Telangana Debts : బంగారు తెలంగాణ అప్పుల తెలంగాణ అయ్యిందని కొందరు.. కేసీఆర్ ఏకంగా రెండున్నర లక్షల కోట్ల అప్పు చేశాడని ఇంకొందరు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సైతం ఇవ్వలేకపోతున్న కేసీఆర్ తీరు చూసి అందరూ ఒకటే ఆడిపోసుకుంటున్నారు. ఇంతకీ కేసీఆర్ చేసిన అప్పు ఎంత? అది ఎంత కుప్ప అయ్యిందన్న దానిపై ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా తెలంగాణ సర్కార్ కు ఉన్న అప్పు ఎంతో అణాపైసలతో సహా చెప్పుకొచ్చాడు.

ఇండిపెండెన్స్ డే నాడు కూడా కేసీఆర్ పాత పాటే పాడారు. 75ఏళ్ల స్వాతంత్య్రం అప్పులపై మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత ఫక్తు కేంద్రంపై నిప్పులు పోయడానికే వాడుకున్నారు.జాతీయ పతాకం ఆవిష్కరించాక స్వాతంత్య్రం సంబురాలు గురించి మాట్లాడుతుంటే.. కేంద్రం పైసలు ఇవ్వక తెలంగాణను ఆగమాగం చేస్తోందని.. అప్పు పుట్టనివ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నకేంద్రం తీరును కడిగేశారు.
స్వాతంత్య్ర ఉద్యమకారులను వదిలేసి ఢిల్లీ రైతుల ఉద్యమం గురించీ ప్రస్తావించారు. రైతుల ఉద్యమంతో కేంద్రం రైతు నల్ల చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. టాక్సుల పేరిట జనాన్ని దోచుకుంటోందని విమర్శించారు. చిన్న పిల్లలు తాగే పాలు, శ్మశాన వాటిక నిర్మాణాన్ని కూడా వదలకుండా కేంద్రం ఎడాపెడా పన్నులు వేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉచితాలపై కేంద్రం రాష్ట్రాలను అనుమానిస్తోందన్నారు. కేంద్రం తీరు వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవాన చేసిన వ్యాఖ్యలు ఎప్పుడూ మీడియాతో మాట్లాడినప్పుడు చేసేవే. ఓవైపు మోడీ సహా రాష్ట్రాల సీఎంలు స్వాతంత్ర్యం గురించి.. అభివృద్ధి గురించి గొప్పగా చెబుతుంటే మన సార్ మాత్రం తన బాధనంతా వెళ్లగక్కి ఏడిపిస్తున్న కేంద్రంపై ఒంటికాలిపై లేచారు.
ఇక అప్పులపాలైన తెలంగాణ అంటూ విమర్శిస్తున్న వారికి అప్పుల లెక్కలు విడమరిచి చెప్పారు. తమ ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తోందని.. కొంతమంది అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. 2019-20లో రాష్ట్ర అప్పుల మొత్తం రూ.2.25 లక్షల కోట్లుగా ఉందన్నారు.
2014 తెలంగాణ ఏర్పడే నాటికి అప్పు రూ.75వేల కోట్లుగా ఉంటే.. తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.49 లక్షల కోట్లు అని చెప్పారు. ఈ రుణం మొత్తాన్ని ప్రాజెక్టులు, మౌలిక వసతులకు ఖర్చు చేశానని.. పెట్టుబడి వ్యయం అంటూ అప్పులను కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు కేసీఆర్.
ఇలా స్వాతంత్య్ర వేడుకల్లో పాజిటివ్ స్పీచ్ లు ఉంటాయి. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ప్రస్తావించడం మానేస్తారు. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం అన్యాయాన్ని సైతం కాస్త గట్టిగానే వెల్లడించారు. ఇలాంటి టైంలో ఇలాంటి స్పీచ్ ఇచ్చిన కేసీఆర్ పై సహజంగానే సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.