India Vs Australia 3rd T20: ఇషాన్‌ తప్పిదం.. ఆసీస్‌కు కలిసొచ్చింది.. మూడో టీ20లో టర్నింగ్‌ పాయింట్‌ ఇదే!

ఆసీస్‌ ఓ దశలో 9 బంతుల్లో 33 పరుగులు చేయాలి. ఆ ఓవర్‌ అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. 19.4వ బంతిని మాథ్యూ వేడ్‌.. క్రీజును వదిలి ముందుకు వచ్చి ఆడబోయాడు.

Written By: Raj Shekar, Updated On : November 29, 2023 12:29 pm

India Vs Australia 3rd T20

Follow us on

India Vs Australia 3rd T20: ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత విశ్వ విజేత ఆస్ట్రేలియాతో టీ20 పోరు మొదలైంది. అంతా కొత్త కుర్రాళ్లలతో బరిలో దిగిన టీమ్‌ఇండియా ఐదు టీ20 మ్యాచ్‌లలో రెండు టీ20ల్లో వరుస విజయాలు సాధించింది. కానీ, మూడో మ్యాచ్‌లో భారత జట్టు జోరుకు బ్రేక్‌ పడింది. మూడో టీ20లో భారత బౌలర్లు తేలిపోయారు. సిరీస్‌లో సజీవంగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కంగారూలు సత్తా చాటారు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చెలరేగిన వేళ ప్రత్యర్థి జట్టు.. సిరీస్‌లో తొలి విజయం నమోదు చేసింది. అయితే చివరి ఓవర్‌ దాకా టీమ్‌ఇండియా చేతుల్లో ఉన్న మ్యాచ్‌.. ఇషాన్‌ కిషన్‌ తప్పిదం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఇషాన్‌ ఏం చేశాడంటే..
ఆసీస్‌ ఓ దశలో 9 బంతుల్లో 33 పరుగులు చేయాలి. ఆ ఓవర్‌ అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. 19.4వ బంతిని మాథ్యూ వేడ్‌.. క్రీజును వదిలి ముందుకు వచ్చి ఆడబోయాడు. కానీ, బ్యాట్‌ను మిస్‌ అయిన బంతి.. ఇషాన్‌ చేతుల్లోకి వెళ్లింది. దీంతో స్టంపింగ్‌ చేసి అప్పీల్‌ చేశాడు. రిప్లేలో ఫలితం నాటౌట్‌గా తేలింది. అయితే బంతిని అందుకునే క్రమంలో ఇషాన్‌ గ్లోవ్స్‌ స్టంప్స్‌ కన్నా ముందుకు వచ్చాయి. దీంతో అంపైర్‌ ఈ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. వచ్చిన ఛాన్స్‌ను దొరకబుచ్చుకున్న వేడ్‌.. ఫ్రీహిట్‌ను సిక్స్‌గా మలిచాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్‌ వేసిన బంతిని, వికెట్‌ కీపర్‌ స్టంప్స్‌ వెనకాలే అందుకోవాలి. గ్లవ్స్‌ ఏ మాత్రం ముందుకు వచ్చినా.. దాన్ని అంపైర్‌ నోబాల్‌గా డిక్లేర్‌ చేయవచ్చు. అయితే ఇషాన్‌ ఈ స్టంపింగ్‌ అప్పీల్‌ చేయకపోతే.. ఆసీస్‌కు ఫ్రీ హిట్‌ వచ్చేది కాదు.

ప్రసిద్ధ్‌ చేతులెత్తేశాడు..
ఇక 18వ ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసిన ప్రసిద్ధ్‌ కృష్ణ.. భారత విజయంపై ఆశలు రేపాడు. దీంతో కెప్టెన్‌ సూర్యకుమార్‌.. ఆఖరి ఓవర్‌ కూడా ప్రసిద్ధ్‌కే ఇచ్చాడు. 20వ ఓవర్లో ఆసీస్‌ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. ఈ ఓవర్లో ప్రసిద్ధ్‌ వరుసగా 4,1,6,4,4,4 సమర్పించుకున్నాడు. దీంతో ఆసీస్‌ విజయం ఖరారైంది.

మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం..
ఈ మ్యాచ్‌ లో మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. ఓడిపోయే స్థితిలో ఉన్న ఆసీస్‌ను ఒంటి చేతితో గెలిపించినా తీరు టీమిండియా ఫ్యాన్స్‌ను షాక్‌ కు గురిచేసింది. భారీ స్కోరు చూసిన సగటు టీమిండియా అభిమాని ఈ మ్యాచ్‌ సులభంగా గెలుస్తుందిలే భావించాడు. కానీ, ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అద్భుతమైన తీరుతో తన టీమ్‌ కు విజయం అందించాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు సహాయంతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన మెరుపు సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించాడు.

రుతురాజ్‌ రికార్డు..
ఇక టీ20లో భారత్‌ తరఫున సెంచరీ చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా రుతురాజ్‌ నిలిచాడు. అతని కంటే ముందు రోహిత్‌ శర్మ, కేఎల్‌.రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్, శుభ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లీ, దీపక్‌ హుడా, సురేశ్‌ రైనా ఈ ఘనత సాధించారు. అదే సమయంలో ఆస్ట్రేలియాపై టీ20లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా రుతురాజ్‌ నిలిచాడు.