
కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల క్రితం బడ్జెట్ 2021లో ఎన్నో కీలక ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ 2021లోని ప్రతిపాదనల వల్ల ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఈ నిబంధనల గురించి అవగాహన ఏర్పరచుకుంటే ఆదాయపు పన్ను చెల్లింపుల సమయంలో ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి 75 సంవత్సరాల వయస్సు పై బడిన వారు ఐటీఆర్ రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి కొన్ని నియమనిబంధనలు ఉంటాయని తెలుస్తోంది. కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రిఫిల్డ్ ఐటీఆర్‌లను కూడా అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. లీవ్ ట్రావెల్ కన్సెషన్ వోచర్లకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ పై కేంద్రం పన్ను విధించబోమని ఇప్పటికే స్పష్టం చేసింది. ఒక సంవత్సరంలో పీఎఫ్ ఖాతాలో కంట్రిబ్యూట్ చేసే మొత్తం రెండున్నర లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే రూ.2.5 లక్షలు దాటిన మొత్తంపై వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం టీడీఎస్ నిబంధనలలో సైతం కీలక మార్పులను చేయడం గమనార్హం.
ఎవరైతే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయరో వారు రెట్టింపు టీడీఎస్ ని చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి టీడీఎస్ కు సంబంధించి ఈ నిబంధన అమలులోకి రానుంది. కొత్త రూల్స్ గురించి అవగాహన ఏర్పరచుకుంటే ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు.