HomeతెలంగాణCM KCR: శరామామూలే.. ఎన్ని ఆరోపణలు వచ్చినా కేసీఆర్ మౌనమే?

CM KCR: శరామామూలే.. ఎన్ని ఆరోపణలు వచ్చినా కేసీఆర్ మౌనమే?

CM KCR: ఎన్ని ఆరోపణలు వచ్చినా కేసీఆర్ మాత్రం తన మంత్రులను కోడి పొదిగినట్టు పొదిగేసి అస్సలు బయటకు రానీయరు. ఇప్పటికే ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి వ్యవహారం బయటపడినా ఆయనను తొలగించలేదు. తాజాగా ఖమ్మంలో బీజేపీ నేత సాయిగణేశ్‌ ఆత్మహత్య వ్యవహారం మలుపులు తిరుగుతోంది. కేసు తిరిగి తిరిగి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చుట్టు తిరుగుతోంది. దీంతో కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారనేదానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటివరకూ కేసీఆర్ దీని మీద దృష్టి సారించింది లేదు.

CM KCR
Puvvada Ajay Kumar

రాజకీయాల్లోకి వచ్చిన కేవలం ఆరేళ్లలోనే మంత్రి పదవి వరించిన అదృష్టవంతుడు పువ్వాడ అజయ్‌కుమార్‌. కుటుంబం సీపీఐలో ఉండటం, ఆయన తండ్రి సీపీఐ సీనియర్‌ నేతగా ఉండటం, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసి ఉండడంతో తొలినుంచి వామపక్ష భావజాలంతో అజయ్‌కుమార్‌ ఉండే వారంటారు. తర్వాత మమత మెడికల్‌ కాలేజీ చైర్మన్ గా సంస్థ అభివృద్ధి, విస్తరణలో ఆయన కృషిని చెప్పుకోవాల్సిందే. మరో మెడికల్‌ కళాశాలను హైదరాబాద్‌ బాచుపల్లిలో ఏర్పాటు చేయడం.. అజయ్‌కుమార్‌ పాలనా దక్షతను చాటుతోంది. 2012లో వైఎస్సార్‌సీపీలో చేరడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అజయ్‌. జిల్లా కన్వీనర్‌గా పార్టీ విస్తరణ కోసం పనిచేశారు.

-సీనియర్లున్నా పువ్వాడకే అవకాశం..

రాష్ట్ర విభజన అనంతరం అజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొద్దికాలానికే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు ఉండటంతో ఆయనకే కమ్మ సామాజికవర్గ కోటాలో మంత్రి పదవి దక్కింది. దీంతో 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమి అనంతరం రాష్ట్రంలో అదే సామాజికవర్గం నుంచి గెలిచిన కోనేరు కోనప్ప, అరికెపూడి గాంధీ, భాస్కరరావు లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ, కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్కడు పువ్వాడ అజయ్‌కుమార్‌ కావడంతో ఆయనకు మంత్రి పదవి వరించింది.

-ప్రతిపక్షాల దాడి..

తాజాగా ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సామినేని సాయిగణేశ్‌ ఆత్మహత్య వ్యవహారంలో బీజేపీ కేంద్ర పెద్దలు జోక్యం చేసుకోవడం.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఇప్పటికే ఖమ్మం రావడం.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఈ ఇష్యూపై తీవ్రంగా స్పందించడం.. కేంద్ర మాజీ మంత్రి రేణుకచౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. ఒకటి రెండు రోజుల్లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఖమ్మం రానున్న నేపథ్యంలో ఇది అజయ్‌కుమార్‌కు తీవ్రమైన తలనొప్పిగా తయారైంది.

ఒకవైపు జుడీషియల్‌గా కేసును ఎదుర్కోవడం.. మరోవైపు రాజకీయంగా ఆరోపణలను కాచుకోవడం.. అజయ్‌కు సవాల్‌గా మారిందని చెప్పాలి. తాజాగా మంత్రి అజయ్‌కుమార్‌ను మంత్రిమండలి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీభవన్ ముందు నిరసనకు దిగారు. ఇది కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్రమైన వత్తిడిని పెంచుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి సీఎం కేసీఆర్‌ ఈ విషయంలో ఎలా స్పందిస్తారు..? పార్టీకి నష్టం కలగకుండా నష్టనివారణకు పూనుకుంటారా..? లేక మంత్రి అజయ్‌కు అండగా నిలుస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ విషయంపై కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరించే కోణంలోనే ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పువ్వాడకు ప్రత్యక్షంగా సాయిగణేశ్‌ ఆత్మహత్యకు సంబంధం లేకపోయినా.. ఖమ్మంలోని ప్రజానీకంలో పువ్వాడపై వ్యతిరేకత రావడంతో కేసీఆర్‌ అసంతప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పువ్వాడకు కొంచెం చేటు చేసేది.

-సోషల్‌ మీడియాలో విమర్శలు..

సోషల్‌ మీడియాలో పువ్వాడకు వ్యతిరేకంగా అటు బీజేపీ నాయకులే కాకుండా సామాన్య జనం కూడా పోస్టులు పెడుతుండటం టీఆర్‌ఎస్‌ను ఇబ్బందుల్లో పడేసింది. అందులోనూ పువ్వాడ సొంత కులం కమ్మ వారు కూడా ఇటీవల జరిగిన పరిణామాలతో విసుగు చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమ్మ కులస్థులు కూడా పువ్వాడను సోషల్‌ మీడియాలో విమర్శిస్తూ వస్తున్నారు. దీంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అండగా గులాబీ నేతలు రంగంలోకి దిగారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ అండగా నిలిచే ప్రయత్నం చేశారు. పలువురు నేతలు, కార్పొరేటర్లు, ఇంకా కమ్మ సామాజికవర్గంలోని పెద్దలతో సెల్ఫీ వీడియోలు చేయించి కౌంటర్‌లు సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు. మొత్తంమీద ఈనెల 14న సామినేని సాయిశ్‌ మొదలు గడచిన వారానికి పైగా ఖమ్మంలో ఇదే వివాదం తీవ్రమవుతూ వస్తోంది. తమ పార్టీకి చెందిన యువ నేత ఆత్మహత్యకు పాల్పడటం.. అతనిపై వరుస కేసులు పెట్టి మరీ వేధింపులకు పాల్పడిన విషయాన్ని బీజేపీ నేతలు ఎలివేట్‌ చేయగలిగారనే చెప్పొచ్చు.

-ప్లీనరీ తర్వాతే నిర్ణయం…

మంత్రి పువ్వాడ విషయంలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 27న ప్లీనరీ ఉడడంతో గులాబీ బాస్‌ ప్రస్తుతం ఆ పనిలోనే బిజీగా ఉన్నారు. మరోవైపు పువ్వాడకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు 29 వరకు సమాధానం ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో 29న మంత్రి కోర్టుకు ఇచ్చే సమాధానం, దానిపై న్యాయస్థానం స్పందన ఆధారంగా కేసీఆర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గులాబీ నేతలు చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version