్ పాండ్‌కు చేరుకున్న పోలీసులు షర్మిలను అరెస్టు చేసి అపోలో ఆస్పత్రికి తరలించారు.
-దీక్షతో లక్ష్యం నెరవేరినట్లేనా..
కేసీఆర్ ప్రభుత్వం తీరుపై వైఎస్.షర్మిల చేస్తున్న ప్రజాస్వామ్యయుత పోరాటం తారస్థాయికి చేరుకుంటోంది. ఆమె పోరాటానికి ప్రజాదరణ పెరుగుతోందనే ఉద్దేశంతో కేసీఆర్ దానిని సహించలేకపోతున్నారు. వరంగల్‌లో తెరాస శ్రేణులు ఆమె పాదయాత్రను అడ్డుకోవడం, ఘర్షణలు అరెస్టులు ఇందుకు పెద్ద ఉదాహరణ. మరునాడు ప్రగతి భవన్‌ను ముట్టడించడానికి షర్మిల ప్రయత్నించినప్పుడు పోలీసులు ప్రదర్శించిన వైఖరి.. రాష్ట్రవ్యాప్తంగా ఆమె ఇమేజ్ పెంచాయి. ఒక నాయకురాలి దీక్షపట్ల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ పోలీసులు అంత అమానుషంగా వ్యవహరించలేదనే అపకీర్తి ప్రభుత్వం మూటగట్టుకుంది. ఆమె పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరినంచడంతో ఆమె ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అయితే.. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీల వారికీ గళమెత్తి తమ వైఖరి చెప్పడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా కేసీఆర్‌పై తమ యాత్రలు, సభలో ఏ రేంజిలో నిందలు వేస్తుంటారో అందరికీ తెలుసు. అయితే షర్మిల విషయంలో మాత్రం కేసీఆర్ ఎందుకింత పట్టుదలగా తొక్కేయాలని చూస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో పార్టీల పోరాటాల విలువ గురించి కేసీఆర్ కు బాగా తెలుసు. తెలంగాణ సాధన కోసం ఆయన సాగించిన నిరాహారదీక్షను కూడా ఆ పార్టీ వారు ఇప్పటికీ ఒక ఉత్సవంలాగా ఏటా గుర్తుచేసుకుంటారు. అలాంటిది.. షర్మిలకు అనుమతులు ఇవ్వకపోగా, దీక్షను భగ్నం చేయడం చిత్రం. కేసీఆర్‌ను డ్యామేజ్ చేయడంలోనూ దీక్ష ద్వారా షర్మిల సక్సెస్ అయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కేసీఆర్ సర్కారు ఒక మెట్టు దిగక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. షర్మిల ఇతర నాయకుల్లా కాదని, ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తుందని తిరిగి ఇంటికి వస్తే మళ్లీ దీక్ష కొనసాగుతుందని అంటున్నారు. కోర్టు ద్వారా తన పాదయాత్రకు అనుమతి తెచ్చుకోవడం చాలా సునాయాసమైన విషయం అయినప్పటికీ.. పోరాటం ద్వారానే సాధించుకోవాలని షర్మిల కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ మెట్టు దిగే వరకు ఆమె పోరాటం షర్మిల పోరాటం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
-హెల్త్ బులెటిన్ రిలీజ్..
వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 11 తెల్లవారుజామున ఒంటి గంటకు షర్మిల హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె బీపీ, డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైటెన్షన్‌తో ఇబ్బంది పడుతున్నారని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. అలాగే తీవ్రమైన ఒలిగురియ, అధిక అయాన్ గ్యాప్, మెటబాలిక్ అసిడోసిస్, ప్రీరీనల్ అజోటేమియా కూడా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించి చికిత్స అందిస్తున్నాం. ఆదివారం సాయంత్రం లేదా రేపు ఉదయం ఆమెను డిశ్చార్జ్ చేస్తామని అపోలో డాక్టర్లు పేర్కొన్నారు. వైఎస్ షర్మిలకు 2–3 వారాలు విశ్రాంతి అవసరమని అపోలో వైద్యులు సూచించారు.