Kotamreddy Srinivas Reddy- ABN RK: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.. ఎన్నికలకు ఏడాది ఉండగానే అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.. పలువురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ధిక్కారస్వరం వినిపిస్తున్నారు.. వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు.. ఆయన జగన్ ను ఉద్దేశించి నేరుగా విమర్శలు చేస్తున్నారు.. ఆయన కాకపోతే ఇంకొకరు సీఎం అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఆయన టిడిపిలోకి వెళ్తారని ప్రచారం కూడా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏబీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు.. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.. ఆ ప్రోమోలో రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడవకుండా శ్రీధర్ రెడ్డి సమాధానాలు చెప్పారు.

జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో అన్నీ తానై వ్యవహరించారు.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు మంత్రి పదవి లభిస్తుందని ఆశపడ్డారు.. కానీ నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి మంత్రి పదవులు ఎగరేసుకుపోయారు.. గౌతమ్ రెడ్డి కన్నుమూసిన తర్వాత, అనిల్ కుమార్ ను యాదవ్ పదవి నుంచి తప్పించిన తర్వాత తనను మంత్రిగా తీసుకుంటారని శ్రీధర్ రెడ్డి భావించారు.. అని ఆయన ఒకటి అనుకుంటే, జగన్ మరొకటి అనుకున్నారు.. తనకు అన్ని విషయాల్లో సహకరించినప్పటికీ శ్రీధర్ రెడ్డిని దూరం పెట్టడం మొదలుపెట్టారు..
ఆ మధ్య అమరావతి రైతులు రాజధాని కోసం ఆందోళనలు నిర్వహించారు. దీనికి కౌంటర్ గా అధికార పార్టీ నాయకులు మూడు రాజధానుల ఉద్యమం మొదలుపెట్టారు.. ఆ క్రమంలో అమరావతి రైతుల పాదయాత్ర నెల్లూరు చేరుకుంది.. ఆ రైతులకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు.. ఇది స్వతహాగానే జగన్మోహన్ రెడ్డికి రుచించలేదు.. ఇక అప్పటినుంచి ఆయనను దూరం పెట్టడం మొదలుపెట్టారు.. అధికార పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవలేదు. అయినప్పటికీ శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిసి వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు.

ఇక అమరావతి రైతుల పాదయాత్రకు ముందు జగన్మోహన్ రెడ్డి ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావును కలిశారు.. దీనిని మంచిపనిగా కోటంరెడ్డి అభివర్ణించారు.. సమయంలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను కూడా కలవాలని సూచించగా… దానికి జగన్ ఓకే అన్నారు.. రాధాకృష్ణ ఒప్పుకోకపోవడంతో ఆ భేటీ సాధ్యపడలేదు.. అమరావతి రైతులకు సంఘీభావం తర్వాత ఇక అధికార పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాలకు కూడా తనను పిలవకపోవడంతో శ్రీధర్ రెడ్డి లో అసహనం పెరిగిపోయింది.. పైగా నెల్లూరు జిల్లాకు చెందిన తోటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా నిరసనగలం వినిపించడంతో… శ్రీధర్ రెడ్డి కూడా అదే బాట అనుసరించారు.. అధికార పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.
శ్రీధర్ రెడ్డి ఫోన్ ను ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ వర్గాలు ట్యాంపరింగ్ చేస్తున్నాయి.. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారో అనుక్షణం వివరాలు సేకరిస్తున్నాయి.. కేవలం ఆయనే కాదు జగన్ కుడి, ఎడమ భుజాల ఫోన్లు కూడా ట్యాంపరింగ్ అవుతున్నాయి.. మొత్తానికి జగన్ ప్రభుత్వంలో ఎవరికి స్వేచ్ఛ లేదనేది శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైపోయింది.. ప్రోమో చివరిలో మీరు టిడిపిలో చేరుతున్నారట కదా! అని రాధాకృష్ణ అడిగితే… మాది కుప్పం.. చంద్రబాబు పార్టీలో చేరితే తప్పేంటి? అని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఏపీలో ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వని పక్షంలో తాను భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసేందుకు సిద్ధమే అని శ్రీధర్ రెడ్డి చెప్పడం కోస మెరుపు.