KCR National Politics: అది 2001.. హైదరాబాద్ లోని జలదృశ్యం.. నాటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కని కేసీఆర్ బయటకొచ్చి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అని పార్టీని ప్రకటించాడు. బక్కపలుచని కేసీఆర్ చుట్టూ నాడు పది మంది పెద్ద నేతలు కూడా లేరు. ఈయనేం తెలంగాణ సాధిస్తాడని అందరూ హేళన చేశారు.కానీ కట్ చేస్తే.. నవ్విన నాపచేనే పండింది.. తెలంగాణ వచ్చేసింది.. ఏకంగా తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యారు.

తెలంగాణ సీఎంగా కేసీఆర్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ప్రాజెక్టులు కట్టి విద్యుత్ సమస్య తీర్చి.. రైతులకు పథకాలతో ‘పంట పండించాడు’. మునుపటి ఆంధ్రా పాలనతో పోలిస్తే అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్లిందన్నది వాస్తవం. కొన్ని రంగాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంచేశాడు కేసీఆర్. ముఖ్యంగా విద్య, వైద్యంలో తెలంగాణ ఇప్పటికీ వెనుకబడి ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లేక వారంతా గుర్రుగా ఉన్నారు. అయితే మెజార్టీ ప్రజలను సంతృప్తి పరచడంలో కేసీఆర్ ముందున్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ మోడల్ ను చూపించి ఢిల్లీని ఏలాలని బయలు దేరుతున్నాడు.
తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ అడుగులు ఇప్పుడు జాతీయ స్థాయికి పడుతున్నాయి. ఈ దసరా నుంచి ఢిల్లీలో ధూం ధాం నిర్వహించడానికి కేసీఆర్ రెడీ అయ్యారు. అక్టోబర్ 5 దసరా సందర్భంగా కేసీఆర్ జాతీయ స్థాయి పార్టీ ప్రకటిస్తారని సమాచారం.. దీనికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. మూడో కూటమి ప్రయత్నాలు వేగవంతం చేసి రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు పెట్టాలని చూస్తున్నారు.
2014లో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు నాటి గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ప్రతీ రాష్ట్రంలోనూ పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుజరాతీ వ్యాపారవేత్త గౌతం అదానీ స్వయంగా మోడీ ఎన్నికల ప్రచారం కోసం తన ప్రైవేట్ జెట్ విమానాన్ని సమకూర్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా దేశవ్యాప్త పర్యటన కోసం ఒక ప్రైవేట్ విమానం కొనేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
జాతీయ పార్టీ పెట్టి రాష్ట్రాల్లో ప్రచారం కోసం కొత్త విమానం కొనుగోలు చేయడానికి కేసీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 12 సీట్లున్న విమానానికి రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం విరాళాలు ఇచ్చేందుకు గులాబీ నేతలు పోటీపడుతున్నారు. ఇక సీఎం కేసీఆర్ తలుచుకుంటే ఈ నిధులు పెద్ద లెక్క కాదు.. కేసీఆర్ సర్కార్ తో లబ్ధి పొందిన వారందరూ ఈ బుల్లివిమానానికి అయ్యే ఖర్చును భరించడం ఖాయం. సో కేసీఆర్ కొత్త విమానం రెడీ అయిపోయినట్టే.
ఇక ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వద్ద రూ.865 కోట్ల నిధులున్నాయి. వీటిని జాతీయ స్థాయిలో సభలు, సమావేశాలకు పార్టీ సంబంధిత ఖర్చులకు కేసీఆర్ వినియోగించుకుంటారు.
ఎవరి లక్ ఎలా ఉంటుందని చెప్పలేం. గుజరాత్ సీఎం.. పీఎం అయినట్టు.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాలం కలిసివస్తే.. ఒకవేళ మోడీ ఓడిపోయినా.. హంగ్ వచ్చినా ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంటుంది. గుర్రం ఎగురావచ్చు అన్నట్టు.. కేసీఆర్ ప్రధాని అవ్వనూ వచ్చు.. చూడాలి ఏం జరుగుతుందో.. ?