Virat Kohli Vs Gautam Gambhir: క్రికెట్ లో హోరాహోరీ పోరు జరిగినప్పుడు.. ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు పేలడం సహజం. ఒకప్పుడు ఇదే మాటల తూటాలతో స్లెడ్జింగ్ కు పాల్పడేవారు. లీగ్ ల పుణ్యమా అని అటువంటి యుద్ధ వాతావరణం కొంత తగ్గింది. అయితే, తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 16వ ఎడిషన్ లో విరాట్ కోహ్లీ – గౌతమ్ గంభీర్ మధ్య సీరియల్ తరహాలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. కొద్ది రోజుల కిందట బెంగళూరు తో జరిగిన మ్యాచ్ విజయానంతరం గంభీర్ బెంగుళూరు అభిమానులను ఇబ్బందికి గురి చేసేలా సంజ్ఞ చేశాడు. దానికి ప్రతిగా అన్నట్టు సోమవారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో అత్యల్ప స్కోరు చేసినప్పటికీ బెంగుళూరు ఘన విజయం సాధించింది. నాటి గంభీర్ చేసిన సంజ్ఞకు ప్రతిగా కోహ్లి ఘాటుగానే సంజ్ఞతో రిప్లై ఇచ్చి లెక్కకు లెక్క సరి చేశాడు.
బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియంలో గత నెల పదో తేదీన ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టుపై లక్నో జట్టు గెలిచింది. ఈ మ్యాచ్ విజయానంతరం లక్నో జట్టు మెంటార్ గంభీర్ అతిగా స్పందించాడు. ఈ మ్యాచ్ కు భారీగా వచ్చిన బెంగళూరు అభిమానులు ఆ జట్టుకు ఉత్సాహాన్ని కలిగించేలా కేకలు, గంతులు వేస్తూ సందడి చేశారు. మ్యాచ్ అనంతరం బెంగుళూరు అభిమానులను సైలెంట్ గా ఉండాలంటూ గౌతమ్ గంభీర్ నోటిఫై వేలు వేసుకుని సంజ్ఞ చేసి చూపించాడు. దానికి అప్పుడు బెంగుళూరు అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా గట్టిగానే స్పందించారు.
కౌంటర్ గట్టిగానే ఇచ్చిన కోహ్లీ..
విరాట్ కోహ్లీని ఎవరైనా కవ్విస్తే అస్సలు తగ్గే రకం కాదు. తనకు కలిసి రానప్పుడు ఎవరైనా రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే.. తనదైన రోజున అంతకు రెండింతలు తిరిగి ఇచ్చేయడం అతనికి అలవాటు. గత నెల పదో తేదీన జరిగిన మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ చేసిన దానికి.. సోమవారం లక్నో జట్టుపై విజయానంతరం అంతకు రెండింతలు అన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. కృనాల్ పాండ్యా క్యాచ్ ను అందుకున్నప్పుడు గంభీర్ లా చేయకూడదని సూచిస్తూ.. ముద్దు పెడుతున్నట్లు సంజ్ఞ చేయడమే కాక.. వికెట్ పడిన ప్రతిసారి సంబరాలను పతాక స్థాయికి తీసుకెళ్లాడు. మ్యాచ్ ముగిశాక గంభీర్ – కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది వారిని విడదీశారు. కోహ్లీ – గంభీర్ ఒకరిపై ఒకరికి వెళ్లడంతో కొట్టుకుంటారేమోనన్న భయం అందరిలోనూ కనిపించింది. ఈ సందర్భంగా ఇరువురు కాస్త సీరియస్ గానే చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురిని విడదీశారు సహచరులు.
బౌలింగ్ కు పిచ్ అనుకులించడంతో..
లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం 43వ మ్యాచ్ జరిగింది. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది. విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేయగా, ఫాఫ్ డూప్లెసిస్ 40 బంతుల్లో 44 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ 11 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశారు. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో నామమాత్రపు స్కోరుకు మాత్రమే బెంగళూరు జట్టు పరిమితమైంది. 127 పరుగుల స్వల్ప లక్ష్య చేధనకు బరిలోకి దిగిన లక్నో జట్టు ఘోరంగా విఫలమైంది. కృష్ణప్ప గౌతమ్ 13 బంతుల్లో 23, అమిత్ మిశ్రా 30 బంతుల్లో 19, నవీనుల్ హక్ 13 బంతుల్లో 13 పరుగులు, స్టోయినిస్ 19 బంతుల్లో 13 పరుగులు, కృనాల్ పాండ్యా 11 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేయడంతో లక్నో జట్టు 108 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో బెంగళూరు జట్టు 18 పరుగులు తేడాతో విజయం సాధించింది.