Silk Smitha: పుట్టెడు పేదరికం. స్కూల్ ఎలా ఉంటుందో తెలియదు. 14 ఏళ్లకే పెళ్లి. పసిప్రాయంలోనే భర్త, అత్తమామల వేధింపులు. అమ్మన్నానల దగ్గరకెళదామంటే అక్కున చేర్చుకోరేమో అనే అనే భయం. అత్తింట్లో పడుతున్న నరకం నుండి ఒక తెగింపు పుట్టింది. ఏం జరిగినా సిద్దమే అంటూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా మొండిగా చెన్నై రైలెక్కింది ఒంటరి ఒక ఆడపిల్ల. కట్ చేస్తే… సౌత్ ఇండియాను దశాబ్దాల పాటు ఏలిన శృంగార తారగా చరిత్ర లిఖించింది.

ఆమె ఎవరో కాదు విజయలక్ష్మి వడ్లపాటి అలియాస్ సిల్క్ స్మిత. 1960 డిసెంబర్ 2న జన్మించిన సిల్క్ స్మిత 62వ జయంతి నేడు. సినిమాకు మించిన నాటకీయత సిల్క్ స్మిత జీవితంలో ఉంది. ఆమె చిత్ర పరిశ్రమకు రావడం, పెద్ద స్టార్ కావడం ఒక కాల్పనిక గాథగా ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు ఆమెను ఇంటి నుండి పారిపోయేలా చేశాయి. చెన్నై వచ్చిన సిల్క్ స్మితకు ఎవరూ తెలియదు. ఏం చేయాలో కూడా తెలియదు?
అందరినీ ఆకర్షించినట్లే చిత్ర పరిశ్రమ ఆమెను తన వైపు లాగింది. టచ్ అప్ ఆర్టిస్ట్ గా ఆమె ప్రస్థానం మొదలైంది. ఆ సమయంలో తమిళ భాషపై పట్టు సాధించింది. చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసే అవకాశాలు వచ్చాయి. నటిగా మారాక సిల్క్ స్మిత డాన్స్ నేర్చుకున్నారు. సిల్క్ స్మిత సెక్సీ అప్పీల్ దర్శక నిర్మాతలను ఆకర్షించింది. శృంగార పాత్రలకు, స్పెషల్ సాంగ్స్ కి ఆమె చక్కగా సరిపోతారని భావించేవారు. ఆ కేటగిరీలో సిల్క్ స్మితకు పోటీ లేకుండా పోయింది. జ్యోతిలక్ష్మి, జయమాలినిలను సిల్క్ స్మిత మరిపించింది.

అటు సాంగ్స్, క్యారెక్టర్ రోల్స్, హీరోయిన్స్ ఇలా వందల సంఖ్యలో చిత్రాలు చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమల్లో ఏకఛత్రాధిపత్యం చేశారు. ఒకప్పుడు తినడానికి తిండి లేని విజయలక్ష్మి స్టార్ సిల్క్ స్మిత అయ్యారు. డబ్బు, హోదా, గౌరవం అన్ని వచ్చిపడ్డాయి. అయితే ఒంటరితనం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. నా అన్న వారు తోడు లేకుండా బ్రతికిన సిల్క్ స్మితకు పరిశ్రమే కుటుంబం. కొందరిని గుడ్డిగా నమ్మి, ప్రేమించి మోసపోయిన సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటికి ఆమె వయసు కేవలం 35 ఏళ్ళు మాత్రమే. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్ లో డర్టీ పిక్చర్ టైటిల్ తో మూవీ తెరకెక్కింది. విద్యాబాలన్ సిల్క్ స్మిత రోల్ చేయగా భారీ విజయం నమోదు చేసింది.