Military Rankings: ప్రపంచంలో రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఆధిపత్యం కోసం కొన్ని దేశాలు చిన్న, బలహీన దేశాలపై దాడులకు తెగబడుతున్నాయి. తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నాయి. ఇందుకోసం తమ సైనిక బలాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. మరోవైపు చిన్న దేశాలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు సైనిక శక్తిపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన దేశంగా అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. మరి పవర్‌ఫుల్ ఆర్మీ కలిగిన దేశాల్లో మన స్థానం ఏంటో తెలుసుకుందాం.
ఏ దేశానికైనా సైన్యం కీలకం..
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశానికి అయినా రక్షణ దళం అత్యంత కీలకంగా మారింది. విదేశాల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనడంలో, దేశంలో అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ ఆర్మీనే కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు సరిగా పనిచేయకుంటే ఆర్మీ రంగంలోకి దిగి పాలనా పగ్గాలు చేపడుతుంది. కొన్ని దేశాలు తమ కోసం కాకుండా తమ మిత్ర దేశాలు ఆపదలో ఉన్నప్పుడు ఆర్మీని అక్కడకు పంపించి పరిస్థితులను చక్కదిద్దుతున్నాయి. ఇక సంపన్న దేశాలు అయితే తమ ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలు, పోరాట సామర్థ్యాన్ని పెంచి మరింత బలీయంగా తయారు చేసుకుంటున్నాయి.
అగ్రస్థానంలో అమెరికా.. అట్టడుగున భూటాన్..
ఇక శక్తివంతమైన ఆర్మీ ఉన్న దేశాల్లో అగ్ర రాజ్యం అమెరికా అగ్రస్థానంలో నిలవగా, భూటాన్ అట్టడుగున ఉంది. రష్యా, చైనా 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత 4వ స్థానంలో మన భారత్ ఉంది. ప్రపంచ రక్షణ సమాచారాన్ని పర్యవేక్షించే గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్‌సైట్ 2024 ఏడాదికి సంబంధించి ప్రపంచ దేశాల్లోని సైనిక శక్తిపై ర్యాంకింగ్స్ విడుదల చేసింది. మొత్తం 145 దేశాల సైన్యం ర్యాంకులను వెల్లడించింది.
ర్యాంకింగ్ ఇలా..
ఇక ర్యాంకింగ్‌లో ఈ అంశాలను గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్‌సైట్ పరిగణనలోకి తీసుకుంది. అందులో మొదటిది సైనికుల సంఖ్య, సైనిక పరికరాలు, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక స్థానం, అందుబాటులో ఉన్న వనరులతోపాటు మొత్తం 60 అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయించింది. ఇక సైన్యానికి కేటాయించే బడ్జెట్ పరంగా చూస్తే అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా, రష్యా, భారత్ వరుసగా 2, 3, 4వ స్థానాల్లో నిలిచాయి. మన దాయాది దేశం పాకిస్తాన్ 47, పొరుగున ఉన్న బంగ్లాదేశ్ 43వ స్థానంలో ఉన్నాయి.
టాప్ – 10లో ఉన్న దేశాలివీ..
ఇక అమెరికా, రష్యా, చైనా, భారత్ వరుసగా నాలుగు స్థానాల్లో ఉండగా, టాప్ – 10 జాబితాలో ఈ దేశాలు ఉన్నాయి. దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, తుర్కియే, పాకిస్తాన్, ఇటలీ నిలిచాయి. ఇక ర్యాంకింగ్స్‌లో చివరి స్థానంలో భూటాన్ నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన ఆర్మీ ఉన్న దేశంగా భూటాన్ నిలిచింది. దీనికంటే ముందు మాల్డోవా, సూరినామ్, సోమాలియా, బెనిన్, లైబీరియా, బెలిజ్, సియెర్రా లియోన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఐలాండ్ దేశాలు చివరి పది దేశాల జాబితాలో ఉన్నాయి.