Karimnagar: నిండా 16 ఏళ్లు లేవు. 9వ తరగతి చదువుతున్నారు. లోకం పోకడ తెలియదు.. ఉడుకునెత్తురు వయసు.. చేతిలో 12 లక్షల కారు.. తండ్రి పెద్ద రియల్టర్.. ఇంకేముందు రయ్యిమంటూ దూసుకెళ్లాడు ఆ బాలుడు. వారించాల్సిన తల్లిదండ్రులు రోజూ కారు ఇచ్చి పంపారు. ఇప్పుడు వీరి పాపానికి పాపం నలుగురు అమాయకులు బలయ్యారు. ముక్కుపచ్చలారని బాలుడికి అంత పెద్ద కారు ఇచ్చి ఇంతటి ఘోరానికి కారణమయ్యారు. కరీంనగర్ లో ఈ తెల్లవారుజామున జరిగిన దారుణంలో రోడ్డుపక్కన పనిచేసుకునే నలుగురు అమాయకపు కూలీలు మరణించడం విషాదం నింపింది. ఈ ఘటనలో కారు నడిపింది ఓ రియల్ ఎస్టేట్ యజమాని కుమారుడు.. మైనర్ అయిన 9వ తరగతి చదివే బాలుడు కావడం సంచలనమైంది.

రోడ్డుపక్కన గుడెసెల్లో నివసించే వారిపైకి 16 ఏళ్ల బాలుడు కారుతో సహా 100 కి.మీల స్పీడుతో దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఇది కరీంనగరాన్ని షేక్ చేసింది. పలువురు పార్టీలు, బాధితులు కలిసి రోజంతా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అందరూ ఈ హత్యకు పాల్పడ్డ బాలురను అరెస్ట్ చేయాలని.. కేసు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఘటన జరిగిన ప్రాంతం అట్టుడకడం.. రాజకీయ పార్టీలు పోరాటం చేయడంతో ఈ కారు యజమాని అయిన రియల్టర్ రాజేంద్రప్రసాద్ తన 16 ఏళ్ల కొడుకును రక్షించేందుకు కారు నేనే నడిపానని పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే కారు నడిపింది..అతడి కుమారుడు.. 16 ఏళ్ల మైనర్ బాలుడు అని సీసీటీవీల్లో కనిపించింది. కారు యాక్సిడెంట్ అనంతరం ఆ బాలుడు పారిపోవడం పలువురు చూసి పోలీసులకు చెప్పారు.

ఈ క్రమంలోనే బాలుడి తండ్రి రాజేంద్రప్రసాద్ ను అరెస్ట్ చేసి ఈ మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలోనే మైనర్ బాలుడు ముగ్గూరు కొంతకాలంగా ప్రతి రోజు ఉదయం కారు నడుపుతున్నారని.. అంబేద్కర్ స్టేడియంలో వాకింగ్ కోసం కారులోనే వెళుతున్నట్లు గుర్తించామని.. పిల్లలు నడిపిన ఆ కారుపై ఓవర్ స్పీడు చలాన్లు ఇప్పటికే చాలా ఉన్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ క్రమంలోనే యాక్సిడెంట్ చేసిన ముగ్గురు పిల్లలతోపాటు మైనర్లకు కారు అందుబాటులో ఉంచినందున రాజేంద్రప్రసాద్ పైనా కేసు నమోదు చేశామన్నారు. తండ్రి మైనర్లు కలిసి నలుగురు అమాయకుల ప్రాణాలు తీశారని.. ఘటనపై యాక్సిడెంట్ కేసుతోపాటు హత్య కేసు కూడా నమోదు చేశామని సీపీ వివరించారు. ఈ ఘటనలో పూర్తిగా 9వ తరగతి బాలుడికి కారు ఇచ్చి షికారుకు పంపిన తల్లిదండ్రులదేనని తేల్చారు. పిల్లలకు అంత చిన్న వయసులో అంత పెద్ద ‘క్రెటా’ కారును ఇవ్వడమే ఈ ప్రమాదానికి కారణంగా తేల్చారు.
కాగా ఉదయం 6 గంటల సమయంలో పొగమంచు వల్ల రోడ్డు కనిపించలేదని.. బ్రేక్ వేయబోయి ఎక్సలేటర్ ను తొక్కడంతో కారు 100 కి.మీల వేగంతో దూసుకెళ్లి అదుపుతప్పి కూలీలపైకి ఎక్కి ఈ ప్రమాదానికి కారణమైందని విచారణలో 16ఏళ్ల బాలుడు తెలిపినట్లు సమాచారం.
-ప్రమాదం ఎలా జరిగిందంటే?
కరీంనగర్ కమాన్ ప్రాంతం సమీపంలో రోడ్డు పక్కన గుడారాలు ఏర్పాటు చేసుకుని నాలుగు కుటుంబాలు సీస కమ్మరి పని చేసుకుంటున్నాయి. పొద్దంతా పని చేసి అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నారు.ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఓ కారు మాత్రం వారిపై నుంచి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దం కావడంతో అందరు వచ్చారు. తొమ్మిది మంది పై నుంచి కారు దూసుకెళ్లగా నలుగురు చనిపోయారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు.
చనిపోయిన వారిలో సునీత(38), ఫరియాడ్ (37), లలిత (25), జ్యోతి (13)గా గుర్తించారు.రెక్కాడితే కానీ డొక్కాడని అభాగ్యుల జీవితం తెల్లారిపోయింది. తెల్లవారక ముందే వారి కళ్లు శాశ్వతంగా మూతపడ్దాయి. అత్యంత విదారకంగా వారి బతుకు నుజ్జునుజ్జయింది. అభం శుభం తెలియని వారికి ఎందుకీ శిక్ష. కారు డ్రైవింగ్ చేసే బాలుడి దురాగాతానికి అందరు బలైపోయారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ దుర్ఘటనపై అందరు శోకసంద్రంలో మునిగిపోయారు.