IND vs SA Final Match: అంతగా స్టార్ క్రికెటర్లు లేకున్నా పట్టుదలతో కసిగా ఆడుతున్న సౌతాఫ్రికా జట్టు ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. సౌతాఫ్రికాను లైట్ తీసుకొని దిగ్గజాలకు విశ్రాంతినిచ్చి రిషబ్ పంత్ కెప్టెన్సీలో టీమిండియా టీ20 సిరీస్ ను మొదలుపెట్టింది. కానీ తొలి రెండు మ్యాచ్ ల్లో గట్టి షాక్ తగిలింది. సౌతాఫ్రికా భారత్ ను చిత్తు చేసింది. చిత్తుచిత్తుగా ఓడించింది. మూడో టీ20 గెలవకపోతే ఇక భారత్ సిరీస్ కోల్పోయే స్థితిలో పుంజుకుంది. బౌలర్లు చాహల్, హర్షల్ పటేల్ విజృంభణతో గెలిచేంది. 4వ టీ20లో కార్తీక్, హార్ధిక్ దంచికొట్టడంతో గెలిచేసింది.

సౌతాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఫైనల్ ఈరోజు జరుగనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో 2-2తో సమానంగా ఉండడంతో నేటి మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. వరుస మ్యాచ్ లలో గెలిచి జోష్ లో ఉన్న టీమిండియా సిరీస్ విన్నింగ్ మ్యాచ్ లతో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
-బలాబలాలు..
టీమిండియా కుర్ర జట్టులో ప్రస్తుతం హార్ధిక్, కార్తీక్ తప్ప మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించడం లేదు. తొలి మ్యాచ్ లో ఇషాన్ కిషన్, రుతురాజ్ లు ఆడినా తర్వాత మ్యాచ్ ల్లో రాణించలేదు. కెప్టెన్ పంత్ ఇప్పటివరకూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది లేదు. ఇక వన్ డౌన్ లో వచ్చే శ్రేయాస్ అయ్యర్ కూడా పెద్ద ఇన్నింగ్స్ లు ఆడింది లేదు. ఇక తొలి రెండు మ్యాచ్ లలో తేలిపోయిన భారత బౌలర్లు.. తర్వాత పుంజుకొని సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ను కట్టిపడేశారు. వాళ్లు రాణించడం బట్టే 3వ, 4వ మ్యాచ్ లు గెలిచేశాం. ఇప్పుడు ఫైనల్ ముందర అందరూ రాణించడం అత్యంత ముఖ్యం..
ఇక సౌతాఫ్రికా టీం కలిసికట్టుగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్ ల్లో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా కూడా దాన్ని కాచుకొని చేధించి సంచలనం సృష్టించింది. భారత బౌలింగ్ ను చీల్చి చెండాడింది. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో మాత్రం డికాక్, సహా కీలక ఆటగాళ్లు గాయంతో వైదొలగడంతో రాణించలేకపోయింది. 4వ టీ20కి అందరూ అందుబాటులోకి వచ్చేశారు. దీంతో ఇప్పుడు టీంబలంగా కనిపిస్తోంది.
దీంతో ఈ ఫైనల్ హోరాహోరీగా సాగడం ఖాయం. గెలిచిన జట్టు టీ20 కప్ ను సొంతం చేసుకుంటుంది. భారత్ సేమ్ టీంను కంటిన్యూ చేస్తుండగా.. సౌతాఫ్రికా మాత్రం కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. దీంతో ఈరోజు క్రికెట్ ప్రేమికులు అంతా టీవీలకు అతుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.