KA Paul – Raghavulu – Pawan : తమల్ని ఉన్నపలంగా వదిలేశాడన్న అక్కసో.. లేకుంటే కాషాయదళంలో చేరాడన్న బాధో తెలియదు కానీ కమ్యూనిస్టు పార్టీల నాయకులకు పవన్ టార్గెట్ అయ్యారు. జనసేనానిని లక్ష్యంగా చేసుకొని కమ్యూనిస్టు సీనియర్ నాయకులు రాఘవులు, నారాయణలు విమర్శలకు దిగుతున్నారు. చివరకు మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం పవన్ ను విడిచిపెట్టడం లేదు. ఎక్కడపడితే అక్కడ వారు పవన్ కోసం మాట్లాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధాన ప్రతిపక్షాన్ని విడిచిపెట్టి.. అయినదానికి.. కానిదానికి పవన్ ను ఆడిపోసుకుంటున్నారు. పవన్ పై ఉన్న తమ ప్రస్టేషన్ బయటపెడుతున్నారు. తాజాగా విశాఖ స్టీల్ నిరసనకారులకు సంఘీభావం తెలిపిన ఈ ముగ్గురు నేతలకు మళ్లీ పవనే టార్గెట్ అయ్యారు.
అదే పనిగా చురకలు..
కమ్యూనిస్టు సీనియర్ నాయకులు ముందుగా మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనంపై కూడా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెస్తూ.. ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. చెగువేర టీషర్టులు వేసుకోవడం కాదు..ఆయన స్పూర్తిని కూడా పొందాలని చురకలు అంటించారు. పవన్ పై రాజకీయ విమర్శలకు సైతం దిగారు. అక్కడే ఉన్న పాల్ సైతం నేను కూడా అన్నట్టు పవన్ పై విరుచుకుపడ్డారు. బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కాదు.. తన దగ్గర ఉందని.. తాను ఇస్తా రా తమ్ముడు అంటూ పవన్ కు పిలుపునిచ్చారు. పవన్ అభిమానులు తన ఫ్యాన్స్ గా మారిపోవాలని కూడా సలహా ఇచ్చారు. పవన్ ఎలాగూ గెలవడు కాబట్టి.. తన దగ్గరకు వస్తే గెలిపించుకుంటానని కూడా పాల్ చెప్పుకొచ్చారు.
జన సైనికుల ఆగ్రహం
ఇందులో పాల్ విషయాన్ని పక్కనపెడితే కమ్యూనిస్టు నాయకులు తరచూ పవన్ ను ఆడిపోసుకోవడాన్ని జన సైనికులు, పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పవన్ పోటీ చేశారు. ఎన్నికల అనంతరం బీజేపీకి మిత్రుడిగా మారారు. వైసీపీ దాష్టీకాలకు అడ్డుకట్ట వేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహంగా ఉంటే మేలని భావించి ఆ నిర్ణయానికి వచ్చారు. కానీ కమ్యూనిస్టులు మాత్రం పవన్ బద్ధ శత్రువుగా పరిగణిస్తున్నారు. అయితే గతంలో వామపక్షాలను వదిలి బీజేపీతో చెలిమి చేసిన చంద్రబాబును పల్లెత్తు మాట అనడం లేదు. కానీ పవన్ ను మాత్రం వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
పాల్ ను లైట్ తీసుకుంటున్న వైనం..
అయితే పవన్ ఎప్పుడూ వామపక్షాలను గౌరవభావంతోనే చూస్తున్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను బీజేపీతో స్నేహం చేసిన విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ వామపక్ష నాయకులు మాత్రం ఎప్పుడూ అదే పనిగా పవన్ పై విమర్శలకు దిగుతుండడం సహేతుకంగా లేదని జన సైనికులు భావిస్తున్నారు. సహనానికి ఒక హద్దు ఉంటుందని.. పరిమితికి మించి విమర్శలు చేస్తే మాత్రం బదులు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కమ్యూనిస్టు నాయకులు తగ్గకపోతే జన సైనికుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అయితే కేఏ పాల్ ను మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఆయన గతం ఘనమే అయినా.. ప్రస్తుతం ఆటలో అరటిపండు అన్న మాదిరిగా మిగిలిపోయారని.. ఆయన కామెంట్స్ పై స్పందించడం వేస్ట్ అని భావిస్తున్నారు.