Homeజాతీయ వార్తలుTRS TO BRS Round Up : కలహాలే ఏడాది.. టీఆర్‌ఎస్‌కు కలిసిరాని 2022

TRS TO BRS Round Up : కలహాలే ఏడాది.. టీఆర్‌ఎస్‌కు కలిసిరాని 2022

TRS TO BRS Round Up : తెలంగాణ రాష్ట్రసమితి.. 22 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఈ ఏడాదితో ముగిసింది. ‘టీ’ పోయి ‘బీ’ వచ్చింది… కాదు కాదు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ ఒక్క విషయం తప్ప 2022లో బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌కు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. మరోవైపు పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఏమాత్రం తగ్గించుకోలేకపోయింది. ఇక 2021లో కేంద్రంతో మొదలైన కలహాలు ఈ ఏడాదంతా కొనసాగాయి. దీనికితోడు గవర్నర్‌ పదవిని కించపరిచే చర్యలకు దిగారు. చివరగా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తే చాలు అనుకుని బలం, బలగం మొత్తాన్ని మోహరించి గుడ్డిలో మెల్ల అన్నట్లుగా పది వేల మెజారిటీతో పార్టీని గెలిపించుకున్నాడు కేసీఆర్‌.

 

 

-గవర్నర్‌ అవమానంతో మొదలు..
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ 2021 వానాకాలం నుంచి కేంద్రంతో గొడవ షురూ చేసింది. దానికి కొనసాగింపుగా 2022 ప్రారంభంలోనే గవర్నర్‌ను అవమానించారు కేసీఆర్‌. జనవరి 26న గణతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరు కాకుండా.. దూరంగా ఉన్నారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్‌ హోంకూ వస్తున్నాని చెప్పి వెళ్లలేదు. తన మంత్రులను, చివరకు చీఫ్‌ సెక్రెటరీని కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇలా గవర్నర్‌ను అవమానించడం మొదలు పెట్టిన కేసీఆర్‌ దానిని ఏడాదంతా కొనసాగించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు హెలిక్యాప్టర్‌ అడిగితే ఇవ్వలేదు. అయినా రోడ్డు మార్గంలోవెళ్లిన గవర్నర్‌ తమిళిసైకి ప్రొటోకాల్‌ పాటించలేదు. ఇక బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌తో ప్రారంభించాల్సి ఉండగా తెలంగాణ చరిత్రలో గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ప్రారంభిచారు. తర్వాత కూడా మూడు సమావేశాలు అలాగే నిర్వహించారు. గవర్నర్‌ ఎక్కడకు వెళ్లినా ప్రొటోకాల్‌ పాటించకుండా ఆదేశించారు.

-కేసీఆర్‌లో పెరిగిన అసహనం..
కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా కొట్లాడుతున్నట్లు ప్రకటించిన కేసీఆర్‌లో ఈ ఏడాది అసహనం బాగా పెరిగింది. ప్రధానిపై సైతం వ్యక్తిగత దూషణలు చేశారు. ఇక కేంద్ర మంత్రులను తూనలాడడం అలవాటుగా చేసుకున్నారు. బీజేపీ హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోకుండా చిల్లర రాజకీయాలు చేశారు. తన మంత్రులు, నేతలతోనూ వ్యక్తిగత దూషణలు చేసేలా ప్రోత్సహించారు. ప్రధాని పదవికి కూడా గౌరవం ఇవ్వలేనంతగా కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయింది. ఎప్పుడు ప్రెస్‌మీట్‌ పెట్టినా ప్రధాని, కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై వ్యక్తిగత ధూషణలు చేయడం అలవవాటు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలనూ ప్రోత్సహించారు.

-ముండ, రండ, తలకాయ ఆరువక్కలు చేస్తా.. ముడ్డిమీద తంతా..
ఇక కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో, బహిరంగ సభల్లో మాట్లాడే భాష పూర్తిగా అదుపు తప్పింది. ముండ, రండ, తలకాయ వక్కలు చేస్తా.. ముడ్డిమీద తంతా.. బొక్కలు ఇరగ్గొడతా లాంటి పదాలు తరచూ వాడారు. ఆయన తనయుడు, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ సైతం తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు.. అమెరికాలో చదువుకున్న వ్యక్తిగా ఇన్నాళ్లూ ఆయనను గౌరవించిన తెలంగాణ సమాజం అసహ్యించుకునేలా భాష, పదాలు వాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తమ నేతలను అనుసరించారు.

-మోదీకి ముఖం చాటేస్తూ..
ఇక కేసీఆర్‌ మోదీకి ముఖం చూపించుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ మూడుసార్లు తెలంగాణకు వచ్చారు. ఒక్కసారి కూడా కేసీఆర్‌ స్వాగతం పలుకలేదు. ఒకసారి జ్వరం, కోవిడ్‌ లక్షణాల పేరుతో తప్పించుకున్నారు. తర్వాత తాను వెళ్లను అన్నట్లు ప్రవర్తించారు. ఇక ఈ ఏడాది కేసీఆర్‌ పదులసార్లు ఢిల్లీ వెళ్లారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారి కూడా ప్రధాని మోదీని కలువలేదు. కేంద్ర మంత్రులను కూడా కలిసిన దాఖలాలు లేవు. ప్రాజెక్టులు, పెండింగ్‌ పనులపై లేఖ రాసింది కూడా లేదు.

-రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష అభ్యర్థులకు మద్దతు..
ఇక ఈ ఏడాది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. కేంద్రం గిరిజన మహిళ ద్రౌపదిముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపింది. ధన్కడ్‌ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసింది. టీఆర్‌ఎస్‌.. రెండు ఎన్నికల్లోనూ విపక్ష అభ్యర్థులకే మద్దతు ఇచ్చింది. గిరిజన మహిళ రాష్ట్రపతి బరిలో నిలవడంతో చాలా ప్రాంతీయ పార్టీలు ముర్ముకు మద్దతు ఇచ్చాయి. కేసీఆర్‌ మాత్రం ప్రధానిపై వ్యతిరేకతతో గిరిజన మహిళకు మద్దతు ఇవ్వలేదు. దీంతో తెలంగాణ గిరిజనుల్లో కేసీఆర్‌ తీరుపై వ్యతిరేత వ్యక్తమైంది. దీంతో దానిని పూడ్చుకునేందుకు రాష్ట్రంలో గిరిజన భవనాలు ప్రారంభించారు. రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచారు.

-ప్రత్యామ్నాయ వేదిక అంటూ దేశయాత్ర..
ఇక బీజేపీని కేంద్రంలో ఓడించడమే సంకల్పంగా పెట్టుకున్న కేసీఆర్‌ బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేని పార్టీలతో ప్రత్యామ్నాయ వేదిక కోసం బీజేపీ వ్యతిరేక నేతలను కలిశారు. ఇందుకోసం పశ్చిమబెంగాల్, బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, జార్ఖండ్‌ వెళ్లారు. బలవంతంగా ఆయా నేతలతో సమావేవమయయ్యారు. కానీ ఎవరూ ఆయనతో కలిసేందుకు ముందుకు రాలేదు.

-మునుగోడులో కష్టం మీద గట్టెక్కి..
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. దీంతో వచ్చిన ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చింది. 16 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, చివరకు కేసీఆర్‌ కూడా ఒక గ్రామాన్ని కేటాయించుకుని పనిచేశారు. కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. పథకాలు వర్తింపజేశారు. గొర్రెలకు బదులు నగదు ఇస్తామని ప్రకటించారు. ధనబలంతోపాటు పోలీసుల బలగాల సాయం తీసుకున్నారు. చివరకు ఎన్నికల అధికారులను ప్రభావితం చేశారు. చివరకు గట్టెక్కారు.

-ఎమ్మెల్యేకు ఎర అంటూ రచ్చ..
ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే మోయినాబాద్‌లోని పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో టీఆర్‌ఎస్‌కు చెందిన గువ్వల బాలరాజు, సుధీర్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, రేగ కాంతారావును నందకుమార్, సింహయాజీ, రామచంద్రభారతి కొనుగోలు చేయాలని చూశారని కేసీఆర్‌ హంగామా చేశారు. స్వామీజీలను రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సంచలనం రేపారు. తర్వాత నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని 20 రోజులు అందులోనే ఉంచుకున్నారు. ఈ కేసుపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌.సంతోష్‌ను ఇందులోకి లాగే ప్రయత్నం చేశారు. కానీ కోర్టుల్లో ఎదురు దెబ్బలతో కేసీఆర్‌ ప్రయత్నం బెడిసి కొట్టింది.

-రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు…
కేంద్రాన్ని కెలికి మరీ ముప్పు కొనితెచ్చుకున్నారు కేసీఆర్‌. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో కేంద్రాన్ని, బీజేపీని డ్యామేజ్‌ చేయాలని చూసిన కేసీఆర్‌పై కేంద్రం అంతే స్పీడ్‌తో రివర్స్‌ ఎటాక్‌ మొదలు పెట్టింది. మంత్రులు మల్లారెడ్డిపై ఐటీ దాడులు చేయించింది. గంగుల కమలాకర్‌పై ఈడీతో దాడి చేయించింది. అంతటితో ఆగకుండా ఢిల్లీ లిక్కర్‌ స్కాం దర్యాప్తు వేగవంతం చేసింది. కేసీఆర్‌ తనయ, ఎమ్మెల్సీ కవిత పాత్రపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ వేయించింది. నేడో రేపో కవిత అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు సిట్‌ దర్యాప్తులో చతికిల పడగా, కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రం దూకుడు కొనసాగిస్తున్నాయి. పైలట్‌ రోహిత్‌రెడ్డిని సైతం ఈడీ విచారణ చేస్తోంది. దీంతో కేసీఆర్‌ గుక్క తిప్పుకోలేని పరిస్థితి వచ్చింది.

-జాతీయ పార్టీగా టీఆర్‌ఎస్‌..
మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలిచినా కేసీఆర్‌కు సంతృప్తి ఇవ్వలేదు. ఇంత కష్టపడాల్సి వచ్చిందా అన్న బాధే ఆయనను వేధించింది. ఎన్నికల సమయంలో 20 రోజుల్లో నెరవేరుస్తామన్నహామీ మాత్రం నెరవేర్చలేదు. ఇక తెలంగాణలో తన పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందన్న విషయం మాత్రం కేసీఆర్‌కు అవగతమైంది. దీంతో కొత్త ఎత్తుగడ వేశారు. ఎప్పటి నుంచో జాతీయరాజకీయాలకు వెళ్తానని ప్రకటించిన కేసీఆర్‌ దసరా పండుగ రోజు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా చేశారు. ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్‌ 8న ఎన్నికల సంఘం ఆమోదం తెలుపుతూ లేఖ రాసింది. దీంతో డిసెంబర్‌ 9 టీఆర్‌ఎస్‌ను అధికారికంగా బీఆర్‌ఎస్‌గా మార్చారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేశారు. డిసెంబర్‌ 14న ఢిల్లీలో రాజశ్యామల యాగం చేసి పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించారు. కార్యక్రమానికి విపక్ష నేతలను ఆహ్వానించినా ఎవరూ రాలేదు. దీంతో ఆశించిన మద్దతు రాకపోవడంతో గులాబీ నేతల్లో టెన్షన్‌ నెలకొంది. తాజాగా డిసెంబర్‌ 22న తెలంగాణ అసెంబ్లీలోనూ టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్పించుకున్నారు. ఇందుకు ఎన్నికల సంఘం లేఖను జతపర్చారు.

మొత్తంగా 2022లో టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారడం, మునుగోడు ఉప ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో బయట పడడం మినహా మిగతా ఏడాదంతా కలహాలతోనే టీఆర్‌ఎస్‌ ప్రయాణం సాగింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular