CM Jagan : వారంతా చిన్న,సన్నకారు రైతులే. ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలకు వారి నుంచి బలవంతంగా భూమి సేకరించింది. పరిహారం ఇప్పిస్తామని నమ్మబలికింది. తీరా భూములిచ్చాక అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తోంది. అధికారులను అడుగుతుంటే చేతులెత్తేశారు. ప్రజాప్రతినిధులను అడిగితే పట్టించుకోవడం లేదు. దీంతో బాధిత రైతులకు కడుపు మండింది. రోడ్డుపైకి వచ్చి నేరుగా సీఎం జగన్ కే నిరసన సెగ చూపించారు అనంతపురం రైతులు. వసతి దీవెన కార్యక్రమాన్ని సీఎం జగన్ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నార్పలలో ప్రారంభించారు. రోడ్డు మార్గం గుండా వెళుతున్నసీఎం జగన్ కు ధర్మవరం మండలం పోతులనాగేలపల్లి వద్ద రైతులు వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించారు. తమ బాధను చెప్పుకోవాలని భావించారు. కానీ పోలీసులు పక్కకుపడేశారు. నడిరోడ్డుపై ఈడ్చేశారు. దీంతో రైతులు శాపనార్థాలు పెడుతూ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పరిహారం కోసం….
పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసమంటూ తుంపర్తి, మోటుమర్రు ప్రాంతంలో ప్రభుత్వం 201 ఎకరాల భూమిని సేకరించింది. వాటన్నింటనీ చదును చేసి పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన ప్రభుత్వం రైతులకు మాత్రం నష్టపరిహారం అందించలేదు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి న్యాయం చేస్తారనుకున్నాయ ఆయన పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇప్పించడంలో విఫలమయ్యారనితీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఎం జగన్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు తోసేశారని రైతులు కన్నీరుమున్నీరయ్యారు. కొందరు మహిళలు శాపనార్థాలు పెట్టారు.
సెడన్ గా మారిన షెడ్యూల్..
వాస్తవానికి సీఎం జగన్ షెడ్యూల్ లో రోడ్డు మార్గం లేదు. నార్పలలో వసతి దీవెన ప్రారంభం అనంతరం షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ పుట్టపర్తికి వెళ్లాల్సి ఉంది, అయితే హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సీఎం జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తికి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ధర్మవరం మండలం పోతునాగేపల్లి వద్ద రైతులు వినతిపత్రం అందించేందుకు సిద్ధమయ్యారు. కానీ పోలీసులు దురుసుగా వ్యవహరించారు. అటు భద్రత సిబ్బంది సైతం రోడ్డు పక్కకు నెట్టేశారు. కనీసం రైతుల మొర ఆలకించకుండా కర్కశంగా వ్యవహరించారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.