Pawankalyan – BJP : ఏపీలో ఇప్పుడు అందరి చూపు బీజేపీపైనే ఉంది. పొత్తులపై పవన్ స్పష్టత ఇవ్వడంతో బీజేపీ అడుగులు ఎటువైపా? అన్న చర్చ ప్రారంభమైంది. ఇప్పటివరకూ సన్నిహితంగా ఉంటున్న వైసీపీతోనా? లేకుంటే పూర్వమిత్రుడు చంద్రబాబును కలుపుకెళ్లాలా? అని మల్లగుల్లాలు పడుతోంది. అయితే తాను మాత్రం పొత్తులతోనే ముందుకెళతానిని పవన్ స్పష్టం చేశారు. మొన్నటికి మొన్న ఢిల్లీ టూర్ ముఖ్య ఉద్దేశ్యం అదేనని చెప్పుకొచ్చారు. బీజేపీ పెద్దలను కలిసి కూటమిలోకి ఆహ్వానించినట్టు తొలిసారిగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ లేకుండా.. కూటమి కట్టినా అది వైసీపీకి లాభిస్తుందే తప్ప.. ఒనగూరే ప్రయోజనం ఉండదని పవన్ బీజేపీకి తేల్చేశారు.
ప్రస్తుతానికి గుంభనమే..
అయితే ప్రస్తుతం బంతి బీజేపీ కోర్టులో ఉంది. నిర్ణయం తీసుకోవాల్సింది ఆ పార్టీనే. కానీ బీజేపీ నుంచి మాత్రం మిశ్రమ స్పందన లభిస్తోంది. పవన్ తాను బీజేపీని కోరినట్టు, కచ్చితంగా పొత్తులకు వెళుతున్నట్టు చెప్పిన దరిమిళా బీజేపీ నేతల వాయిస్ పెరిగే అవకాశముంది. ముఖ్యంగా మూడు పార్టీల మధ్య పొత్తు కోరుకునే నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించే అవకాశాలున్నాయి. పవన్ సైతం ప్రధాన ప్రతిపక్షం టీడీపీని విస్మరించి బీజేపీ, జనసేన కూటమి కట్టినా ప్రయోజనం ఉండదని కామెంట్ చేయడంతో పొత్తు ఇష్టంలేని కొంతమంది నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయపడినట్టయ్యింది. అటువంటి నాయకులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
ఇరువురి ప్రయత్నాలు ఒకటే..
బీజేపీని తమ కూటమిలోకి తెచ్చేందుకు ఇటు పవన్, అటు చంద్రబాబు ఏకకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి టీడీపీతో కలిసి పని చేయాలనే సంకేతాలు ఇవ్వడం.. మరో వైపు చంద్రబాబు కూడా రిపబ్లిక్ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ..మోదీకి పూర్తి మద్దతు ప్రకటించడంతో రెండు వైపులా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా క్లారిటీ వచ్చినట్లయింది. ఎన్డీఏలో చేరుతామా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. నిజానికి చంద్రబాబు ఎన్డీఏలో చేరుతారని గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. రెండు సార్లు ఢిల్లీలో చంద్రబాబు మోదీని కలిశారు. అమిత్ షాను నారా లోకేష్ ఓ సారి రహస్యంగా కలిశారన్న ప్రచారమూ జరిగింది. కానీ తరువాత ఈ అంశం మరుగునపడింది.
టీడీపీతో స్నేహం సాధ్యమేనా?
అయితే టీడీపీతో మరోసారి స్నేహానికి బీజేపీ సిద్ధపడుతుందా? అన్నది అందరికీ తొలిచే ప్రశ్న.ఏపీలో వైసీపీ నేతలు ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఢిల్లీలో ఎలాంటి మద్దతు కావాలన్నా ఇస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రం కోసం డిమాండ్ల పేరుతో వారిని ఇబ్బంది పెట్టడం లేదు. కొన్ని అప్పులు ఇస్తే చాలని సర్దుకుంటున్నారు. అందుకే కేంద్రం వైసీపీ విషయంలో సానుకూలంగా ఉందని చెబుతున్నారు. కానీ ఇప్పుడు పవన్ మాటలు చూస్తుంటే.. కేంద్ర పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చి ఉండాలి.. లేకుంటే మీరు కలిసిరాకుంటే.. టీడీపీతో తన మానాన తాను పొత్తు పెట్టుకుంటానని చెప్పయినా ఉండాలి. అందుకే ఏపీ బీజేపీ నేతలు ఈ విషయంలో గుంభనంగా ఉంటున్నారు. రేపు కర్నాటక ఫలితాల తరువాత ఏపీలో పొత్తుల అంశంపై బీజేపీ ఫోకస్ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.