Sunrisers Hyderabad Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంటోంది. ఒక్కో టీమ్ మూడు నుంచి నాలుగు మ్యాచ్ ల ఆట పూర్తి చేసుకుంటే ప్లే ఆఫ్ దశకు వెళతాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది అనేక జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఉత్కఠభరిత మ్యాచ్ లో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సిన నేపథ్యంలో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం.
ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తడబడుతూ ప్రయాణం సాగిస్తోంది. ఆదివారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసుకుంది హైదరాబాద్ జట్టు. నో బాల్ అందించిన విజయంతో హైదరాబాద్ జట్టు సంబరాలు చేసుకుంటోంది. ఈ విజయంతో రైజర్స్ జట్టుకు మంచి జోష్ వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ప్లే ఆప్స్ రేసులో ఇంకా తమకు అవకాశాలు ఉన్నాయని చాటి చెప్పింది. పాయింట్లు పట్టికలో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకున్న ఆ జట్టు ఎనిమిది పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలు కొంత మెరుగుపడినట్టు కనిపిస్తోంది.
పడుతూ.. లేస్తున్న హైదరాబాద్ జట్టు..
హైదరాబాద్ జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన మాత్రం రావడం లేదు. దీంతో జట్టు ఘోర పరాభవాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిలకడగా ఆడే ఆటగాళ్లు లేకపోవడంతో వరస మ్యాచ్ ల్లో ఓడిపోతూ చతికల పడింది హైదరాబాద్ జట్టు. ఈ క్రమంలోనే చేతి దాకా వచ్చిన అనేక మ్యాచులను కోల్పోయింది. కోల్కతాపై చివరి ఓవర్ లో విజయానికి 9 పరుగులు చేయాల్సిన స్థితిలోనూ చేతులెత్తేసింది. దీంతో తన ప్లే ఆప్స్ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది. అయితే రాజస్థాన్ పై లభించిన థ్రిల్లింగ్ విక్టరీతో ఆ జట్టు ప్లే ఆఫే రేసులో నిలిచినట్లు అయింది.
భారీ నెట్ రన్ రేట్ తో గెలవాల్సిన పరిస్థితి..
హైదరాబాద్ జట్టు ఇప్పటి ఓవరకు పది మ్యాచ్ లు ఆడి నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో ఉంది. ఇప్పటి వరకు పంజాబ్, కోల్కతా, ఢిల్లీ, రాజస్థాన్ లపై మాత్రమే గెలిచింది. ఇంకో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వాటన్నింటిలో గెలిస్తే 16 పాయింట్లుకు చేరుకుంటుంది హైదరాబాద్ జట్టు. అప్పుడు తొలి నాలుగు స్థానాల్లో నిలిచే అవకాశం ఉంటుంది. అయితే మిగిలిన మ్యాచ్ ల్లో భారీ రన్ రేట్ తో గెలవాల్సి ఉంటుంది. మరోవైపు అదే సమయంలో మిగిలిన జట్ల మ్యాచ్ ల ఫలితాలు కూడా హైదరాబాద్ కు అనుకూలంగా ఉండాలి. అప్పుడే ప్లే ఆఫ్స్ కు వేరే అవకాశం ఉంటుంది.
బలమైన జట్లను ఢీ కొట్టాలి..
హైదరాబాద్ మిగిలిన మ్యాచ్ లను బలమైన జట్లతో ఆడాల్సి ఉంటుంది. కాబట్టి విజయం అంత తేలికగా వచ్చే అవకాశం లేదు. జట్టు సమిష్టిగా ఆడితే విజయం సాధించే అవకాశాలుగా ఉన్నాయి. లక్నో, గుజరాత్, బెంగళూరు, ముంబై జట్లతో తదుపరి హైదరాబాద్ జట్టు ఆడాల్సి ఉంది. వీటిపై ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇక వరుస విజయాలతో దూసుకెళ్తూ పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్ ను ఢీకొట్టి హైదరాబాద్ ఏ మేరకు నిలుస్తుందో చూడాలి. అయితే ఈ నాలుగు మ్యాచ్ లో ఏ ఒక్క మ్యాచ్ లో ఓడిపోయిన హైదరాబాద్ ప్లే ఆప్స్ రేసులో కొనసాగడం కష్టమే. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ జట్టు మిగిలిన మ్యాచ్ ల్లో ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.