Homeజాతీయ వార్తలుJournalist vs KCR : జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు అడ్డు పుల్ల పెడుతున్నదే కేసీఆర్.. అసలు...

Journalist vs KCR : జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు అడ్డు పుల్ల పెడుతున్నదే కేసీఆర్.. అసలు కథ ఇదీ

Journalist vs KCR : జర్నలిస్ట్ కొలువంటేనే వెట్టి చాకిరి వ్యవహారం.. మేనేజ్మెంట్ ను సంతృప్తి పరచాలి.. యాడ్స్ టార్గెట్ పూర్తి చేయాలి. రాసే వార్త ఇబ్బంది కలిగించకూడదు.. పోనీ ఇంత చేస్తే ఏమైనా దక్కుతుందా అంటే.. గొర్రె తోక బెత్తెడు చందం.. ఓ సమయం ఉండదు, సందర్భం ఉండదు. ఇక సెలవులు అయితే పేరుకే ఉంటాయి.. ఫీల్డ్ లెవల్లో అయితే కొద్దో గొప్పో ఊపిరి తీసుకునే సమయం ఉంటుంది. కానీ డెస్క్ లో పనిచేసే జర్నలిస్టుల పరిస్థితి అలా కాదు. కాలంతో సంబంధం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ముంచుకొస్తున్న డెడ్ లైన్ మధ్య వార్తలు ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది.. ప్రకృతికి విరుద్ధంగా పనిచేయాల్సి రావటం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. యాజమాన్యాలు పట్టించుకోకపోవడం వల్ల చాలామంది అర్ధాంతరంగా తనువు చాలిస్తుంటారు. సో ఇలాంటి స్థితిలో ఉన్న పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధి లాగా పాత్రికేయులు ఉంటారు కాబట్టి. కొంతమంది పాత్రికేయుల రాజకీయ అవసరాలు పక్కన పెడితే.. ఇప్పటికీ పాత్రికేయానికి కొద్దో గొప్పో గౌరవం ఉందంటే దానికి కారణం ఒకప్పటి విలువలే.. పాత్రికేయ వృత్తి గొప్పది కాబట్టి గతంలో నుంచి ప్రభుత్వాలు పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాయి.. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది.. తర్వాత మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో చాలామంది పాత్రికేయులు కొత్తగా వృత్తిలోకి రావడంతో వారు కూడా ఇళ్ల స్థలాలకి దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ప్రభుత్వాలు అంతగా ఆసక్తి చూపలేదు. పైగా కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇళ్ల స్థలాల సమస్య జటిలంగా మారింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య సుప్రీంకోర్టులో సానుకూలంగా పరిష్కారం అయ్యేందుకు కేసిఆర్ ఇచ్చిన అఫిడవిట్లే ఆధారం. అనుకున్నట్టే సుప్రీంకోర్టు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తీర్పు కూడా వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన వెంటనే మంత్రి కేటీఆర్ జస్టిస్ రమణ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు తమ ఇచ్చిన హామీ అమలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ట్వీట్ కూడా చేశారు. ఇక్కడ వరకూ కెసిఆర్ ధోరణి, కేటీఆర్ స్వాగతించిన తీరు బాగున్నాయి. ఇప్పుడు తామే సమస్యలు మరింత జటిలం చేసి, చిక్కు ముళ్ళు వేస్తున్నారు. ఇంతకుముందు కేసులు గెలిచిన పాత్రికేయులకు, ఇతర పాత్రికేయులకు లంకె పెట్టి, ఇప్పట్లో ఇది పరిష్కారం కాకుండా చిక్కు ముడులను మరింత బిగిస్తున్నారు. అదేమంటే, సొసైటీలో ఆంధ్రా జర్నలిస్టులు ఎక్కువగా ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు అనే విచిత్రమైన వాదన ముందుకు తీసుకొస్తున్నారు. సర్కార్ అనుకూల జర్నలిస్టులు…అవును, ఇంకా ఇళ్ల స్థలాలు కావలసిన జర్నలిస్టులు ఉన్నారు, వారికీ ఈ ప్రభుత్వం భూములు కేటాయించవచ్చు కదా? ఈ సొసైటీ స్థలాలతో లంకె దేనికి?

ఈ జర్నలిస్టులు డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమికోసం ఏళ్లుగా సుప్రీం దాక పోరాడిన సంగతి కేసీఆర్ కు తెలుసు. కేటీఆర్ కూ తెలుసు.. మరి 2007 తర్వాత లబ్ధిదారులు కావలసిన జర్నలిస్టులకు న్యాయం చేయాల్సింది ప్రభుత్వమే. అంతే తప్ప జవహర్ సొసైటీ సభ్యులు కాదు కదా! మరి వాళ్లనూ వీళ్లనూ కలపడం దేనికి? సమిష్టి నిర్ణయం ప్రస్తావన దేనికోసం తీసుకొచ్చారు? ఎవరి ప్రయోజనాల కోసం మిగతా వారిని బలి పెడుతున్నారు? పదిమందిలో పడేస్తే చాలు, ఇక కథ కదలదు, తెగదు అనే ధోరణేనా ప్రభుత్వానిది… అందుకే ఇప్పుడు అల్లం నారాయణ నేతృత్వంలో బ్యూరో చీఫ్ లు, ఎడిటర్లతో సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ ప్రారంభించింది.. సమస్య జవహర్ సొసైటీది.. ఇప్పుడు మళ్లీ యూనియన్లు, బ్యూరో చీఫ్ లు, ఎడిటర్ల అభిప్రాయాలు దేనికి?! పోనీ కొత్త జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తానంటే ఈ సొసైటీ సభ్యులు ఏమైనా అభ్యంతరం చెప్తున్నారా? ఆనందిస్తారు గానీ.. కొత్త సొసైటీ ఏర్పాటు చేసి, కెసిఆర్ పేరు పెట్టి, అందరికీ కొత్త ఇళ్ల స్థలాలు ఇవ్వండి. అది మరీ సంతోషం.

సుప్రీంకోర్టు తీర్పువచ్చి ఆరు నెలలు పూర్తయింది.. ఈ సమస్య సానుకూల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగు కూడా వేయలేదు సరి కదా ఈ కొత్త బాగోతాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. కెసిఆర్ అసలు ఈ సొసైటీ కి టైం ఇవ్వడం లేదంటేనే తన ఉద్దేశం ఏమిటో అర్థమవుతున్నది.. ఆంధ్రా వాళ్ళు అనే ప్రస్తావనకు వస్తే వాళ్లు పని చేసింది హైదరాబాదులోనే కదా.. ప్రభుత్వం ఇచ్చిందే హైదరాబాద్ జర్నలిస్టుల పేరు మీద.. తెలంగాణ ఉద్యమానికీ, దీనికీ లంకె పెడుతున్నారు, అది పూర్తిగా అబ్సర్డ్. కెసిఆర్ ప్రస్తుత కేబినెట్ లోనే తెలంగాణ ఉద్యమం మీద దాడికి పాల్పడిన వాళ్ళు ఉన్నారు. నానా తిట్లు తిట్టిన వాళ్ళు ఉన్నారు.. వాళ్లేమో తెలంగాణ మీద పెత్తనాలు చేయవచ్చు గానీ ఓ కొంప సమకూర్చుకుందామనుకునే జర్నలిస్టులకు మాత్రం ఇన్ని అవస్థలా? ఐనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటేనే ఇళ్ల స్థలాలకు అర్హులా? ఇదెక్కడి ప్రాతిపదిక?

ఒకవేళ సొసైటీ సభ్యులు కాని జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే సంకల్పం ఉంటే, సుప్రీం తీర్పు వచ్చిన వెంటనే ఆ కసరత్తు స్టార్ట్ చేసి ఉంటే, ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చి ఉండేది. అంటే కొత్త, పాత జర్నలిస్టులందరికీ ఆశా భంగమే ఎదురవుతోంది. సొసైటీలో సభ్యులు కాని జర్నలిస్టులు కూడా తమ ఇళ్ల స్థలాల మాటేమిటి అని అడగాల్సింది ప్రభుత్వాన్ని కదా! అంతే తప్ప ఇన్నాళ్లుగా పోరాడి సాధించుకున్న సొసైటీని ప్రశ్నిస్తే ఎలా? మాకు ఇవ్వకుండా మీకు ఎలా ఇస్తారో చూస్తామనే మాటలు జర్నలిస్టు మిత్రులు నుంచే ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టింది కేసీఆర్! అన్నట్టు బ్యూరో చీఫ్ లు, ఎడిటర్ల మాటలకేనా విలువ? బాల అభిప్రాయాలే ప్రామాణికమనే కొత్త ప్రాతిపదిక దేనికి? అసలు సొసైటీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారు? నాడు అఫిడవిట్లు సమర్పించిన కేసీఆర్ ఏ బ్యూరో చీఫ్ లను, ఏ ఎడిటర్లను అడిగి ఆ నిర్ణయం తీసుకున్నారు? నాడు అక్కరకు రానివారు నేడు ఎలా పరిగణలోకి వస్తున్నారు? స్థూలంగా చెప్పాలంటే ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వమే ప్రధాన విలన్..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version