Nara Lokesh: తెలుగుదేశం పార్టీలో లోకేష్ స్థాయి పెరిగింది.. ఇది ఎవరో రాజకీయ ప్రత్యర్థులో, విశ్లేషకులో అన్నమాట కాదు. సాక్షాత్ ఆ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు. లోకేష్ ను సొంత పార్టీ నాయకులే తక్కువ చేసిన సందర్భాలున్నాయి. ఆయనపై నమ్మకం కంటే అప నమ్మకం వ్యక్తం చేసిన వారే అధికం. అంతర్గత సమావేశాల్లో అయితే అధినేత కుమారుడు అని చూడకుండా లోకేష్ పై సటైర్లు పడుతుండేవి. పార్టీలో సీనియర్లు సైతం లోకేష్ ను దృష్టిలో పెట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. పార్టీ మెజార్టీ శ్రేణులు, చంద్రబాబును అభిమానించే వారు సైతం లోకేష్ విషయానికి వచ్చేసరికి ఒక నిర్లిప్తత, నిరాసక్తత, అసహనం ప్రదర్శించారు. లోకేష్ పనితీరు భేరీజు వేసుకునే జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించే వారు. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం జూనియర్ ను తేవాలని పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లు లోకేష్ తో వర్కవుట్ అయ్యేలా లేదు జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించాలని అధినేతకు అల్టిమేట్ ఇచ్చే స్థాయికి వచ్చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే మరో ముందడుగు వేసి పార్టీ లేదు బొక్కా లేదు అంటూ లోకేష్ పనితీరును తేలిగ్గా మాట్లాడేసినట్టు కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తిరుపతిలో ఓ హోటల్ లో అంతర్గత సమావేశంలో మాట్లాడిన అచ్చెన్న ఆయన బాగుంటే అంటూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ పై చేసిన కామెంట్స్ ప్రత్యర్థులకు వరంగా మారాయి. చివరకు తాను ఆ మాటలు అనలేదని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చుకునే దాకా పరిస్థితి వచ్చింది.
అయితే ఇప్పుడు యువగళం పేరిట లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టేసరికి టీడీపీ సీనియర్లు ఆయనపై అపార నమ్మకం పెట్టుకున్నారు. మంచి భవిష్యత్ ఉన్న నాయకుడిగా కీర్తించడం మొదలుపెట్టారు. చంద్రబాబు కంటే మెరుగైన నాయకుడిగా పేర్కొనడం విశేషం. అచ్చెన్నాయుడు అయితే ఓ రేంజ్ లో లోకేష్ ను ఆకాశానికి ఎత్తేశారు. మంత్రిగా మంచి ఫెర్మారెన్స్ చూపారని.. రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి రాలేదని.. తనకున్న తెలివితేలతో వచ్చారని కీర్తించారు. చంద్రబాబు లాంటి మెతక వైఖరి లోకేష్ ది కాదని.. అధికారంలోకి వస్తే ఇంతకింత బదులు ఉంటుందని వైసీపీ నేతలకు హెచ్చరించారు. భావి నాయకుడు లోకేషే అన్నంత రీతిలో అచ్చెన్న చూపించేసరికి సొంత పార్టీ శ్రేణుల్లో సైతం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నాడు పార్టీ లేదు బొక్కా లేదు అన్న నోటితోనే లోకేష్ ను కీర్తిస్తుండడంతో యువ నాయకుడిపై అప నమ్మకం అన్న అపవాదు పోయి నమ్మకం అనే మాట వస్తోందని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే దీనిపై రాజకీయ ప్రత్యర్థులు, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం చాలా వేగంగా స్పందించింది. నాడు తిరుపతి హోటల్ లో అచ్చెన్న చేసిన కామెంట్స్.. నిన్న యువగళంలో చేసిన ప్రసంగాన్ని చూపి…రెండేళ్లకే లోకేష్ లో అచ్చెన్నకు ఏం మార్పు కనిపించిందబ్బా అంటూ ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. అప్పటికీ.. ఇప్పటికీ ఏంటి తేడా అన్న సినిమా డైలాగులు గుర్తుచేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇవి తెగ ట్రోల్ అవుతున్నాయి. నెటిజెన్లు కూడా చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.