https://oktelugu.com/

India vs England : చింత చచ్చినా.. పులుపు చావలేదు

ఇంగ్లాండ్ కెప్టెన్ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు మాజీ క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే డీఆర్ఎస్ లో అంపైర్స్ కాల్స్ విషయం చాలాసార్లు వివాదాస్పదమైంది.

Written By: NARESH, Updated On : February 19, 2024 4:17 pm
Follow us on

India vs England : ఓటమి అనేది గెలుపుకు నాంది పలకాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేయాలి. గెలవాలి అనే కసిని పెంచాలి. కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు ఇవేవీ అలవడుతున్నట్టు కనిపించడం లేదు. రాజ్ కోట్ మైదానంలో భారత జట్టు నుంచి ఎదురైన భారీ పరాభవం నుంచి అతడు పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. సాధారణంగా ఎవరైనా మ్యాచ్ ఓడిపోతే.. ఆ జట్టుకు సంబంధించిన కెప్టెన్ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తాడు. ఆ తప్పులను పునరావృతం చేయబోమని అంటాడు. కానీ బెన్ స్టోక్స్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ.. జట్టు ఎందుకు ఓడిపోయిందో కారణాలు విశ్లేషించకుండా.. తలాతోకా వాదనలతో ఉన్న పరువు పోగొట్టుకుంటున్నాడు.

మూడో టెస్ట్ మ్యాచ్ ఒకరోజు ముందుగానే ముగియడం, 434 పరుగులతో ఇండియా గెలవడం.. వంటి పరిణామాల అనంతరం ఆదివారం సాయంత్రం ఇరుజట్ల కెప్టెన్లు విలేకరులతో మాట్లాడారు. ముందుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టెస్టుల్లో అతిపెద్ద విజయం భారత్ సాధించడానికి యువకులే కారణమని వ్యాఖ్యానించాడు. ఈ గెలుపులో తన పాత్రను తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. అని ఇంగ్లాండ్ కెప్టెన్ అంపైర్ కాల్ రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. జట్టు ఎందుకు పడిపోయిందో చెప్పకుండా డక్కెట్ సెంచరీ ఆకట్టుకుందని అతడిని ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు జాక్ క్రాలీ ఔట్ పై తనకు సందేహాలు ఉన్నాయని స్టోక్స్ అనవసరమైన వివాదాన్ని లేవనెత్తాడు. అతడి ఔట్ కు సంబంధించి మ్యాచ్ రిఫరీని స్టోక్స్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తో కలిశాడు. అయితే రిఫరీ ఏం చెప్పాడో తెలియదు కానీ.. ఇది టెస్ట్ సిరీస్ లో అనవసరమైన రాద్ధాంతాన్ని రాజేసింది. మరి ఈ సిరీస్ లో మిగతా రెండు టెస్టుల్లో ఈ విషయంపై ఎలాంటి రచ్చ జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

భారత జట్టు చేతిలో 434 పరుగుల భారీ ఓటమి నేపథ్యంలో ఇంగ్లాండ్ శిబిరంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో పాటు బజ్ బాల్ పై మరోసారి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లీష్ మీడియా కూడా బెన్ స్టోక్స్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తోంది. జట్టు ఆట తీరు మార్చుకోవాలంటూ హితవు పలుకుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ మాజీ క్రీడాకారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంగ్లాండ్ కెప్టెన్ అంపైరింగ్ పైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రిఫరీని కూడా కలిసి చాలాసేపు చర్చించాడు.. మ్యాచ్ తర్వాత డీఆర్ఎస్ లో అంపైర్ కాల్ పై అవుట్ ఇవ్వడంపై ప్రశ్నలు లేవనెత్తాడు. ముఖ్యంగా జాక్ క్రాలీ ఔట్ పట్ల పలు ప్రశ్నలు సంధించాడు.

వాస్తవానికి రివ్యూ తీసుకొని ఉండకుంటే క్రాలీ అవుట్ అయ్యేవాడు కాదు. అంపైర్ కాల్ కారణంగా క్రాలీ ఔట్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్, జట్టు కోచ్ తో మ్యాచ్ రిఫరీ ని కలిశాడు. ” మేం జాక్ క్రాలీ వికెట్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాం. ఎందుకంటే రిప్లై లో బంతి తప్పిపోయినట్టు అనిపించింది. అయినప్పటికీ అది అవుట్ అని నిర్ధారించారు. బాల్ స్టంప్ కు తగలకపోతే అంపైర్ కాల్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి” అని ఇంగ్లాండ్ కెప్టెన్ ప్రశ్నించాడు. అనంతరం అంపైర్ కాల్ రద్దు చేయాలని నేను నమ్ముతున్నాను అని పేర్కొన్నాడు. బంతి స్టంప్ కు తగిలితే అవుటయినట్టు.. తగలకపోతే అవుట్ కానట్టు అని ఇంగ్లాండ్ కెప్టెన్ ప్రకటించాడు. “ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడితే ఓటమి తర్వాత ఏదేదో వాగుతున్నాడని అంటారని” ఇంగ్లాండ్ కెప్టెన్ వివరించాడు. “1-2 తో మేము వెనుకబడిపోయినప్పటికీ..3_2 తేడాతో సిరీస్ గెలిచే అవకాశం ఉందని” ఇంగ్లాండ్ కెప్టెన్ పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు మాజీ క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే డీఆర్ఎస్ లో అంపైర్స్ కాల్స్ విషయం చాలాసార్లు వివాదాస్పదమైంది. చాలామంది ఆటగాళ్లు ఇప్పటికే దీనిపై అసహనం వ్యక్తం చేశారు. డీఆర్ఎస్ ఔట్, నాట్ అవుట్ రెండు మాత్రమే ఉండాలని.. అంపైర్ కాల్స్ వల్ల గందరగోళం ఉందని గతంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా, ఈ సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. ఇక నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23న రాంచీలో జరుగనుంది.