Miss World 2024: ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. దీని ట్రాక్ రికార్డు తెలుసా?

మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ నిర్ణయంతో సుమారు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ మళ్లీ మిస్‌ వరల్డ్‌ పోటీలకు వేదికగా నిలవనుంది. 1996లో బెంగళూరు వేదికగా ఇండియాలో భారత్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించారు.

Written By: Raj Shekar, Updated On : January 20, 2024 10:32 am

Miss World 2024

Follow us on

Miss World 2024: భారత దేశం ఈ ఏడాది ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక కాబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ తన అధికారిక ఎక్స్‌(ట్విటర్‌)లో ఖాతాలో ఈమేరకు ప్రకటించింది. “మిస్ వరల్డ్ అతిథ్య దేశంగా భారత్ ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అందంతోపాటు వైవిధ్యం, సమాజంపై అవగాహన, సాధికారతల కలబోత అయిన ఈ అద్భుత వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమవ్వండి” అని రాసుకొచ్చారు.

28 ఏళ్ల తర్వాత..
మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ నిర్ణయంతో సుమారు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ మళ్లీ మిస్‌ వరల్డ్‌ పోటీలకు వేదికగా నిలవనుంది. 1996లో బెంగళూరు వేదికగా ఇండియాలో భారత్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించారు.

ఫిబ్రవరి 18 నుంచి..
ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు దేశ రాజధాని ఢిల్లీలోని భారత్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, ఆర్థిక రాజధాని ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్‌ పోటీలను రాత్రి 7.30 నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

అందంతోపాటు సేవ, సామాజిక అవగాహన..
ఈ అందాల పోటీలు కేవలం అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు, సమాజంలో సానుకూల మార్పును తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం ముఖ్య ఉద్దేశం. తొలిసారిగా మిస్ వరల్డ్ ఈవెంట్ ను 1951లో నిర్వహించారు. గతంలో భారత్‌కు చెందిన ఐశ్వర్యరాయ్‌, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్‌ తదితరులు మిస్‌ వరల్డ్‌గా ఎంపికయ్యారు.

భారత్ కు వచ్చిన కిరీటాలు..
– 1966లో భారత్కు చెందిన రీటా ఫారియా తొలిసారి ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

– 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్’గా ఎంపికయ్యారు.

– 2022లో చివరిసారిగా నిర్వహించిన పోటీల్లో పోలెండ్ కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు. ఈ ఏడాది గెలుపొందిన వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని బహూకరిస్తారు.