
సాధారణంగా ఎవరైనా లాభం కోసం వ్యాపారం చేస్తారు. వీలైతే అమ్మేవాటిని ఎక్కువ ధరకు విక్రయించాలని భావిస్తారు. అయితే ఒక చికెన్ వ్యాపారి మాత్రం ఏకంగా చికెన్ పై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలోని మాలతి చికెన్ మార్ట్ & ఎగ్ సెంటర్ నిర్వాహకులు చికెన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించడం గమనార్హం. అయితే ఈ దుకాణం దగ్గర తక్కువ ధరకే చికెన్ ను అందరూ కొనుగోలు చేయలేరు.
ఆర్మీ సైనికులకు మాత్రమే వ్యాపారి 50 శాతం డిస్కౌంట్ కు చికెన్ విక్రయిస్తున్నాడు. ఇలా తక్కువ ధరకే చికెన్ ను విక్రయిస్తున్న వ్యాపారి పేరు రమేష్. కరీంనగర్ జిల్లాలోని జ్యోతినగర్ సూర్య మిత్ర రెసిడెన్సీకి ఎదురుగా ఉన్న మాలతి చికెన్ సెంటర్ నెల రోజుల క్రితం ప్రారంభమైంది. వినియోగదారులకు ఆకర్షించాలనే ఉద్దేశంతో రమేష్ కిలో చికెన్ కొనుగోలుపై రెండు గుడ్లు ఉచితంగా విక్రయిస్తున్నాడు.
ఫ్రీ హోమ్ డెలివరీతో పాటు ప్రతి ఆదివారం చికెన్ తో పాటు మటన్ ను కూడా విక్రయిస్తున్నాడు. రమేష్ ప్రకటించిన ఆఫర్లు అతనికి స్థానికంగా మంచి పేరు తీసుకురావడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఆర్మీ సైనికులకు ఇలా రమేష్ స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణమే ఉంది. దేశ సేవ చేయడానికి తాను ఆర్మీలోకి వెళ్లలేకపోయినా కనీసం ఈ విధంగా చేస్తే తనకు సంతోషం కలుగుతుందని రమేష్ తెలిపారు.
సైనికులు నిద్రలేని రాత్రులను గడపడం వల్లే మనం కంటినిండా నిద్రపోతున్నామని.. సైనికుల కుటుంబాలకు గౌరవంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రమేష్ ఆర్మీ సైనికులకు సగం ధరకే చికెన్ విక్రయించడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.