KCR Health : సీఎం కేసీఆర్‌ ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌.. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్‌

ఇప్పటికే ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడం వల్ల కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్‌ తెలిపారు.

Written By: NARESH, Updated On : October 7, 2023 10:11 pm

medium_2023-10-07-b272b001cc

Follow us on

KCR Health : సీఎం కేసీఆర్‌.. తెలంగాణ ప్రజలకు కనిపించక దాదాపు నెల రోజులు కావొస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. యాక్టివ్‌గా ఉండాల్సిన కేసీఆర్‌ సైలెంట్‌ కావడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల మోడీ వచ్చి.. ఎన్డీఏలో చేరతానని తన వద్దకు వచ్చాడని తీవ్ర ఆరోపణలు చేసినా.. కేసీఆర్‌ మౌనం వహిస్తున్నారు. దీంతో ప్రజల్లోనూ సీఎంకు ఏమైంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విపక్ష నేతలు కేసీఆర్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆయనకు కుటుంబ సభ్యులతోనే ముప్పు ఉందంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ తనయుడు, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ స్పందించారు. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కేసీఆర్‌కు ఛాతీలో సెకండరీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడం వల్ల కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్‌ తెలిపారు.

రహస్యంగా ఆరోగ్య సమాచారం..
పక్షం రోజుల క్రితం కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని కూడా కేటీఆర్‌ వెల్లడించారు. అప్పటి వరకు ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న విషయం ఎవరికీ తెలియదు. తాజాగా ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌ సోకిన విషయం కూడా జాతీయ మీడియాకు కేసీఆర్‌ చెప్పే వరకు ఎవరకీ సమాచారం ఇవ్వడం లేదు. కేసీఆర్‌ ఆరోగ్య సమాచారం విషయంలో పూర్తిగా సీక్రెట్‌ మెయింటేన్‌ చేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందో ఏరోజుకారోజు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు, కేసీఆర్‌ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

మూడు వారాలుగా విధులకే దూరం..
వైరల్‌ ఫీవర్‌ వల్ల సీఎం కేసీఆర్‌ గత 3 వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వైద్యులు ఆయనకు ప్రగతి భవన్‌లోనే చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కొన్ని రోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధ పడుతున్నారని, ప్రగతి భవన్‌లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సెప్టెంబర్‌ 26న కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వారం రోజులుగా జ్వరం, దగ్గు సమస్యలతో కేసీఆర్‌ బాధపడుతున్నారని తెలిపారు.

ఆందోళనలో బీఆర్‌ఎస్‌ నేతలు..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసి బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నేత త్వరగా కోలుకోవాలని, అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనున్న వేళ.. ఎప్పటిలాగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రార్థనలు చేస్తున్నారు. కేసీఆర్‌ త్వరలోనే కోలుకుంటారని డాక్టర్ల బృందం చెప్పినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.