Jamnagar : జామ్ నగర్.. జామ్ నగర్.. మీడియా నుంచి సోషల్ మీడియా దాకా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. దేశంలోనే కాదు ప్రపంచంలోని పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఈ నగరం గురించి ప్రముఖంగా కథనాలు ప్రచురిస్తున్నాయి, ప్రసారం చేస్తున్నాయి. ఆ స్థాయిలో ప్రసారం చేయాల్సిన గొప్పదనం ఈ నగరంలో ఏముంది? అంత గొప్పగా ప్రచురించాల్సిన ప్రత్యేకత ఈ నగరంలో ఏముంది? ఈ ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం ముఖేష్ అంబానీ కుటుంబం. ధీరుభాయ్ అంబానీ కి జామ్ నగర్ తో విడదీయరాని అనుబంధం ఉంది. దాన్ని ముకేశ్ అంబానీ అలాగే కొనసాగించారు. అది తన పిల్లలకు కూడా అలవాటు చేశారు. అంతేకాదు రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ ఇక్కడే ఉంది. అందువల్లే తన కొడుకు ముందస్తు పెళ్లి వేడుకలను ఈ నగరంలోనే ముఖేష్ నిర్వహిస్తున్నారు. అందువల్లే మీడియా ఈ నగరం పై ఎక్కువ ఫోకస్ చేసింది. జామ్ నగర్ లో మార్చి 1 నుంచి 3 వరకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతాయి. ప్రస్తుతం జామ్ నగర్ కేంద్రంగా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. ఈ ప్రాంతంలో ప్రత్యేకతలు ఏంటనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలగడం సహజం. ఇంతకీ జామ్ నగర్ లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయంటే..
జామ్ నగర్ ఇప్పుడంటే ఒక నగరంగా మారిపోయింది. ఒకప్పుడు ఇది నవా నగర్ రాజ్యానికి రాజధాని. జామ్ రావల్ 1540 లో ఈ ప్రాంతాన్ని నిర్మించడం వల్ల దానికి అతని పేరు పెట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చేవరకు కూడా నవ నగర్ రాజ్యానికి జామ్ నగర్ రాజధానిగా కొనసాగింది.
జామ్ నగర్ ప్రాంతంలో రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన అతిపెద్ద చమురు శుద్ధి కర్మా గారాలున్నాయి. ఇక్కడ ఎస్ఆర్ ఆయిల్ అనే సంస్థకు కూడా అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉంది.
జామ్ నగర్ ఇప్పుడంటే చమురు శుద్ధి కర్మాగారాలకు ప్రధాన కేంద్రంగా ఉంది కానీ.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఇత్తడి వస్తువులు తయారు చేసేవారు. హస్త కళాకారులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేవారు.
భారత క్రికెట్ చరిత్రలో తొలి టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడు రంజిత్ సిన్హ్ జీ ప్రాంతానికి చెందిన వాడే. చిన్న వయసులో అతడు నవ నగర్ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఇంగ్లాండ్ లోని కేమ్ బ్రిడ్జి కేంద్ర విద్యాలయంలో 1896 లో తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతడు ఇండియన్ క్రికెట్ కు చేసిన సేవలకు గుర్తుగా అతడి పేరు మీద రంజీ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు.
జామ్ నగర్ కోటలకు ప్రసిద్ధి. ఇక్కడి లఖోటా కోట అత్యంత పురాతనమైనది. దీనిని 19వ శతాబ్దంలో నిర్మించారు.. ఆ తర్వాత దీన్ని మ్యూజియం గా మార్చారు. ఇందులో జామ్ నగర్ చరిత్ర, సంస్కృతికి చెందిన కళా ఖండాలను భద్రపరిచారు.
జామ్ నగర్ లో ఐఎన్ఎస్ వల్సూరా పేరుతో భారత నౌక దళం ఇక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ భారత నౌక దళానికి సంబంధించిన ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. వివిధ నౌకాదళ కార్యకలాపాలు కూడా ఇక్కడి నుంచే సాగుతాయి.
జామ్ నగర్ అనగానే చాలామంది కరువు ప్రాంతం అనుకుంటారు. కానీ ఈ ప్రాంతంలో విస్తారమైన సముద్రం ఉంది. ఇక్కడి ద్వారక, మియానీ బీచ్ లు చాలా ప్రాముఖ్యమైనవి. వేలాది మంది పర్యాటకులు వీటిని సందర్శించేందుకు ఉంటారు.
జామ్ నగర్ గల్ఫ్ ఆఫ్ కచ్ లో ఉంది. ఇక్కడ మెరైన్ నేషనల్ పార్క్ సమీపంలో జలాలు ఎన్నో అరుదైన జంతువులకు ఆవాసంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా డాల్ఫిన్లు, పలు రకాల సముద్ర జీవులు ఈ ప్రాంతంలో విస్తారంగా కనిపిస్తూ ఉంటాయి.
జామ్ నగర్ లో బందానీ అనే ఒక రకమైన చీరలు తయారవుతుంటాయి. ఇవి పూర్తిగా నేత కార్మికుల చేతుల్లో రూపుదిద్దుకుంటాయి. వీటిని కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ తయారైన చీరలు ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.
జామ్ నగర్ లో ప్రసిద్ధమైన స్వామినారాయణ్, బాల హనుమాన్, సూర్య, ఆది నాథ్ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ హిందువులు మాత్రమే కాదు జైన్ లు కూడా పూజలు నిర్వహిస్తుంటారు.