Pawan Kalyan: తనను టచ్ చేస్తే రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని పవన్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మధ్యాహ్నానికే ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. కాదు..కాదు రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. అటు అన్ని రాజకీయ పార్టీలు పవన్ వద్దకు క్యూ కట్టాయి. పవన్ తో అంటీ ముట్టనట్టుగా ఉన్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చి కలిశారు. అటు తరువాత 40 ఈయర్స్ చంద్రబాబు వెతుక్కుంటూ మరీ వచ్చారు. ఏకంగా నోవాటెల్ హోటల్ కు వచ్చి పరామర్శించారు. పవన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుదీర్ఘంగా వారి మధ్య చర్చలు సాగాయి. ప్రధానంగా రాజకీయ చర్చలే జరిగినట్టు తెలుస్తోంది. నాగబాబు, నాదేండ్ల మనోహర్ సైతం చర్చల్లో పాల్గొన్నారు. అయితే పవన్ ఉదయం కీలక ప్రకటన చేయగా.. మధ్యాహ్నానికే పెను మార్పులు చోటుచేసుకున్నాయి. సాయంత్రానికి ప్రకంపనలు సృష్టించాయి.

ఏపీలో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. వైసీపీ విముక్త ఏపీకి కూడా పిలుపునిచ్చారు.వైసీపీ లాభపడకుండా.. ఓట్లు చీలకుండా చూస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఓ సందర్భంలో వైసీపీని ఓడించేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వానికి రూట్ మ్యాప్ అడిగినట్టు కూడా చెప్పుకొచ్చారు. అటు తరువాత పరిణామాలతో బీజేపీ కాస్తా సైలెంట్ అయ్యింది. దీనిపై నిన్న ఉదయం మాట్లాడిన పవన్ బీజేపీ తీరుపై ఓకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతవరకూ రూట్ మ్యాప్ ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రధాని మోదీ అంటే అభిమానం ఉందంటూనే.. కానీ బానిసత్వం లేదన్నారు. ప్రస్తుతానికైతే బీజేపీతో పొత్తులో ఉన్నాం.. కానీ మా మధ్య ఏమంత బంధం స్ట్రాంగ్ గా లేదన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయలేకపోతున్నామన్న అసంతృప్తి పవన్ మాటల్లో ధ్వనించింది. అయితే అక్కడకు కొద్దిసేపటికే చంద్రబాబు పవన్ వద్ద ప్రత్యక్షం కావడం, భేటీ కావడం చకచకా జరిగిపోయాయి.
అయితే పవన్ తో చంద్రబాబు భేటీ రాజకీయ కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపింది. ఇరువురు భేటీ పొత్తుల గురించి కాదని అటు జనసేన, ఇటు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, అటు తరువాత టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అల్లరిమూకల దాడులు, అటు టీడీపీ నాయకులపై దాడి, అక్రమ కేసులు నమోదైనప్పుడు పవన్ ఖండిస్తూ వస్తున్నారు. విశాఖలో పవన్ కు అధికార పార్టీ నుంచి ఎదురైన ప్రతిఘటనల నేపథ్యంలో చంద్రబాబు సంఘీభావం తెలిపారే తప్ప ఎటువంటి రాజకీయాలు లేవని ఇరు పార్టీల నేతలు చెప్పుకొస్తున్నాయి. అయితే రెండు పార్టీలు కలిసి నడిచేందుకు ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందని మాత్రం నమ్ముతున్నారు.

అయితే ఇన్నాళ్లూ పవన్ పట్ట చులకన భావంతో మాట్లాడిన వైసీపీ నాయకులకు ఇప్పుడు జరుగుతున్నపరిణామాలతో మైండ్ బ్లాక్ అయ్యింది. గోటితో పోయిన దానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నామని అధికార పార్టీ వారు తెగ బాధపడుతున్నారు. ఇన్నాళ్లూ తాము చంద్రబాబు, పవన్ లు కలవకూడదని భావించామని.. ఇప్పుడు ఆ అవకాశాన్ని తామే కల్పించామని వారు తెగ బాధపడుతున్నారుట. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేల వ్యధ అంతా ఇంతాకాదు. ఇన్నాళ్లు అధిష్టాన ఆదేశాల మేరకు పవన్ పై వ్యక్తిగత కామెంట్లు చేశామని.. ఇక నుంచి అటువంటి వాటికి దూరంగా జరగకపోతే రాజకీయంగా తెరమరుగు అవుతామన్న భయం వారిని వెంటాడుతోంది. మొత్తానికైతే పవన్ స్టేట్ మెంట్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఏపీ పాలిటిక్స్ శరవేగంగా మారిపోయాయి.