Homeజాతీయ వార్తలుGujarat Assembly Elections : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 2024ను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి?

Gujarat Assembly Elections : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 2024ను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి?

Gujarat Assembly Elections : గుజరాత్ ఎన్నికలు మరో 15 రోజుల్లో జరగబోతున్నాయి.. డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు.. మూడు పార్టీలు బరిలో ఉన్నాయి. 2017 దాకా కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ ఉండేది.. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలో ఆరున్నర కోట్ల జనాభా ఉంది.. ఇందులో 11 శాతం ముస్లింలు ఉన్నారు.. మొత్తం 182 నియోజకవర్గాలు ఉన్నాయి.. అయితే ఈసారి ఇక్కడ జరిగే ఎన్నికలు 2024లో ఢిల్లీ పీఠం ఎవరు అధిష్టిస్తారో నిర్దేశిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

1997 నుంచి..

1997 నుంచి ఇప్పటిదాకా బిజెపి గుజరాత్ రాష్ట్రాన్ని ఏలుతోంది. 2014 దాకా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత విజయ రూపాని, భూపేంద్ర గుజరాత్ ముఖ్యమంత్రులు అయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోది లేనప్పటికీ.. ఆయన చరిష్మా తోనే బిజెపి ఇంతకాలం కొనసాగింది. ఇప్పుడు కూడా మోడీ బొమ్మను పెట్టుకునే ఓట్లు అడుగుతోంది. ఒక ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో తప్ప.. మిగతా అన్ని రాష్ట్రాల్లో బిజెపి నరేంద్ర మోడీ ఫోటో ద్వారానే ప్రచారం చేస్తున్నది. గత ఎన్నికల్లో 99 సీట్లకే బిజెపి పరిమితమైంది. సౌరాష్ట్రలో అతి తక్కువ సీట్లు సాధించింది..

ఇప్పటి పరిస్థితి ఏంటి

2017 తో పోలిస్తే ఇప్పుడు గుజరాత్లో త్రిముఖ పోరు నెలకొంది. మొన్నటిదాకా కాంగ్రెస్, బిజెపి పోటాపోటీగా ఉండేవి.. ఇప్పుడు వాటి మధ్య ఆప్ వచ్చింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. బిజెపి హిందుత్వ అజెండాను తన ప్రచారంలో వాడుకుంటున్నారు. ముఖ్యంగా పాటిదారులను ఆకర్షిస్తున్నారు. అయితే చదువుకున్న యువత ఆమ్ ఆద్మీ పార్టీకి జై కొడుతోందని విశ్లేషకులు అంటున్నారు. గుజరాతీలకు సెంటిమెంట్ అయిన చార్ధామ్ యాత్రను ఉచితంగా కల్పిస్తామని అరవింద్ పదేపదే అంటున్నారు.

గాంధీ కుటుంబం లేకుండానే కాంగ్రెస్

2017 లో రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల సందర్భంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చింది. రాష్ట్రంలో నమోదైన పోలింగ్లో సుమారు 40 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. నలభై శాతం ఓట్లు అంటే సాలిడ్ ఓటు బ్యాంకు కింద లెక్క. ఇదే సమయంలో బిజెపి 49.1% ఓటు బ్యాంకుతో అధికారాన్ని దక్కించుకుంది. ఒకవేళ ఈ ఓటు బ్యాంకు కొంచెం తేడా అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడోయాత్ర కు విశేష స్పందన లభిస్తోంది. అయితే ఆ యాత్ర గుజరాత్ రాష్ట్రంలో జరగకపోవడం గమనార్హం. అయితే ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో తమ స్థానిక నాయకులనే నమ్ముకుంది. గాంధీ కుటుంబం లేకుండా ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. అధికారం మాదే అని ధీమా వ్యక్తం చేస్తోంది.

2024 కు ఇదే రోడ్ మ్యాప్

1997 తర్వాత గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గెలవలేదు. కానీ తన ఓటు బ్యాంకు ను కోల్పోలేదు. ఇదే సమయంలో 2024 ఎన్నికలను గుజరాత్ ఫలితాలు నిర్దేశిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఒకవేళ గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఓడిపోతే ఆ ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుందని వారు చెప్తున్నారు. గుజరాత్ ఎన్నికల తర్వాత దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ, ఉత్తరాదిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఒక రాష్ట్ర ఎన్నికలు ఇంకో రాష్ట్రం ఎన్నికలను ప్రభావితం చేయకపోయినప్పటికీ.. ఇక్కడ గుజరాత్ రాష్ట్రం అనేది మోడీ సొంత ప్రాంతం కాబట్టి అందరి దృష్టి ఆ ఎన్నికలపైనే ఉంది.. అయితే ఈసారి గుజరాత్ రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో.. ఓటరు ఎటువైపు మొగ్గుతారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఒకవేళ బిజెపికే ఓటర్లు జై కొడితే… దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ చరిష్మాకి వచ్చిన డోకా ఉండదు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు మరింత కలిసికట్టుగా పనిచేయాల్సిన అనివార్యత ఏర్పడుతుంది.. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యమేనా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular