Hakimpet Sports School : హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో కీచకుడు: ఈ తెలంగాణ బ్రిజ్ భూషణ్ పై కెసిఆర్ చర్యలు తీసుకుంటారా?

కా బ్రిజ్ భూషణ్ మీద ఒంటి కాలు మీద లేచిన భారత రాష్ట్ర సమితి నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ వ్యవహారం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తున్నది.

Written By: K.R, Updated On : August 13, 2023 4:41 pm
Follow us on

Hakimpet Sports School : బ్రిజ్ భూషణ్.. ఈ పేరు గుర్తుంది కదా.. మొన్నటిదాకా భారత క్రీడాకారులు ఇతడి పై చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కి మరీ నిరసన తెలిపారు. లైంగికంగా వేధిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం దేశ పార్లమెంట్ ను సైతం స్తంభింపజేసింది. ఇక బ్రిజ్ భూషణ్ ను ఆ పదవి నుంచి తొలగించాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. మంత్రి కేటీఆర్ అయితే వరుస ట్వీట్లతో కేంద్రం మీద విరుచుకుపడ్డారు. ఎక్కడో ఢిల్లీలో జరిగిన సంఘటన మీద ఆ స్థాయిలో నిరసన వ్యక్తం అయింది. మరి అలాంటి అధికారి తెలంగాణలో తిష్ట వేశాడు. హాకీ పేటలోని స్పోర్ట్స్ స్కూల్ ను భ్రష్టు పట్టిస్తున్నాడు.

హకీమ్ పేట స్పోర్ట్స్ స్కూల్.. తెలంగాణలో ఎంతోమంది గొప్ప గొప్ప క్రీడాకారులను తయారుచేసిన కార్యస్థలం అది. ఇప్పటికీ వందలాది మంది విద్యార్థులు అక్కడ శిక్షణ పొందుతారు. అని అలాంటి స్పోర్ట్స్ స్కూల్లో ఒక కీచకుడు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాడు. చీకటి పడగానే విద్యార్థులను తన గదికి రప్పించుకుంటాడు. తల నొప్పిగా ఉంది.. పెయిన్ బామ్ తీసుకురావాలని ఇన్ డైరెక్ట్ గా ఆదేశాలు జారీ చేస్తాడు. అలా వెళ్లిన యువతుల పట్ల అధికారి అసభ్య చేష్టలతో లైంగికంగా వేధింపులకు పాల్పడతాడు. సాయంత్రాలైతే ఆటవిడుపు పేరుతో కొందరు యువతులను కారు ఎక్కించుకొని బలవంతంగా బయటికి తీసుకెళ్తున్నాడు. అత్యంత జుగుప్సాకరమైన చేష్టలకు పాల్పడుతున్నాడు. ఫలితంగా అక్కడ శిక్షణ పొందుతున్న యువతులు భయం భయంగా గడుపుతున్నారు.

నిబంధనల ప్రకారం.. బాలికల హాస్టల్ లో పురుష అధికారులు తిష్ట వేయకూడదు. అత్యవసరంగా అర్ధరాత్రి పూట వెళ్లాల్సి వచ్చినా మహిళా అధికారులు, మహిళ వార్డెన్ ల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒకవేళ వెళ్లినా వెంటనే బయటికి వచ్చేయాలి. ఒకవేళ ఆ అధికారి ఏ విద్యార్థి నైనా బయటికి తీసుకెళ్లాల్సి వస్తే తోడుగా మరో మహిళా వార్డెన్ తప్పనిసరిగా ఉండాలి. కానీ సదరు అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ఏకంగా బాలికల హాస్టల్ లోని గెస్ట్ రూమ్ లోనే మకాం పెట్టాడు. తమ పట్ల ఆ అధికారి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారంటూ హాస్టల్లోని యువతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారి బలవంత పెట్టడంతో అతనితో కలిసి బయటకు వెళ్తున్న యువతులు, అతడు చేసిన చేష్టలను చెప్పుకొని మహిళా ఉద్యోగుల వద్ద బావురు మంటున్నారు.

ఇక సదరు అధికారి ఆ స్పోర్ట్స్ స్కూల్లో పనిచేసే ఉద్యోగినితో సంబంధం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. యువతుల పట్ల ఆయన పాల్పడుతున్న ఆగడాలకు ఆమె, ఇద్దరు సీనియర్ కోచ్ లు సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రోజూ సదరు అధికారి కాళ్ళు మొక్కాలంటూ యువతులను ఆ సీనియర్ కోచ్ లు వేధిస్తున్నట్టు సమాచారం. కొన్ని సంవత్సరాల క్రితం ఓ బాలిక ఒకరోజు కొన్ని గంటల పాటు పాఠశాల ప్రాంగణంలో కనిపించలేదు. ఆందోళన చెందిన అధికారులు పాఠశాల ప్రాంగణంలో వెతికారు. ఆ బాలిక కాసేపటికి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి గదికి ఎదురుగా ఉన్న మహిళా ఉద్యోగి గదిలో కనిపించింది. గుర్తించిన మిగతా అధికారులు మాట్లాడేందుకు వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు ఆ బాలిక లోదుస్తుల్లో కనిపించడంతో నివ్వెర పోయారు. తర్వాత కొద్ది రోజులకే అనారోగ్యం పాలయిందని, నెలసరి విషయంలోనూ సమస్యలు తలెత్తాయని సమాచారం. సదరు మహిళా ఉద్యోగి వినియోగించే జడ పిన్నులు,హెయిర్ బ్యాండ్ లు ఆ అధికారి గదిలో కనిపించడం విశేషం. ఈ విషయం స్వీపర్ల ద్వారా బయటకు పొక్కుతుందని గమనించిన ఆయన, వారిని తీవ్రంగా హెచ్చరించినట్టు తెలిసింది. స్పోర్ట్స్ స్కూల్ ప్రాంగణంలో అధికారులు, తమ గురించే చర్చించుకుంటున్నారన్న అనుమానంతో మహిళా ఉద్యోగులను కూడా ఆయన హెచ్చరించినట్టు, మానసికంగా వేధింపులకు గురిచేసినట్టు సమాచారం.

మంత్రి అండదండలు

అయితే ఇప్పటికే వివిధ క్రీడల్లో మంచి ప్రతిభ కలిగి, పతకాలు సాధించి ఉండటం, భవిష్యత్తులో పాల్గొనాల్సిన క్రీడలకు సంబంధించిన శిక్షణ నడుస్తుండడంతో సదరు అధికారి పాల్పడుతున్న లైంగిక వేధింపులను బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు. అధికారి చేష్టలపై స్పోర్ట్స్ అథారిటీకి చెందిన ఉన్నతాధికారులకు ఇప్పటికే ఫిర్యాదు వెళ్లింది. కాగా సదరు అధికారికి ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండడం, ఉద్యోగుల సంఘం లోనూ ఆయన కీలకంగా ఉండడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుతున్నట్టు సమాచారం. మొన్నటిదాకా బ్రిజ్ భూషణ్ మీద ఒంటి కాలు మీద లేచిన భారత రాష్ట్ర సమితి నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ వ్యవహారం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తున్నది.