Iravin Nizhal Review: బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మన జీవితంలో ఎంతో మంది వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు. కొందరితో మంచి జ్ఞాపకాలు ఉంటే.. ఇంకొందరితో చెడు అనుభవాలు ఉంటాయి.. అయితే ఈ మంచి చెడు మధ్య జరిగే సంఘర్షణ మనకు కొత్త కొత్త పాఠాలు నేర్పుతూ ఉంటుంది. దీనినే అనుభవ సారం అని కూడా అంటారు. ఇలాంటి కథ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇరవిన్ నిళల్. పార్తిబన్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

ఇదీ కథ
ముందుగానే చెప్పినట్టు మనిషి జీవిత సారానికి సంబంధించిన కథ ఇది. నందు ( పార్తీబన్) జీవితంలో చాలా కోల్పోయి ఉంటాడు. దుఃఖం, బాధ మధ్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. నందు వృత్తిరీత్యా ఫిల్మ్ ఫైనాన్షియర్. పోలీసులు అరెస్టు చేస్తారేమోనని భయంతో ఉంటాడు. అయితే అతడు నకిలీ దేవుడిగా చలామణి అవుతున్న పరమానంద ( రోబో శంకర్) ను కాల్చి చంపేయాలని అనుకుంటాడు. ఇందుకు తగ్గ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పటికే తన జీవితం ఇలా ఎందుకు అయింది, తనను ఈ దిశగా ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి, ఇలా కారణమైన వ్యక్తుల గురించి చెబుతూ ఉంటాడు.. ఈ క్రమంలో నందు జీవితంలో ఉన్న లక్ష్మి (స్నేహ కుమార్), చిలకమ్మ( బ్రిగిడా సాగా), పార్వతి ( సాయి ప్రియాంక రూత్), ప్రేమకుమారి (వర లక్ష్మీ శరత్ కుమార్) గురించి తెలుస్తుంది. నందు లైఫ్ లో ఉన్న విషాదాలు ఏమిటి? నందు పరమానంద ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు, అతని పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు, నందు జీవితంలో ఉన్న ఈ అమ్మాయిలు ఎవరు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
ఒక కథకుడిగా పార్తీబన్ మూవీ మేకింగ్ గురించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా తెలుసు. ఎందుకంటే తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త అనుభూతిని కలిగించాలని ఆలోచిస్తూ ఉంటాడు. దర్శకుడిగా అతడు తీసిన ఏ సినిమాలోనైనా కామన్ విషయం ఏమిటంటే స్క్రీన్ ప్లే, ట్విస్టులు. వీటి పరంగా సినిమా ఎక్కడా బోర్ కొట్టనివ్వడు. ఇక సినిమాలోనూ అదే మ్యాజిక్ క్రియేట్ చేశాడు.ఇరవిన్ నిళల్ అంటే తెలుగులో చీకటి నీడ.. అందుకు తగ్గట్టుగానే సినిమా కథను రాసుకున్నాడు.. సినిమా ప్రారంభం నుంచి చివరిదాకా అలా కూర్చోబెట్టాడు.
ఇదీ నేపథ్యం
నందు( పార్తీబన్) ఫిల్మ్ ఫైనాన్షియర్.. తనను పోలీసులు అరెస్టు చేస్తారని తెలిసి తుపాకితో పారారులో ఉంటాడు. నకిలీ దేవుడిగా చలామణి అవుతున్న పరమానంద ( రోబో శంకర్) ను చంపాలి అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నందు జీవితంలో ఇంతటి అంధకారం నింపిన వారిలో పరమానంద కూడా ఒకడు. ఇలా ఆసక్తికరమైన ప్రారంభ సన్నివేశంతో సినిమా మొదలవుతుంది.. ఎక్కడి నుంచి తన జీవితంలో జరిగిన విషాదాలు, విశేషాలను నందు ఎలా వివరించాడు? అతడి తదుపరి లక్ష్యం ఏమిటనేది మిగతా సినిమా చెబుతుంది.. అయితే ఇలాంటి మిస్టరీ కథల్లో స్క్రీన్ ప్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే కాకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో భాగంగా ఈ సినిమా కోసం సింగిల్ షాట్ విధానాన్ని ఎంచుకున్నారు. కొన్ని సినిమాల్లో వేగం ఉంటే బాగుంటుంది అనుకుంటాం.. కానీ ఈ సినిమాలో అందుకు భిన్నంగా ఉంటుంది… ఇక ఈ సినిమాలో భావోద్వేగాలకు చాలా స్కోప్ ఉంది. కానీ వాటిని ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. ఈ సినిమాలో నందు ప్రయాణమే కథా వస్తువు. ఈ టెక్నిక్ తో ఊహించని కథ, క్లైమాక్స్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో పార్తీ బన్ విజయవంతమయ్యాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీ ల్లో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే బాగా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్లస్ లు
కథ
పార్తీబన్ నటన
ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్
కథా గమనంలో వచ్చే ట్విస్టులు
మైనస్ లు
నందు పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం
భావోద్వేగాలను మధ్యలో కట్ చేయడం
కొన్ని లాజిక్ లేని సీన్లు
రేటింగ్: 2.5/5
చివరి మాట: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్.