Employees: వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. తొలిసారి పాలన పగ్గాలు చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగులు అన్ని విషయాల్లో అండగా నిలుస్తూ వస్తున్నారు. పాలన, ప్రజా సంక్షేమం విషయంలో ఉద్యోగులు కీలకంగా వ్యహరిస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. జగన్ తీసుకునే ప్రతీ నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఉద్యోగులకు చివరికీ దక్కింది ఏంటీ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏరికోరి ప్రభుత్వాన్ని మార్చుకున్న ఉద్యోగులు సాధించింది మాత్రం శూన్యంగా కన్పిస్తోంది. తొలి నుంచి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అతిగా భజన చేయడమే వారి కొంప ముంచిందనే వాదనలు విన్పిస్తున్నాయి. కరోనా సమయంలో ఉద్యోగులు చాలా బాగా పని చేశారని సీఎం చెబితే వాళ్లంతా పులకరించిపోయారు. ఇదే సమయంలో కరోనా సాకుతో రెండు నెలలపాటు సగం జీతం ఇచ్చిన నోరు మెదపలేదు.
ఉద్యోగుల డీఏలను పెండింగులో పెట్టినా తమకు కూడా సామాజిక బాధ్యత ఉందని ప్రభుత్వంపై సానుభూతిని చూపారు. ఆ తర్వాత రకరకాల పేర్లతో తమ ప్రయోజనాలు కట్ చేసినా పెద్దగా పట్టించుకోలేదు. చివరికీ విశాఖకు రాజధానిగా మారుస్తామని చెప్పినా ఉద్యోగులు సమర్థించారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వానికి అండగా ఉన్నా తమకు జగన్ సర్కారు తమ భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టిందని ఉద్యోగులు వాపోతున్నారు.
కొత్త జీతాలతో ప్రభుత్వం తమపై 10వేల కోట్ల అదనపు భారం పడుతుందని వాదిస్తోంది. అయితే అవన్నీ కాకీలెక్కలని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఫిట్ మెంట్ తో తమకు జీతాలు పెరగకపోగా తగ్గాయని అంటున్నారు. దొంగ డీఏలతో ప్రభుత్వం లెక్కలు చూపిస్తుందని మండిపడుతున్నారు. కొత్త పీఆర్సీతో తాము నష్టపోతున్నామని కనీసం పాత జీతాలైనా ఇవ్వాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వం మాత్రం కొత్త జీతాలను అమలు చేసేందుకే మొగ్గుచూపింది. ఈ పీఆర్సీ అమలు వల్ల ప్రభుత్వానికి పెద్దఎత్తున మిగులు ఉండటంతోనే ప్రైవేట్ ఏజెన్సీలను పెట్టి మరీ ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు జమ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రజల్లో ఉద్యోగులు చులకనగా మారుతున్నారు. మరోవైపు సజ్జల లాంటి వాళ్లు ఉద్యోగులకు మరే ఆప్షన్ లేదని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంతో ఉద్యోగులు చర్చలు జరిపి సైలెంట్ గా ఉద్యోగులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం కండిషన్లకు ఉద్యోగులు ఒప్పుకుంటే మరో పదేళ్లపాటు వారికి జీతం పెరిగే అవకాశం ఉండదు. రూపాయి విలువ పెరుగుతూ పోతే వీరికి రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవు. దీంతో ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం చేతిలో ఉద్యోగులు మోసపోయారనే టాక్ ఏపీలో విన్పిస్తోంది. ఇప్పటికైనా ఉద్యోగులు ప్రతీసారి ప్రభుత్వాల ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు.