Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పవన్ పొత్తు ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తామని స్పష్టం చేశారు. బిజెపి వస్తే కలుపుకొని వెళ్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు సడన్ గా యూ టర్న్ తీసుకున్నారు. జగన్ కు తెర వెనుక స్నేహ హస్తం అందిస్తున్నారని తెలిసి బిజెపి అగ్ర నేతలకు ఝలక్ ఇచ్చారు. ఎన్డీఏ నుంచి బయటకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తరువాత బిజెపి నేతలు స్పందించక పోవడాన్ని తప్పుపడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికలు జనసేనకు కీలకం. గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానాలు సాధించి శాసనసభలో అడుగు పెట్టాలన్నదే పవన్ లక్ష్యం. మరోవైపు వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వరని పవన్ చాలా సందర్భాల్లో తేల్చి చెప్పారు. వైసిపి విముక్త ఏపీయే తన లక్ష్యమని ప్రకటించారు. టిడిపి, బిజెపితో కలిసి కూటమి కట్టాలని భావించారు. కానీ అందుకు బిజెపి ముందుకు రావడం లేదు. దీనికి వైసిపి కారణమని పవన్ అనుమానిస్తూ వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి ఆయన పరామర్శించారు పవన్. జైలు బయటకు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. బిజెపి వస్తే కలుపుకెళ్తామని స్పష్టం చేశారు. అటు తరువాత జరిగిన వారాహి యాత్రలో జనసేన, టిడిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ప్రకటించారు. అప్పటివరకు ఎన్డీఏ అని చెబుతూ వస్తున్న పవన్.. కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని సంకేతాలు ఇవ్వడం విశేషం. బిజెపితో వెళితే ఓట్లు పెరుగుతాయి కానీ.. సీట్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించడం ద్వారా కాషాయ దళంలో టెన్షన్ పెట్టారు. అయితే బిజెపి అగ్ర నేతల నుంచి ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు.
తెలుగుదేశం నాయకత్వానికి అపార అనుభవం ఉందని.. దానికి జనసేన పోరాట పటిమ తోడైతే అద్భుత విజయం సాధించవచ్చని పవన్ అభిప్రాయపడుతున్నారు. నిన్నటి వరకు టిడిపి, జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉంటాయని చెప్పుకొచ్చారు. కానీ ఈరోజు మాత్రం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే దీని వెనక రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే అన్నింటికీ మించి జగన్కు తెరవెనుక నుంచి సాయం చేస్తున్నారన్న అనుమానంతోనే పవన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర పెద్దల నుంచి సానుకూల ప్రకటన రాకపోవడం వల్లే మరోసారి ఆలోచించకుండా ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బిజెపితో కలిసి నడిచేందుకు పవన్ నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం పై పోరాడే క్రమంలో బిజెపి, జనసేన సంయుక్తంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ కమిటీని సైతం ఏర్పాటు చేసుకున్నాయి. కానీ ఎక్కడ ఉమ్మడిగా వెళ్లిన దాఖలాలు లేవు. అటు ఉప ఎన్నికల్లో సైతం ఒకరికొకరు మద్దతు ప్రకటించలేదు.కానీ ఇటీవల తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి కడతాయని ప్రచారం జరిగింది. అటు పవన్ కు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సైతం బిజెపి ఆహ్వానించింది. ఎన్డీఏకు నమ్మకమైన మిత్రుడిగా పవన్ మారారు. కానీ ఏపీ రాజకీయాల్లో అస్పష్టతకు బిజెపియే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో పవన్ మనసు మార్చుకున్నట్లు సమాచారం.
ఏపీలో టిడిపి, జనసేన బలంతో పోల్చుకుంటే బిజెపి బలం అంతంత మాత్రం. ఇటీవల వచ్చిన సర్వేల్లో సైతం ఏపీలో బిజెపికి కనీస ఓటు శాతం కూడా లేదని తేలింది. పైగా టిడిపి,జనసేనతో బిజెపి జత కడితే కూటమికి నష్టమని తేలింది. అదే సమయంలో వామపక్షాలు కలిసి వస్తే అద్భుత విజయం దక్కించుకోవచ్చని సర్వే తేల్చింది. అటు ఎన్నికల సమీపిస్తున్న కొలది బిజెపి అగ్ర నేతలు స్పష్టత ఇవ్వకపోవడం.. చంద్రబాబు అరెస్టు విషయంలో సైతం స్పందించకపోవడం.. ఈ అరెస్టు వెనుక జగన్కు కేంద్ర పెద్దల ప్రోత్సాహం ఉందని ప్రచారం జరగడం.. ఇన్ని పరిణామాల నడుమ పవన్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించడం విశేషం.