నోటుకు ఓటు రాజకీయాలు దేశంలో చాలా కామన్ అయిపోయాయి. నోట్లతో ఓట్లను కొని ప్రజాప్రతినిధులుగా గెలిచే వారు ఎందరో ఉన్నారు. అందుకే అక్రమార్కులు సైతం ప్రజాప్రతినిధులుగా గెలిచి.. మంత్రులై మన నెత్తిమీదే కూర్చుంటున్నారు. మహారాష్ట్రలోని ఓ పార్టీ కోట్లు కుమ్మరించి ఓట్లను కొని గత ఎన్నికల్లో గెలుస్తోందని.. అవినీతి పరులకు కొమ్ము కాస్తుందని అక్కడి మీడియా, నేతలు కూడా వాపోతున్నారు. ఇటీవల ఆ పార్టీ మంత్రి ఈడీకి పట్టుబడడంతో అంతా ఇదే కామెంట్ చేస్తున్నారు. దేశంలో నీట్ పాలిటిక్స్ చేద్దామంటే కొన్ని రాష్ట్రాల్లో అస్సలు వీలు కావడం లేదు..

-తెలుగు రాజకీయాల్లో పైసకు విలువలేదు..
మొన్నటి హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటుకు రూ.6వేల నుంచి రూ.10వేలు పంచిన నీతిగా, నిజాయితీగా కేసీఆర్ ను ఎదురించి నిలబడ్డ ఈటల రాజేందర్ నే జనం గెలిపించారు. డబ్బులు తీసుకొని మరీ ఈటలకు పట్టం కట్టారంటే మన తెలుగు ప్రజల్లో అంతో ఇంతో విశ్వాసం.. ప్రజాస్వామ్యంను బతికించాలన్న సోయి ఉంది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చంద్రబాబు తన పాలన చివరలో ‘పసుపు కుంకుమ’ పేరిట మహిళలకు రూ.10వేల చొప్పున ప్రభుత్వ సొమ్మును పప్పూ బెల్లాల్లా పంచినా కూడా జనాలు మాత్రం వైఎస్ జగన్ నే గెలిపించారు. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో పైసలకు ఓటును ప్రజలు అమ్ముకోరని అర్థమవుతోంది.
-ఉత్తరాదిన డబ్బులే నడుస్తాయి?
బీహార్, ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల డబ్బుల ప్రవాహం నడిచింది. మద్యం, నగదును ఏరులై పారించారు. డబ్బులను విచ్చలవిడిగా పంచిన రాజకీయ నాయకులు మూడు రాష్ట్రాల్లో హంగ్ ను సృష్టించారన్న అపవాదు వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో హంగ్ వచ్చిందంటే అక్కడి ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. తమను పాలించే పార్టీని ఎంచుకోవడంలో ఘోరంగా తప్పటడుగులు వేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రజలు తమ భవిష్యత్తును మార్చే పార్టీ కంటే కూడా డబ్బు బలానికి అమ్ముడుపోయారనే విమర్శలు వస్తాయి. రిసార్ట్ లో క్యాంపు రాజకీయాలు… నేతలను జల్సాలకు పంపి గంపగుత్తగా కులాల ఓట్లను కొనడం.. అవకాశ వాద రాజకీయాలు నడిచాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
-డబ్బుకు అమ్ముడుపోయిన హంగ్ తెచ్చుకున్నారా?
ఐదు రాష్ట్రాల్లో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లలో హంగ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడి నేతలు అసహ్యకరమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని తాజాగా ఎగ్జిట్ పోల్స్ ను బట్టి తెలుస్తోంది.హంగ్ వస్తే మళ్లీ జనాల ఓట్లను కొన్న పార్టీలు ఇప్పుడు ఎమ్మెల్యేను కొంటాయి. ఎమ్మెల్యే రూ.5 కోట్లో, రూ.10 కోట్ల చొప్పున కొని ప్రజాస్వామ్యాని కూనీ చేస్తాయి. ఈ తీరు ప్రజాస్వామ్యానికే చెడ్డపేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రోజురోజుకు దేశంలో రాజకీయాలు అసహ్యకరంగా మారుతున్నాయి. 3 రాష్ట్రాల్లో హంగ్ వస్తుందనే భారత రాజకీయాల్లో ధనబలం, క్యాంపు రాజకీయాలు, అవకాశవాద నేతలు ఎంత ప్రలోభాలకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో అర్థమవుతోంది. పూర్తి స్థాయి మెజార్టీతో సుస్థిర ప్రభుత్వం లేకుంటే ఆ రాష్ట్ర పాలన అథోగతిగా మారుతుంది. ప్రజలైనా తమను పాలించే ప్రభుత్వాన్ని క్లియర్ కట్ గా ఎన్నుకుంటే ఇలాంటి ఉపద్రవాలన్నీ ఆగిపోతాయి. ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.